Homeతెలంగాణవారసుల్ని బరిలోకి దించాలని తెలంగాణ అధికార పార్టీ నేతలు యోచిస్తున్నారా..?

వారసుల్ని బరిలోకి దించాలని తెలంగాణ అధికార పార్టీ నేతలు యోచిస్తున్నారా..?

అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారా..? మరి దీనిపై హైకమాండ్ నిర్ణయాన్ని ప్రకటించినట్లేనా..? దీనిపై కేసీఆర్ వ్యూహం ఏమిటి..? మరి సీనియర్లు ఏం చేయనున్నారన్నదే హాట్ టాపిక్ గా మారింది.

బీఆర్ఎస్ సీనియర్ నేతలు వారసులను పొలిటికల్ గ్రౌండ్లో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారు తప్పుకుని.. వారసులను ఎన్నికల బరిలోకి దింపడానికి కొందరు, తమతోపాటు తనయులను రంగంలోకి దింపేందుకు ఇంకొందరు అధినేత దగ్గర విజ్ఞప్తులు పెడుతున్నారు. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా ఇప్పటికే వారసులు గ్రౌండ్ వర్క్కూడా స్టార్ట్ చేశారు. కానీ.. కేసీఆర్ ఇటీవల చేసిన ఓ ప్రకటన ఆశావహ వారసులకు షాకిచ్చింది. ఇంతకీ.. వచ్చే ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమైన వారసులు ఎవరు?..అసలు.. కేసీఆర్‌ చేసిన ప్రకటన ఆశావహ వారసులకు ఎందుకు షాకిస్తోంది?…అనేది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే సమయం ఉండడంతో బీఆర్ఎస్ నేతలు గ్రౌండ్‌ సరిచేసుకునే పనిలో పడ్డారు. అదే సమయంలో.. చాలామంది సీనియర్లు.. వారసుల పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. రాజకీయంగా ప్రోత్సహిస్తూ నియోజకవర్గాల్లో యాక్టివ్ చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రుల వారసుల సందడి పెరిగింది. వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్ ఇవ్వాలనే మదిలోని మాటను అదును చూసి కేసీఆర్ ముందు పెడుతున్నారు. అయితే.. వారసులకు టిక్కెట్లు ఇప్పించుకోవాలని చూస్తున్నవారిలో వయోభారం నేతలే ఎక్కువగా ఉన్నారు. వారితోపాటే.. ఇంకొందరు కూడా వారసులను ఎన్నికల బరిలో దింపాలని తలస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో కొందరికి టికెట్ ఇచ్చే ఛాన్స్లేకపోవడంతో.. వారసులను ఎంకరేజ్ చేస్తున్నారు. దాంతో.. ఆ నేతల వారసులు నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేల తరపున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. మరికొందరు మాత్రం సోషల్ సర్వీస్ పేరిట ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే.. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మేల్యేలు ఉన్న చోట మాత్రం.. సీనియర్ల వారసులు చేసే
హడావుడితో గులాబీ పార్టీలో గుబులు పుడుతోంది. ఇప్పటికే పలు సెగ్మెంట్లలో సోషల్ సర్వీస్ పేరుతో హడావుడి చేస్తున్నారు. గతంలో తండ్రితో కలిసి పని చేసిన నేతలు, కేడర్‌ను ఏకం చేసి.. ఎమ్మెల్యేకి పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దాంతో.. బీఆర్ఎస్‌ లో మరో రచ్చ షురూ అయిందని టాక్ వెల్లువెత్తుతోంది. దీంతో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది.

మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి కుమారులు కూడా భావిస్తున్నారు.

ఇద్దరూ పోటాపోటీ రాజకీయం చేస్తుండగా.. ఎవరికో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని గులాబీబాస్‌ దగ్గర లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఇక.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సైతం.. ఆయన తప్పుకుని కుమారుడిని పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే.. ఇటీవల కొడుకు చేత నియోజకవర్గంలో పాదయాత్ర చేయించినట్లు టాక్‌ నడుస్తోంది. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్కూడా.. వారసుడు జై సింహను బరిలో దింపాలని యోచిస్తున్నారు. ఇప్పటికే.. ఆ నియోజకవర్గంలో జై సింహ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. నిత్యం ఏదో ఓ కార్యక్రమంతో
క్షేత్రస్థాయిలో తెగ హడావుడి చేస్తున్నారు. ఇక.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్‌రెడ్డి సైతం పోటీకి సై అంటున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వారసుడు తలసాని సాయి.. 2019లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడారు. వచ్చే ఎన్నికల్లోనూ అక్కడ నుంచే పోటీ చేసేందుకు ప్రచారం ప్రారంభించారు.

మంత్రి మల్లారెడ్డి కొడుకు బద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి సైతం పోటీకి సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి కొడుకు జగన్, జోగు రామన్న కొడుకు మహేందర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి, ఎంపీ రాములు కొడుకు పోతుగంటి భరత్, దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యనందిత పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దానికి తగ్గట్లే.. బీఆర్ఎస్‌ సీనియర్ నేతలు.. అదును చూసి వారసుల ఆసక్తిని అధినేత చెవిలో వేస్తున్నారు. ఇటీవల బాన్సువాడ టూర్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వయసు రీత్యా వచ్చే ఎన్నికల్లో
పోటీ చేయలేనని.. వారసులకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ను కోరారు. కానీ.. ఆయన మాత్రం.. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం.. పోచారం ఉండాల్సిందే, పోటీ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. దాంతో.. టికెట్‌పై ఆశలు పెట్టుకున్న పోచారం వారసులకు షాకిచ్చినట్లైంది. ఇదిలా ఉంటే, వారసత్వ రాజకీయాలకు కే రాఫ్‌ భారత రాష్ట్ర సమితి. అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన కొడుకు, కూతురు, అల్లుడితోపాటు సడ్డకుని కొడుకును రాజకీయాల్లోకి తెచ్చి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్లు ఇచ్చారు. కొడుకు, అల్లుడు ప్రస్తుతం కే సీఆర్‌ క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు.

తెలంగాణలో రెండు పర్యాయాలు పార్టీని అధికారంలోకి తెచ్చిన చంద్రశేఖర్‌రావు ఆదేశాలకు అనుగుణంగా ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలు, మంత్రులు పనిచేశారు.

టికెట్‌ ఇవ్వకపోయినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించేందుకు కూడా భయపడ్డారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. తొమ్మిదేళ్ల పాలనతో ఒకవైపు ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. మరోవైపు కుటుంబ పాలనతో సొంత పార్టీ నేతలే ఇబ్బంది పడుతున్నారు. తమ వారసులను రాజకీయ రంగంలోకి దించేందుకు దే మంచి సమయమని ఎమ్మెల్యేలు, మంత్రులు భావిస్తున్నారు.ఈ మేరకు ఇప్పటి నుంచే గులాబీ బాస్‌పై ఒత్తిడి తెస్తున్నారు. కేసీఆర్ తాజా ప్రకటన పోచారంను నిరాశపర్చింది. ఒక్క పోచారమే కాదు.. బీఆర్‌ఎస్‌లో చాలా మంది నేతలు వారసుల ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈమేరకు అధినేతపై ఒత్తిడి చేస్తున్నారు. కాదంటే కేసీఆర్‌నే ఉదాహరణ చూపాలని భావిస్తున్నారు. ఇందుకోసం సీనియర్లంతా ఏకమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కేసీఆర్‌ ఇటీవల టిక్కెట్ల కసరత్తులు కూడా ప్రారంభించారు. అన్నిరకాల నివేదికలను తెప్పించుకుని.. కొంత మంది సిట్టింగ్‌లను మార్చాలని నిర్ణయించారు. అయితే వారసులకు ఇవ్వాలా లేదా అనే దానిపై ఏ నిర్ణయం తీసుకున్నారన్నదానిపై స్పష్టత లేదు. గెలిచి తీరాల్సిన ఎన్నికలు కాబట్టి
వారసులను దూరం పెడితేనే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. వారసులకు ఇస్తే ఎక్కడ ప్రజలు తిరస్కరిస్తారోననే సందేహం… ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనే ఎన్నికల్లో రిస్క్ చేయకూడదనే మరో పట్టుదల బీఆర్ఎస్ పెద్దల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో వారసులకు ఈ సారి చాన్స్ ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు. మొత్తంగా వారసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ హైకమాండ్ ఆశీస్సులే లభించాల్సి ఉంది. అనేక మంది తమ వారుసుల కోసం లాబీయింగ్చే సుకుంటున్నారు. నియోజకర్గాల్లో తమకు సానుకూలత ఉందని.. నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎంత మంది వారసులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది
ఇప్పుడు కీలకంగా మారింది.

ఇదే జరిగితే కొంత మంది నేతలను పక్కనపెట్టి రెబల్స్‌గా మారి ప్రతిపక్షంలో చేరే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ నాయకత్వం కుటుంబానికి ఒక్క టికెట్ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకోనుందన్న టాక్ వెల్లువెత్తుతోంది. ఒకవేళ కేసీఆర్ .. అదే బాటలో అడుగేస్తే, సీనియర్ల నుంచి ఎంతమేరకు మద్ధతు లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరి బీఆర్ఎస్ అధినాయకత్వం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే.

Must Read

spot_img