Homeతెలంగాణతెలంగాణలో పొత్తులు విరబూయనున్నాయా..?

తెలంగాణలో పొత్తులు విరబూయనున్నాయా..?

  • కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో పొత్తుల చర్చ .. హాట్ టాపిక్ గా మారిందట.
  • మరి పొత్తుల లెక్కలపై ఏ అంచనాలు వినిపిస్తున్నాయో చూద్దామా..

తెలంగాణా అసెంబ్లీలో 119 సీట్లు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు రావాలి. 2014లో టీఆర్‌ఎస్ సింపుల్ మెజారిటీని సొంతం చేసుకుంది. 2018 నాటికి బలపడి 80కి పైగా సీట్లు తెచ్చుకుంది. కానీ ఈసారి బాగా తగ్గుతాయని అంటున్నారు. మంత్రులు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఒక రేంజ్ లో ఉంది అని భావిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. పొత్తులపై ఇంకా ఓ స్పష్టత రాలేదు. అయితే.. అధికార బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ విడివిడిగా పోటీచేసినా.. స్నేహపూర్వక బంధం ఎలాగూ ఉంటుంది.

బీఆర్‌ఎస్‌.. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం దాదాపు ఖరారైంది. కాంగ్రెస్‌ కూడా ఒంటరిగా పోటీ చేయనుంది. ప్రతిపక్షంగా దూసుకెళ్తున్న బీజేపీ కూడా సింగిల్‌గానే ఫైట్‌ చేయనుంది. అయితే.. కాంగ్రెస్‌ పార్టీతో గులాబీ బాస్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెరవెనక చర్చలు జరుపుతున్నారట. బీజేపీని ఓడించాలంటే పొత్తులు పెట్టుకోవడం తప్పనిసరి అన్న అభిప్రాయానికి వారు వచ్చేశారని సమాచారం. దీని ప్రకారం కాంగ్రెస్‌కు 25 నుంచి 35 సీట్లు ఆఫర్‌ చేస్తున్నారట. అలాగే కేసీఆర్‌ ఫ్రెండ్‌ ఒవైసీకి 10 సీట్ల వరకు ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీలో మొత్తం సీట్లు 119.

మిత్రపక్షాలకు దాదాపు 45 సీట్లు పోతే, మిగిలేవి 74 స్థానాలు. వాటితోనే అదృష్టాన్నిపరిశీలించాలనుకుంటోందట బీఆర్‌ఎస్. ఈ నేపథ్యంలో కొన్ని ప్రి పోల్‌ సర్వేలు తెలంగాణలో హంగ్‌ ఏర్పడుతుందన్న అంచనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఎన్నికలకు ముందు విడివిడిగా పోటీ చేసినా, ఎన్నికల తర్వాత పొత్తులపై పార్టీల అధినేతలు అప్పుడే దృష్టిసారించారని తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయేది హంగ్ అసెంబ్లీనే అని కుండబద్దలు కొట్టారు. అప్పుడు కేసీఆర్ ఎవరితో కలుస్తారు?

మాతో కలవడం తప్ప ఆయనకు ప్రత్యామ్మాయం లేదు అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలవదని.. అందుకే కేసీఆర్‌కు కాంగ్రెస్‌తో కలవడం తప్ప మరో ఆప్షన్ లేదని కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ జరుగుతోంది. టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఠాక్రే .. వెంకట్‌రెడ్డికి గట్టిగా క్లాస్‌ పీకినట్లు తెలిసింది. అయితే బీఆర్‌ఎస్‌కు మెజార్టీ రాకుండా హంగ్ వస్తే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీతో కంటే కాంగ్రెస్‌తోనే పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఎంఐఎం ఏడు సీట్లను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్న ప్రచారం కూడా సాగుతోంది.

ఇటీవల కాంగ్రెస్‌పై కేసీఆర్ అసెంబ్లీలో చేసిన పాజిటివ్ వ్యాఖ్యలను బట్టి కూడా ఇదే అర్థమవుతోంది. అయితే జనాల మూడ్ ఏ ఒక్క పార్టీ వైపు కాకుండా చీలిపోయే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలా తెలంగాణలో చూస్తే హంగ్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. బీఆర్‌స్ నలభై సీట్ల దాకా తెచ్చుకోవచ్చని.. అలాగే కాంగ్రెస్ కూడా సీట్ల సంఖ్యను పెంచుకుంటుందని సర్వేలు అయితే వస్తున్నాయి. ఆ మిగిలిన సీట్లలో బీజేపీ, మజ్లీస్ ఇతరులు ఉంటారని తెలుస్తోంది.

ఈ సర్వేల ఆధారంగానే కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి హంగ్ రావచ్చని మాట్లాడారని అంటున్నారు పరిశీలకులు. అయితే.. బీఆర్‌ఎస్‌ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించడంతోపాటు.. 60కిపైగా సీట్లు గెల్చుకుంటే ఈ చర్చలన్నీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోతాయని చెప్పవచ్చు. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు దగ్గరవుతున్నాయా? రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు చేతులు కలుపుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అంతే కాదు ఈ రెండు పార్టీల కలయిక వెనక బీఆర్ఎస్ పోషిస్తున్న పౌరోహిత్యం పాత్రను కూడా కొట్టి వేయలేమని రాజకీయ పరిశీలకులు తాజా పరిస్థితులు, పరిణామాలను విశ్లేషిస్తున్నారు.

నిజానికి రాష్ట్రంలో లౌకికవాద పార్టీలన్నీ ఎన్నికలకు ముందు ఏక తాటిపైకి వచ్చినా రాక పోయినా, ఎన్నికల తర్వాత అవసరాన్ని బట్టి ఖాయంగా ఒకటవుతాయని అంటున్నారు. అందుకోసమే ఇప్పటి నుంచే స్కెచ్ సిద్దం చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని కలిశారని, అలాగే అసెంబ్లీలో బీఆర్ఎస్, ఎంఐఎం జుగల్బందీకి కూడా సెక్యులర్ సంబంధాలే కారణమని అంటున్నారు. నిజానికి రాష్ట్రంలో బీజేపీకి అధికారంలోకి వచ్చేంత సీనుందా అంటే లేదు.

కానీ, రాష్ట్రంలో బీజేపీ చాప కింద నీరులా బలాన్ని పుజుకుంటోందనే అనుమానం అయితే బీఆర్ఎస్ సహా బీజేపీ ప్రత్యర్హ్ది పార్టీలు అన్నిటినీ వెంటాడుతోందని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో సిపిఐ, సిపిఎం పార్టీలు ఏ విధంగా అయితే, మతోన్మాద బీజేపీ ఓడించడం కోసం అంటూ బీఆర్ఎస్ తో చేతులో కలిపాయో, రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం సహా బీజేపీ యేతర పార్టీలన్నీ లౌకికవాదం కోసం ఒకటైనా ఆశ్చర్య పోనవసరం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో బీజేపీ బలం పరిమితమే అయినా, అధికార బీఆర్ఎస్ సహా ప్రధాన పార్టీలన్నీ బీజేపీనే బూచిగా చూస్తున్నాయి. ఒక విధంగా భయపడుతున్నాయని అంటున్నారు. అందుకు ప్రధానంగా జాతీయ స్థాయిలో బీజేపీకి బలమైన నాయకత్వం ఉండడం ఒక కారణం అయితే, దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనమవడం మరొక కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో రోజు రోజుకు మరింత బలహీనమవుతోంది. మరో వంక కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేల్లో అధిక సంఖ్యాకులు అధికార పార్టీలో చేరిపోవడంతో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం బలపడుతోంది.

అయినా ఇప్పటికీ బీజేపీ ప్రభావం పెద్దగా ఉండక పోవచ్చు కానీ, ముందు ముందు బీజేపీ బలం పుంజుకుంటే… అనే ఆలోచనతో బీజేపీ యేతర పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారని అంటున్నారు.

అయితే, ఇది రాజకీయ భేటీ కాదని కాంగ్రెస్ నేతలు అంటున్నా, అంతకు ముందు రోజే జూనియర్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య అసెంబ్లీలో హాట్ హాట్ గా నడిచిన పరస్పర విమర్శల నేపథ్యంలో ఈ భేటికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆలాగే, ఈ సంవాదం సందర్భంగా ఒవైసీ ఉద్దేశ పూర్వకంగా అన్నారో వ్యూహత్మకంగానే అన్నారో గానీ, ఈసారి ఎన్నికల్లో 50 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని, కనీసం 15 మందిని గెలిపించుకుంటుందని అన్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని కాంగ్రెస్ నాయకులు కొంచెం చాలా స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు.

అదే సమయంలో ఈ భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని భట్టి పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా తెలిసిన వ్యక్తి కావడంతో మంచి చెడు మాట్లాడుకున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ తమతో చెప్పారని తెలిపారు. పొత్తుల వ్యవహరం ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకోవసి ఉంటుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే, బీజేపీయేతర పార్టీలు సెక్యులర్ వేదికను సిద్దం చేస్తునట్లు ఉందని అంటున్నారు.

మరి తెలంగాణలో పొత్తులు విరబూస్తాయో లేదో తేలాలంటే, వేచి చూడాల్సిందే..

Must Read

spot_img