Homeఅంతర్జాతీయంఉక్రెయిన్ కు ఆయుధ సాయం... నాటోలో భిన్నాభిప్రాయాలు

ఏడాది కాలంగా ఉక్రెయిన్, రష్యాల యుద్దం కొనసాగుతోంది.. ఉక్రెయిన్ పై రష్యాకి దిగడంతో మొదలైన యుద్దం తీవ్ర స్థాయికి చేరింది.. అమెరికా సహా నాటో దేశాల సహాయంతో రష్యాతో పోరాడుతోంది ఉక్రెయిన్.. యుద్దంలో కోల్పోయిన భూభాగాలలోని కొన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకుంటూ వస్తోంది.. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ కు సహాయం చేస్తోన్న నాటో దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం ఉక్రెయిన్ కు శాపంగా మారనుందా..?

ఉక్రెయిన్ కు అమెరికా సహా నాటో దేశాలు ఇప్పటికే చాలా మొత్తంలో ఆర్థిక సహాయం చేశాయి.. రష్యాను ఓడించేందుకు అత్యాధునిక ఆయుధాలు అందించాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు.. అయితే.. ఆయుధాలపై నాటో దేశాలలో ఏకాభిప్రాయం కుదరకపోవడం చర్చనీయాంశంగా మారింది..

ఉక్రెయిన్‌ యుద్ధం త్వరలో రెండో ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి… ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధ సాయంపై నాటో దేశాల్లో దాగి ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. జెలెన్‌స్కీ సేనకు చేయూతపై నిర్ణయం తీసుకోవటానికి… ఇటీవల జర్మనీలో జరిగిన కీలక సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. 50 దేశాల రక్షణ మంత్రులు ఇందులో పాల్గొని చర్చించినప్పటికీ… ఉక్రెయిన్‌కు ఊరట లభించలేదు. గతేడాది ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా అమెరికా సారథ్యంలోని నాటో దేశాలు.. రష్యాను ఎదుర్కోవటానికి ఉక్రెయిన్‌కు ఆర్థిక, ఆయుధ సాయం చేస్తూనే ఉన్నాయి. ఫలితంగానే ఉక్రెయిన్‌ ఇప్పటిదాకా రష్యాతో యుద్దంలో పోటాపోటీగా నిలబడగలిగింది.

అయితే ఇప్పటి వరకు ఉక్రెయిన్ కు అందిన సాయం చాలా వరకూ ఆత్మరక్షణకే పరిమితమైంది. పుతిన్‌ సేన దాడులను కాచుకోవడానికే ఇవి ఉపయోగపడేవి. ఇకపై ఈ సాయానికి తోడు రష్యాపై ఎదురుదాడికి ఆయుధాలు ఇవ్వాలంటూ ఉక్రెయిన్‌ పట్టుబడుతోంది. వీటి కోసమే ఈ మధ్య ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికాలో పర్యటించి వచ్చారు. అమెరికా ద్వారా నాటో దేశాలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. తాజాగా దావోస్‌ ఆర్థిక వేదికపై నుంచి కూడా జెలెన్ స్కీ ఇదే డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా జర్మనీ తయారీ లెపర్డ్‌-2 యుద్ధ ట్యాంకుల కోసం పట్టుబడుతున్నారు. ఉక్రెయిన్‌ కు ఆర్థిక సాయం అందించటంలో నాటో దేశాలకు అభ్యంతరాల్లేవు. కానీ అత్యాధునిక ఆయుధాల విషయానికి వచ్చేసరికి అది రాజకీయ ప్రాధాన్యాంశంగా మారింది. ఈ విషయంపై ఐరోపా దేశాల మధ్య
భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధట్యాంకులు ఇస్తే పోరును నాటోకు విస్తరించినట్లవుతుందన్నది కొన్ని దేశాల వాదన.

రష్యా ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే ఉక్రెయిన్‌కు సాయం చేయాల్సిందేనని మరికొన్ని దేశాలు స్పష్టంచేస్తున్నాయి. జెలెన్‌స్కీ సేనకు యుద్ధ ట్యాంకులను ఇవ్వటానికి జర్మనీ ససేమిరా అంటోంది. ఉక్రెయిన్‌కు సాయంపై కూడా అక్కడి ప్రభుత్వంలో ఏకాభిప్రాయం లేదు. నాటోలో కీలక సభ్యదేశమైనప్పటికీ.. రష్యాతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడానికి జర్మనీ సిద్ధంగా లేదు. రష్యా గ్యాస్‌పై ఆ దేశం ఆధారపడి ఉంది. రెండో ప్రపంచయుద్ధం, ప్రచ్ఛన్నయుద్ధ నీడలింకా జర్మనీని వెంటాడుతూనే ఉన్నాయి. రష్యాపై సానుకూలత ఇంకా ఆ దేశంలో ఉంది. లెపర్డ్‌-2 యుద్ధ ట్యాంకులను ఇస్తే వాటి ద్వారా రష్యాపై ఉక్రెయిన్‌ దాడులు చేస్తుంది. ఆ పోరు నాటో దేశాలకూ విస్తరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అది ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం ఉంది. రష్యా- నాటో యుద్ధాన్ని తాను కోరుకోవటం లేదని జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌ కు అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని రష్యా ఇప్పటికే స్పష్టం చేసింది. ఇది అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం లేకపోలేదని కూడా హెచ్చరించింది. లెపర్డ్‌-2 ట్యాంకును జర్మనీ 1979లో అభివృద్ధి చేసింది. ఆ తర్వాత అనేక మార్పులు చేర్పులతో ఇది రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యాధునిక యుద్ధ ట్యాంకుల్లో దీన్ని కీలకమైనదిగా పరిగణిస్తుంటారు. 13 ఐరోపా దేశాల సైన్యాలు వీటిని వినియోగిస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌, కొసావో, సిరియాల్లోనూ వీటిని వాడారు. మిగిలిన యుద్ధ ట్యాంకులతో పోలిస్తే బరువు తక్కువ. రాత్రివేళల్లోనూ స్పష్టంగా శత్రువుపై దాడి చేయగలదు. కదిలే లక్ష్యాన్ని ఛేదించగల లేజర్‌ రేంజ్‌ పరికరాలుండటం దీని ప్రత్యేకత. ఎగుడుదిగుడు భూతలాల్లోనూ సమర్థంగా దూసుకుపోతుంది..

ఉక్రెయిన్‌ వద్ధ ఉన్న యుద్ధ ట్యాంకులన్నీ సోవియట్‌ కాలం నాటివి. రష్యా ఆయుధ సంపత్తికి ఇవి సాటిరావు. లెపర్డ్‌-2 వస్తే ఉక్రెయిన్‌ కు ఆ కొరత తీరుతుంది. రష్యాపై ఎదురుదాడి చేసే బలం వస్తుంది. బ్రిటన్‌ తన ఛాలెంజర్‌-2 ట్యాంకులను ఇవ్వటానికి అంగీకరించింది. కేవలం 14 ట్యాంకులను మాత్రమే ఇస్తానంటోంది. అవి ఏ మాత్రం సరిపోవు. వంద లెపర్డ్‌-2 వస్తే యుద్ధం రూపురేఖలే మారిపోతాయన్నది ఉక్రెయిన్‌ వాదన. అంతా అమెరికా చేతిలో.. లెపర్డ్‌-2 ట్యాంకులను అనేక నాటో దేశాలకు జర్మనీ ఇప్పటికే విక్రయించింది. పోలండ్‌ లాంటి దేశాలు ఉక్రెయిన్‌ కు వాటిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ జర్మనీ అనుమతి ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది. అమెరికా సమ్మతిస్తేనే జర్మనీ తన యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌ కు ఇస్తుంది. అందువల్ల ఇక్కడ అగ్రరాజ్య నిర్ణయం కీలకం కాబోతోంది. తన వద్ద వద్ద ఉన్న అత్యాధునిక ఎం-1 అబ్రామ్స్‌ ట్యాంకులను ఉక్రెయిన్‌ కు ఇవ్వటానికి నిరాకరిస్తున్న అమెరికా.. జర్మనీకి పచ్చజెండా ఊపుతుందా అనేది అనుమానమే..

ఇప్పటికే యుద్దంలో రష్యాకు ధీటుగా పోరాడుతున్న ఉక్రెయిన్, జర్మనీ లెపర్ట్ 2 ట్యాంక్ ల సహాయంతో మరింత శక్తితో యుద్దం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా సహాయంతో నాటో దేశాల యుద్ద ఆయుధాలను సమకూర్చుకుని రష్యాను ఓడించాలన్నది లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే.. నాటో దేశాల మధ్య పూర్తి స్థాయిలో ఐకమత్యం లేకపోవడం, ఉక్రెయిన్ కు సహాయం విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడుతుండటంతో జెలెన్ స్కీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న భూ భాగాలను తిరిగి స్వాధీనం చేసుకుని.. రష్యా బలగాలను యుద్దం నుంచి తరిమికొట్టాలంటే నాటో దేశాల సహాయం తప్పనిసరి.. మరి.. ఉక్రెయిన్ కు నాటో దేశాలు ఏ మేరకు ఆయుధాలను అందిస్తాయో చూడాలి..

రష్యాతో యుద్దం చేస్తోన్న ఉక్రెయిన్ కు అధునాతన ఆయుధాల అవసరం ఉంది.. అందుకు నాటో దేశాల సహాయం కోరుతోంది ఉక్రెయిన్.. కానీ.. ఆయుధాలను అందించే విషయంలో నాటో దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు.. రష్యాతో యుద్దంలో ఉక్రెయిన్ కు విజయం అంత సులువు కాదనేది విశ్లేషకుల అభిప్రాయం..

Must Read

spot_img