Homeఅంతర్జాతీయంఫిఫా వరల్డ్ కప్పును అర్జెంటైనా సాధించుకుంది..

ఫిఫా వరల్డ్ కప్పును అర్జెంటైనా సాధించుకుంది..

ఖతార్ లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్పును అర్జెంటైనా సాధించుకుంది. ఇందుకు కీలకమైన వ్యక్తి 35 సం.ల ‘లయనెల్ అండ్రెస్ మెస్సీ’ తను ఏ విధంగా కప్పును గెలుచుకున్నాడో డిసెంబరు 18న ప్రపంచం మొత్తం ఉత్కంఠగా చూసింది. గెలుపు సాధించుకుని స్వదేశానికి బయలుదేరిన అర్జెంటైనా వీరులకు ఆ దేశంలో ఘన స్వాగతం లభించింది. అర్ధరాత్రి దాటినా లక్షలాదిగా అభిమానులు పోటెత్తారు.

సాకర్ ప్రపంచకప్ విజేత అర్జెంటీనా జట్టు సగర్వంగా దేశానికి చేరింది. అర్జెంటీనా కాలమానం ప్రకారం రాత్రి 2 గంటలకు మెస్సీ బృందం బ్యూనోస్ ఎయిర్స్ చేరుకుంది. అర్ధరాత్రి దాటినప్పటికీ తమ ఆరాధ్య ఫుట్ బాల్ హీరోల కోసం అభిమానులు ఇజీజా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ముందు ఎదురుచూసారు. ఫిఫా వరల్డ్ కప్ ను అర్జెంటీనాకు తీసుకువచ్చిన మెస్సీ, ఇతర జట్టు సభ్యులను చూసేందుకు పోటెత్తారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… అర్జెంటీనా జట్టు ఖతార్ నుంచి రోమ్ మీదుగా బ్యూనోస్ ఎయిర్స్ కు ఓ ప్రత్యేక విమానంలో చేరుకుంది. ఈ విమానం మార్గమధ్యంలో ఉండగానే, ఈ విమానం ఇంకెంతసేపట్లో ల్యాండవుతుందన్న విషయాన్ని అభిమానులు ఓ యాప్ ద్వారా ట్రాక్ చేశారు. 1.76 లక్షల మంది ప్లేన్ ట్రాకింగ్ యాప్ సాయంతో ఆ విమానం ఎక్కడుందన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, తమ అభిమాన ఆటగాళ్లను మోసుకొచ్చే విమానం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. అర్జెంటీనా టీమ్ ఎయిర్ పోర్టులో దిగగానే, వరల్డ్ చాంపియన్స్ అని రాసున్న బస్సులో వారిని తరలించారు.

రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ లో జాతీయ జట్టు ఆటగాళ్లకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. రోడ్లకిరువైపులా అర్జెంటీనా జాతీయ పతాకాలు చేతబూని అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. ఆటగాళ్లు వరల్డ్ కప్ ను ప్రదర్శిస్తూ అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఓ క్రీడాకారుడిగా ఇంతకన్నా సాధించేదేమీ ఉండదు.

అంతటి గౌరవం కేవలం 35 ఏళ్ల వయసులోనే సాధించారు మెస్సీ. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ తన క్రీడా ప్రయాణంలో ఎందరికో స్ఫూర్తినిచ్చారు. చాలా తక్కువగా మాట్లాడే మెస్సీ తన రెండు దశాబ్దాల అర్జెంటీనా క్రీడా జీవితంలో ఎగుడు దిగుడులను చూసారు. అందరి ఆటగాళ్ల విషయం వేరు మొన్నటి 2022 సంవత్సరం ఫిఫా వరల్డ్ కప్ లో ఆడిన మెస్సీ వేరు. ప్రస్తుతం ఆర్జెంటీనా 36 ఏళ్ల తరువాత వరల్డ్ కప్ సొంతం చేసుకుంది.

ఫ్రాన్స్ పై ఆదివారం నాటి అపూర్వ విజయం తరువాత అర్జెంటీనా ఇప్పుడు ప్రపంచ ఫుట్ బాట్ ఆటకు రాజధానిగా మారింది. తన క్రీడా జీవితంలో అత్యధిక విజయాలు నమోదు చేశారు. ఖతార్‌ రాజధాని దోహాలో ఆదివారం జరిగిన ప్రపంచ కప్‌ ఫుడ్‌బాల్‌ పోటీల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా సాధించిన విజయం ముమ్మాటికీ ఆయనదే..అందులో ఏ సందేహం లేదు. అన్నీ తానై అంతా తానై విజయం సాధించారు.

ప్రపంచ కప్‌ పోటీల్లో మూడోసారి ఈ విజయాన్ని అర్జెంటీనా సాధించడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ విజయానికి కారకుడైన మెస్సీపై ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు చూపిస్తున్న అభిమానం అర్జెంటీనా కీర్తిని మరోసారి దింగంతాలకు వ్యాపింపజేసింది. రెండవ విడతలో ఫ్రాన్స్‌ పుంజుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు.

క్రీడల్లో క్రికెట్‌కు ఆదరణ ఇప్పుడు బాగా పెరిగినప్పటికీ, ఫుట్‌ బాల్‌కి ప్రపంచంలోనే అత్యధిక ప్రాచుర్యం పొందిన క్రీడగా పేరొందింది. పిఫా పోటీలు 1930లో ప్రారంభమై నాయి. నాలుగేళ్ళకోసారి జరుగుతాయి. అయితే ప్రపంచ యుద్ధ కాలంలో ఈ పోటీలు జరగలేదు. ఇంతవరకూ ప్రపంచ కప్‌ గెలిచిన ఎనిమిది దేశాల్లో ఆరు దేశాలు తమ సొంత గడ్డపై గెలుపొం దడం విశేషం. ప్రపంచ కప్‌ క్రీడా పోటీలను దూర్‌దర్సన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం 1954లో ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఒలింపిక్స్ ని మించి ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ఆట ఫుట్‌బాల్‌ మాత్రమే.

అయితే, ఈ మధ్య క్రికెట్‌ పోటీలకు అత్యధిక ఆదరణ లభిస్తోంది. పిఫా పోటీలపై వార్తా ప్రసార సాధనాల్లో రన్నింగ్‌ కామెంటరీతో సాగిన ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కోట్లాది మంది ఆనందోత్సాహాలతో వీక్షించారు. ఫిపా పోటీల ప్రత్యక్ష ప్రసారాల కోలాహాలాన్ని చూస్తే క్రికెట్‌ పోటీల సందడి దిగదుడిపేననిపించింది. క్రికెట్‌ పోటీల ప్రసారాన్ని వీక్షించడానికి ఉద్యోగులు, అధికారులు ఆఫీసులకు సెలవు పెట్టిన సందర్భాలు అనేకం.

ఇప్పుడు అన్ని చోట్ల చిన్న టెలివిజన్లు, ఐ ఫోన్ల లో కారులో ప్రయాణం చేస్తూ కూడా ప్రసారాలను వీక్షిస్తున్నారు. ఫిపా పోటీలకు మూడేళ్ళ పాటు ప్రాథమిక పోటీలు నిర్వహించి ఎంపిక చేసిన 32 అత్యుత్తమ జట్ల మధ్య ఈ పోటీలను నెల రోజుల పాటు నిర్వహించారు. కొన్ని బృందాలుగా విభజించి ఈ పోటీల్లో విజేతలైన జట్లు ముందుకు వెళ్ళి ఇతర విజేతలతో తలబడతాయి. 2018 లో ఫిపాపోటీల్లో విజేత అయిన ఫ్రాన్స్‌ఈ సారి అర్జెంటీ నా జట్టు చేతిలో పరాజయం తప్పలేదు ఇందుకు ఫ్రాన్స్‌ లోపాల కన్నా అర్జెంటీనా క్రీడా స్ఫూర్తేకారణమని చెప్పాలి.

ఇంతవరకూ 21 ప్రపంచ కప్‌పోటీల్లో 8 జట్లే విజేతలుగా నిలవడం గమనార్హం1904లో పిఫా స్థాపించబడిన తర్వాత స్విట్జార్లండ్‌లో మొదటిసారి ఒలింపిక్‌కి బయట అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలను నిర్వహించాలని చూసింది, కానీ కుదరలేదు. ఈసారి కూడా అర్జెంటీనా జట్టు సారథి మెస్సీ ఒక్కసారైనా ప్రపంచ కప్‌ సాధించగలనా అని సందిగ్ధంలో పడ్డారు. ఎట్టకేలకు ఆయన శ్రమ ఫలించింది.

ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చివరికి మెస్సీ జట్టు ఫ్రాన్స్‌ ఓడించి జట్టుని కప్‌ని సొంతం చేసుకుంది. అర్జెంటీనా జట్టు మొదటి నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. రెండవ విడత ముగిసే సమయంలో 80వ నిమిషంలో పెనాల్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఈ విజయానికి జట్టులోని సభ్యులందరి ప్రతిభ కనిపిస్తూనే ఉంది.

ముఖ్యంగా గోల్‌కీపర్‌ ఎమిలియానో మార్టినేజ్‌ ముందు చూపు వల్ల అర్జెంటీనా జట్టుకు విజయం దక్కింది. అర్జెంటీనా తొలిసారిగా 1978లో ఫిపా కప్‌ ను కైవసం చేసుకుంది. 1986లో రెండవ సారి ఈ కప్‌ని అందుకుంది. ఇప్పుడు మూడోసారి ప్రపంచ కప్‌ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. మూడున్నర దశాబ్దాల తర్వాత అర్జెంటీనా ప్రపంచ కప్‌ కల నెరవేరింది. గెలిచిన వాడు మావాడు అన్న నానుడి అర్జెంటీనా ఫుట్‌బాల్‌ విజేత మెస్సీ విషయంలో జరిగింది.

మన దేశంలోని అసోం రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ మెస్సీ అసోంలోనే పుట్టాడంటూ ట్విట్టర్‌లో ఒక వార్త పోస్టు చేయగానే దేశ వ్యాప్తంగా ఫుట్‌ బాల్‌ అభిమానులు ఎగిరి గంతేశారు. అయితే, తర్వాత ఆ వార్త నిజం కాదని తేలింది. అంటే మెస్సీని జనం ఎంతగా ఫాలో చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.. క్రికెట్‌ క్రీడాకారుల పట్ల ఆరాధనా భావాన్ని పెంచుకున్న యువకులు ఇప్పుడు ఫుట్‌బాల్‌ క్రీడాకారుల పట్ల కూడా ఆరాధనా భావాన్ని పెంచుకుంటున్నారు.

ఇప్పుడు క్రీడాభిమానులకు చెందిన వార్తలన్నీ మెస్సీ చుట్టూ తిరుగుతున్నాయి. తను రిటైరవుతారన్న వార్త కూడ అలాంటిదే.. అయితే, తాను ఇప్పట్లో రిటైర్‌ కావడం లేదని ఆయన ప్రకటించారు. అత్యధిక ఆటలు ఆడిన ఆటగాడిగా తనకి అపూర్వమైన గుర్తింపు లభించింది. ఎక్కువ సార్లు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు. అయినా మెస్సీ వయస్సు కేవలం 35 ఏళ్ళు మాత్రమే.

ఈ వయసులోనూ ప్రపంచ కప్‌లో ఐదు కంటే ఎక్కువ గోల్స్‌ చేసిన ఆటగాడు మెస్సీయే కావడం విశేషం. ఎంతో కష్టపడి తన మనోరథాన్ని సాధించుకున్న మెస్సీ వచ్చే పోటీల వరకూ పుట్‌ బాల్‌ క్రీడాకారుల నోళ్ళలో నానుతూనే ఉంటారు.

Must Read

spot_img