ప్రపంచంలో చిప్ లు ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు..?
చైనాను.. అమెరికా ఎలా అడ్డుకుంటుంది..?
అమెరికా ఆంక్షలతో చైనా ఏం చేయబోతోంది..? అమెరికా ఆంక్షలు చైనాను ఎక్కడ దెబ్బతీస్తున్నాయి.?
చమురు కోసం శతాబ్దానికి పైగా సాగిన పోరు యుద్ధాలకు దారితీసింది. అసాధారణ పొత్తులు, దౌత్య సంబంధాలకూ కారణమైంది.ఇపుడు ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు మరొక విలువైన వనరు కోసం పోరాడుతున్నాయి. అవే సెమీ కండక్టర్స్… అంటే ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే చిప్స్. దాదాపు రూ.40 లక్షల కోట్లు విలువైన ఈ పరిశ్రమ 2030 నాటికి రెట్టింపు కానుంది.చిప్‌ల తయారీ, వనరులు, నెట్‌వర్క్, సరఫరా మీద ఆధిపత్యం ఎవరికి ఉంటుందో వారే సూపర్ పవర్ అవుతారు.
చిప్ లను ఉత్పత్తి చేసే సాంకేతికతను చైనా కావాలనుకుంటోంది. అందుకే ఆ టెక్నాలజీలో ముందున్న అమెరికా, చైనాను దూరంగా ఉంచుతోంది. రెండు దేశాలు ఆసియా పసిఫిక్ లో ఒకదానితో మరొకటి తలపడుతున్నాయని ‘చిప్ వార్స్’ రచయిత ప్రొఫెసర్ క్రిస్ మిల్లర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.. క్షిపణులు, యుద్ధ నౌకల ఉత్పత్తే కాకుండా సైన్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని పెంచుతున్నాయని అంటున్నారు. చిప్ వార్ విషయంలో ఇప్పటికైతే అమెరికాదే విజయం. కానీ, చైనాపై ప్రకటించిన చిప్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చబోతోంది.సెమీ కండక్టర్ల తయారీ సంక్లిష్టమైంది.. ప్రత్యేకమైంది… సమగ్రమైంది. ఐఫోన్ చిప్ లు అమెరికాలో డిజైన్ చేసి, తైవాన్, జపాన్ లేదా దక్షిణ కొరియాలో తయారు చేసి వాటిని చైనాలో అసెంబుల్ చేస్తారు. పరిశ్రమల్లో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్న భారతదేశం భవిష్యత్తులో పెద్ద పాత్ర పోషించవచ్చు.
సెమీకండక్టర్లు అమెరికాలో కనుగొన్నారు. అయితే అధిక సబ్సిడీలు సహా ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా తూర్పు ఆసియా వాటి తయారీ హబ్‌గా మారింది.. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో రష్యా ప్రభావానికి లోనయ్యే ప్రాంతాల్లో వ్యాపార సంబంధాలు, వ్యూహాత్మక పొత్తులను అభివృద్ధి చేసుకోవడానికి దీని ద్వారా వాషింగ్టన్‌కు అవకాశం దొరికింది. ఆసియా పసిఫిక్ లో చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆ వ్యూహాత్మక పొత్తులు అమెరికాకు ఉపయోగకరంగా ఉన్నాయి.అత్యంత చిన్న పరిమాణంలో అత్యంత సమర్థవంతమైన చిప్‌లను తయారు చేయడం మీద తీవ్రమైన పోటీ నెలకొంది.
చిప్‌ల కోసం తైవాన్ తో పాటు ఇతర ఆసియా దేశాల మీద ఆధారపడటం అమెరికాను ఇబ్బందికి గురి చేస్తోంది. మరొకవైపు చిప్ తయారీ సాంకేతికత, చైనాకు అందకుండా చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.అమెరికా కంపెనీలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా చైనాకు చిప్‌లు, సాంకేతికత వంటి వాటిని అమ్మడం మీద బైడెన్ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. చైనా కర్మాగారాల్లో అమెరికా పౌరులు లేదా అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండే వాళ్లను పని చేయనివ్వకుండా నిషేధించింది.
ఇది చైనాను తీవ్రంగా దెబ్బతీసింది. ఎందుకంటే చైనా హార్డ్‌వేర్, మానవ ప్రతిభను రెండింటినీ దిగుమతి చేసుకుంటుంది. చైనా నుంచి ఆర్జించే ఆదాయంలో నెదర్లాండ్స్ ఏఎస్‌ఎంఎల్ నాలుగింట ఒక వంతు కోల్పోతుంది. అత్యాధునికమైన లితోగ్రాఫిక్ మెషీన్‌లను తయారు చేసే ఏకైక సంస్థ ఇది. అవి “లీడింగ్ ఎడ్జ్” చిప్‌లను తయారు చేస్తాయి.‘‘ఇక్కడ టాలెంట్ చాలా ముఖ్యం. చైనాలోని సెమీకండక్టర్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లను పరిశీలిస్తే చాలా మంది అమెరికన్ పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్నారు. అమెరికాలో శిక్షణ పొందినవారు, గ్రీన్‌కార్డులు కలిగి ఉన్నారు. కాబట్టి ఇది చైనాకు నిజంగా పెద్ద సమస్య” అని పాలసీ రిసెర్చ్ కంపెనీ అయిన ట్రివియం చైనా అనలిస్ట్ లింగావో బావో అభిప్రాయం వ్యక్తం చేశారు.
అమెరికా కూడా మరిన్ని చిప్ లను తయారు చేయాలనుకుంటోంది. అమెరికాలోని చిప్స్ అండ్ సైన్స్ చట్టాలు సెమీ కండక్టర్లను తయారు చేసే కంపెనీలకు రూ.4 లక్షల కోట్ల గ్రాంట్లు, సబ్సిడీలను అందిస్తోంది. ప్రధాన కంపెనీలు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. అమెరికాలోని రెండు ప్లాంట్లలో తైవాన్ కు చెందిన టీఎస్‌ఎంసీ రూ.3 లక్షల కోట్లు విలువైన పెట్టుబడి పెడుతోంది. న్యూయార్క్‌లోని అప్‌స్టేట్‌లో ఉన్న కంప్యూటర్ చిప్ ప్లాంట్‌లో రాబోయే 20 సంవత్సరాలలో మైక్రోన్ కంపెనీ రూ.8 లక్షల కోట్లు వరకు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించింది.
మైక్రోన్ సూపర్ కంప్యూటర్లు, మిలిటరీ హార్డ్‌వేర్, ప్రాసెసర్ గల పరికరాలకు మెమొరీ చిప్‌లు తయారుచేసే అమెరికా ఆధారిత అతిపెద్ద కంపెనీ. “చిప్స్ చట్టం అమెరికా, ఆసియాలలో ఉత్పత్తి వ్యయ వ్యత్యాసాన్ని తగ్గించగలదు” అని మైక్రోన్ టెక్నాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ మెహ్రోత్రా అంటున్నారు. ఆసియాలోని ప్లాంట్లలో మైక్రాన్ పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తుందని సంజయ్ ప్రకటించారు.ఆంక్షల నేపథ్యంలో చైనా చిప్ కంపెనీలలో ఒకటైన యాంగ్జీ మెమరీ టెక్నాలజీస్ కార్ప్ నుంచి మెమొరీ చిప్‌లను కొనుగోలు చేసే ఒప్పందాన్ని యాపిల్ నిలిపివేసింది.
శామ్‌సంగ్ తర్వాత ప్రపంచంలోని రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారు అయిన హువావే చతికిలబడిందని అనలిస్ట్ లు వెల్లడించారు. “కాబట్టి ఒక చైనీస్ టెక్ కంపెనీని నిర్వీర్యం చేయడం వాషింగ్టన్‌కు ఎంత సులభం. దానిపై ప్రతిస్పందించడానికి చైనాకు అవకాశం కూడా లేదు.గతంలో అమెరికా, చైనా వ్యక్తిగత కంపెనీలను లక్ష్యంగా చేసుకుంది. కానీ ఈసారి పరిధి మొత్తం దేశానికి విస్తరించింది…. ప్రతిస్పందనగా చైనా ఏదైనా చేయగలదా..? అంటే దాని ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంటున్న సమయంలో వస్తువులు లేదా సేవలను ఉపసంహరించుకోవడం లేదా ఎగుమతులపై నియంత్రణలు విధించడం వల్ల మంచి కంటే నష్టమే ఎక్కువ జరగవచ్చు. అమెరికా నిర్ణయంపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి బీజింగ్ ఫిర్యాదు చేసింది. అయితే పరిష్కారానికి సంవత్సరాలు పట్టవచ్చు. ఇదిలా ఉండగా చైనా తన దేశీయ చిప్ తయారీ పరిశ్రమకు పెట్టుబడి, సాయం రెట్టింపు చేస్తుందని నిపుణులు అంటున్నారు.
యుక్రెయిన్‌లో యుద్ధం, ద్రవ్యోల్బణం పెరుగుదల, చైనా ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకుల కారణంగా ప్రపంచ మందగమనంతో పరిశ్రమలు పోరాడవలసి ఉంటుంది. కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ భారీ నష్టాన్ని ఎదుర్కొన్నందున బీజింగ్ జాగ్రత్తగా నడవాలని కోరుకుంటుంది. “యుఎస్, తైవాన్, చైనీస్, ఇతర దేశాలకు చెందిన కంపెనీల మధ్య ఇంకా చాలా వ్యత్యాసం ఉంది.
ఇన్నోవేషన్ నెట్‌వర్క్‌లో చైనాను దూరం చేయడానికి అమెరికా ప్రయత్నాలను, అమెరికా రహిత సప్లై చైన్‌ను నిర్మించడానికి చైనా ప్రయత్నాలనూ మనం చూడబోతున్నాం.. ఒకటి చైనాపై, మరొకటి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలపై దృష్టి పెట్టింది. కంపెనీలను ఏదో ఒకటి ఎంచుకోమని బలవంతం చేయవచ్చు. చైనీస్ మార్కెట్‌ను యాక్సెస్ చేయకుండా చాలా కంపెనీలను దూరం చేయవచ్చు. చూడాలి చైనా ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో..