Homeఅంతర్జాతీయం'కొరోనా టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ వాస్తవమేనా'?

‘కొరోనా టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ వాస్తవమేనా’?

ఇప్పుడు కొత్తగా ఓ విషయంపై డిబేట్ మొదలైంది. అందరి నుంచి ఇదే ప్రశ్న వినిపిస్తోంది.. ‘కొరోనా టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ వాస్తవమేనా’? అని.. కోవిడ్ టీకాలపై చాలా రోజులుగా పలు వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కోవిడ్ టీకా తీసుకోవడం వల్ల్ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని పలువురు వైద్య నిపుణులు సహా చాలామంది హెచ్చరించారు. అయితే, ఈ హెచ్చరికలకు ప్రభుత్వం ఇన్నాళ్లు కొట్టివేస్తూ వచ్చింది. తాజాగా కోవిడ్ టీకాతో అనారోగ్యాలు సంభవించే అవకాశముందని ఐసీఎంఆర్, ‘సీడీఎస్సీఓ’ ఒప్పుకున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఐసీఎంఆర్, సీడీఎస్సీఓ ఆ మేరకు జవాబిచ్చినట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం స్పష్టతనిచ్చింది. కోవిడ్ టీకా తీసుకున్న వారిలో చాలామందికి తీవ్ర స్థాయి అనారోగ్యాలు సంభవిస్తాయన్న వాదన సరికాదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే, టీకా తీసుకున్న కొందరిలో మాత్రం తీవ్ర స్థాయి అనారోగ్యాలకు అవకాశం ఉందని అంగీకరించింది. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వివరించింది. మీడియాలో వచ్చినట్లు టీకా తీసుకున్నవారికి పెద్ద సంఖ్యలో తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయనడం సరికాదని తెలిపింది. ఆ మీడియా కథనాలు తప్పుడు సమాచారం ఆధారంగా రూపొందిన వార్తలని స్పష్టం చేసింది.

సమాచార హక్కు దరఖాస్తుకు ICMR ఇచ్చిన సమాధానంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖ, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ల వెబ్ సైట్ల లింక్స్ మాత్రమే ఇచ్చిందని వివరించింది. కోవిడ్ టీకాల ప్రభావాలపై వాటిలో ఉన్న సమాచారాన్ని మాత్రమే పొందుపర్చిందని వెల్లడించింది. టీకా తీసుకోవడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టాన్ని నివారించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపింది. ఇంత విన్నాక కూడా ఇంకా టీకాలు సురక్షితమేనా అన్నది నిజంగానే చాలా ఇబ్బందికరమైన ప్రశ్న..

ఒక్కసారి రెండున్నరేళ్ల క్రితం కరోనా ప్రపంచాన్ని కకావికలం చేస్తున్నప్పుడు, శవాలు కుప్పలు తెప్పలుగా స్మశానాల్లో కనిపించినప్పుడు మనం ఏమనుకున్నాం.

కనీసం దీనికి టీకా ఎందుకు రావడం లేదు..వస్తే ఎప్పుడు వస్తుంది అని ఆలోచించాం..? తొందరగా వస్తే చాలని అనుకున్నాం..అనుకున్నట్టుగానే ఫార్మా సంస్థలు వాటి వంతు క్రుషి చేసి మార్కెట్లోకి, ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వ్యాక్సిన్ సరఫరాలు చేసాయి. అప్పటికి ఆ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు లేదా ప్రాణాలు కాపాడుకునేందుకు కోవిడ్19 నుంచి తప్పించుకోవడానికి మనస్పూర్తిగా లైన్లలో నిలబడి మరీ టీకాలు వేయించుకున్నాం.. ప్రాణాలు కాపాడుకోవాలనే అవసరం వచ్చినప్పుడు మరో మాట లేకుండా వాటిని వేయించుకున్నాం..ఇప్పుడు మూడేళ్ల తరువాత వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అనుమానిస్తున్నాం. కాస్త అటూ ఇటూగా అందరూ ఒకేలా ఆలోచిస్తున్నారు. నిజంగానే అలా జరుగుతోందా..? సైడ్ ఎఫెక్ట్స్ గురించి అప్పుడు ప్రభుత్వం గట్టిగా హెచ్చరించలేదు కదా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మొదటి నుంచీ టీకాల పట్ల సవ్యంగానే వ్యవహరించింది. వీటిని వేసుకోవడం వేసుకోకపోవడం అన్నది మన ఔచిత్యానికే వదిలేసింది.

బలవంతంగా వేయలేదు. వేసుకున్నవారికి వచ్చే సైడ్ ఎఫెక్టుల విషయానికొస్తే..ఇంజక్షన్ వేసిన చోట వాయడం, ఆ రెండు రోజులు కాస్త నలతగా ఉండటం..మరికొందరిలో రెండు వారాల దాకా తీవ్రంగా అలసిపోయన భావన కలగడం జరిగింది. వాటి గురించి నిపుణుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఆ తరువాత అవన్నీ మాయమైపోయాయి. మళ్లీ అలాంటివేమీ కనిపించలేదు. అంతే కాదు ఇప్పుడు టీకాల కారణంగా గుండెజబ్బులు, ఇతర క్రానిక్ సమస్యలు వస్తున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వ్యాక్సిన్స్ వేసుకున్నవారికి గుండెకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని..జనం చెప్పుకుంటున్నారు.

అయితే ఈ విషయంలో వైద్యనిపుణులు ఏమంటున్నారంటే..గుండె జబ్బులు రావడం అన్నది వ్యాక్సిన్ వల్లనే కాకపోవచ్చు..

అది ఆ వ్యక్తి లైఫ్ స్టైల్, ఆరోగ్యస్థితి, చెడు అలవాట్లు, వంశపారంపరికంగా వచ్చే వ్యాధులు..అంటే జన్యుపరమైన జబ్బులు కూడా అయి ఉండవచ్చు. అంతే కానీ అవి టీకాల వల్లే వచ్చాయనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. అలా అన్వయించుకోవడం వల్ల టీకాలు శత్రువులుగా మారతాయి కానీ ఒకప్పుడు కరోనా వస్తే చనిపోతున్నకాలం గురించి ఆలోచిస్తే..ఈ సైడ్ ఎఫెక్ట్స్ మరణం కన్నా పెద్దవి కాదు కదా అనే అనిపిస్తుంది. నిజానికి కరోనా టీకా వేయించుకున్న తర్వాత చిన్న చిన్న దుష్ప్రభావాలు కనిపించడం మామూలే. వ్యాక్సీన్ పని చేస్తోందనడానికి అవి ఒక సంకేతం కూడా కావచ్చునని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధకత వచ్చిన తర్వాత కాస్త జ్వరం, ఆయాసం, నొప్పి, అలసటగా అనిపించవచ్చు.

టీకా వేసుకున్న ప్రతి ఒక్కరిలో ఈ లక్షణాల్లో ఒక్కటిగానీ, అన్నీగానీ లేదంటే అసలు ఏదీ లేకపోవడం గానీ ఉండచ్చు. కానీ, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ సాధారణంగా కొన్ని నిమిషాలు, గంటలు లేదా కొన్ని రోజుల్లో తగ్గిపోతుంటాయి. కరోనా టీకా వేసుకోవడం వల్ల వచ్చే కొన్ని దుష్ప్రభావాల కంటే ఆ వ్యాధి చాలా ప్రాణాంతకమైనదని మనం అర్థం చేసుకోవాలి.
కోవిడ్ టీకా వ్యాధి నుంచి రక్షణ అందించి మన ప్రాణాలు కాపాడుతుంది” అని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీసెన్‌స్టర్ వైరాలజిస్ట్ జూలియన్ టాంగ్ అన్నారు. కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న కొన్ని నిమిషాల్లో, గంటల్లో తీవ్రమైన అలర్జిటిక్ రియాక్షన్ కూడా ఉంటుందని, అందుకే వేసుకున్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే అలా చాలా అరుదుగా జరుగుతోందని నిరూపితమయ్యింది.

కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందుతూనే ఉంది. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

మరోపక్క భారతదేశంలో కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో వ్యాక్సిన్ బూస్టర్ డోసులు తీసుకోవడం అనివార్యంగా మారింది. కరోనా టీకా వైరస్ తీవ్రతను తగ్గించి ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రాణాలు కాపాడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ రోజురోజుకీ పెరిగిపోతున్న పరిశోధనలతో ప్రజల్లో టీకా సైడ్ ఎఫెక్ట్స్, సామర్థ్యంపై అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో ఏ సైడ్ ఎఫెక్ట్స్ పట్ల జాగ్రత్తపడాలో, టీకా తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలుసుకోవాల్సి ఉంది. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్, వైరస్ ఇన్ఫెక్షన్లలో ఏది ఎక్కువ హాని కలిగిస్తుందన్నది ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. టీకా సైడ్ ఎఫెక్ట్స్ ఆందోళనకరంగా కనిపించినా, కరోనా సోకడమే మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ టీకా తీసుకోని వ్యక్తుల్లో తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. కానీ టీకా తీసుకుంటే తీవ్రమైన అనారోగ్యం బారిన పడే ప్రమాదం చాలా తక్కువ.

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, టీకాలు తీసుకోని వ్యక్తులు కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరే అవకాశం 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. టీకాలు తీసుకున్న వారితో పోలిస్తే వారిలో 10 రెట్లు మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే కరోనా టీకా తీసుకోవడం చాలా ముఖ్యం. టీకా సైడ్ ఎఫెక్ట్‌ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అలాగే జాగ్రత్త తీసుకోవాల్సిన అసాధారణ సైడ్ ఎఫెక్ట్‌ల జాబితాను విడుదల చేసింది. వ్యాక్సినేషన్ తరువాత 20 రోజుల్లోపు జ్వరం, అనారోగ్యం, చేతిలో పుండ్లు కనిపిస్తే ఎలాంటి ఆందోళనకు గురికావద్దు. కానీ టీకా తర్వాత కొత్త లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇలాంటి హానికరమైన కొత్త లక్షణాల గురించి కేంద్రం ఒక జాబితా విడుదల చేసింది. అవేంటో తెలుసుకుంటే టీకాలపై అనుమానాలు తొలగిపోతాయి.

Must Read

spot_img