మా గగనతలంలోకి చైనా బెలూన్లను పంపించి గూఢాచర్యం నిర్వహిస్తోందంటోంది అమెరికా. మొదట అమెరికాలోని మొంటానాలో మొదలైంది ఈ బెలూన్ గొడవ..ఇప్పుడు చైనాలోనూ జరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా పది బెలూన్లు చైనా వ్యాప్తంగా కనిపిస్తున్నాయని డ్రాగన్ ఆరోపిస్తోంది..
- ఇది అమెరికా పనే అంటోంది చైనా..ఇదేదో గ్రహాంతర వాసుల పని కావచ్చని అంటున్నారు.. అమెరికా వైమానిక దళం జనరల్ గ్లెన్ వాన్‌హెర్క్..మరి నిజమేంటి..?
అనుమానాస్పద డాట్స్ అన్నీ కలిపిచూస్తే ప్రపంచానికి ఓ అనుమానం మొదలైంది. అక్కడెక్కడో వేలాది కి.మీల దూరంగా ఉండే చైనా నుంచి బెలూన్లు దారి తప్పి అమెరికా వరకు రావడమేంటి..? ఒకటి తరువాత ఒకటిగా మూడు బెలూన్లు అమెరికా కెనడా మెక్సికో దేశాల వరకు అవి రావడమేంటి..? అసలు వాటిని మొదటే ఎందుకు గుర్తించి కూల్చలేదు..?
ఇప్పుడు చూస్తే చైనాలోనూ పది బెలూన్లు కనిపించడం, అవి అమెరికా పంపించినవేనని ఆరోపణలు రావడం వెనుక నిజమేంటనే అనుమానం ఎవరికైనా వస్తుంది. అయితే ఒకవేళ ఈ రెండు దేశాలు ఉద్దేశ్యపూర్వకంగా నాటకమైనా ఆడుతుండాలి లేదా..నిజంగానే ఒకరిపైన మరొకరు కుట్రలైనా చేసి ఉండాలి .. లేదంటే కచ్చితంగా అమెరికా రక్షణ రంగ నిపుణులు గ్లెన్ వాన్ హెర్క్ అనుమానం మేరకు గ్రహాంతరవాసుల పనైనా అయి ఉండాలి..
నిజానికి వారం క్రితం అమెరికా గగనతలంలోకి ప్రవేశించిన చైనా నిఘా బెలూన్ అని చెబుతున్న యూఎఫ్ఓ ను అగ్రరాజ్యం కూల్చేయడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఈ పరిణామాలపై తాజాగా డ్రాగన్ స్పందిస్తూ.. అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అగ్రరాజ్యం కూడా తమ దేశ గగనతలంలోకి బెలూన్లను పంపిందని చైనా ఆరోపించింది.
నిజానికి ఇతర దేశాల గగనతలాల్లోకి అమెరికా కూడా అక్రమంగా ప్రవేశించడం అసాధారణమేమీ కాదు. 2022 జనవరి నుంచి పది సార్లకు పైగా అమెరికా బెలూన్లు మా అనుమతులు తీసుకోకుండా మా గగనతలంలో ప్రయాణించాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించారు.
- ఆ చొరబాట్లపై చైనా ఎలా స్పందించిందని అడగ్గా.. ”ఆ ఘటనల్లో మేం చాలా బాధ్యతగా, ప్రొఫెషనల్‌గా ప్రవర్తించాం” అని చెప్పడం గమనార్హం..
అది వాతావరణ పరిశోధనలకు ఉద్దేశించిన బెలూన్ అని, గాలుల ప్రభావం వల్ల దారి తప్పి, అమెరికాకు వెళ్లిందని వాదించింది. అంటే మొదటి బెలూన్ చైనానే పంపిందని రుజువైంది. మరి మిగిలిన రెండింటి సంగతేంటి.? ఈ విషయంలో అమెరికా అతిగా స్పందించిందని విమర్శించింది. అయితే, ఈ బెలూన్‌ను కూల్చివేసిన తర్వాత ఆ శకలాలను డ్రాగన్‌కు ఇచ్చేందుకు అగ్రరాజ్యం నిరాకరించింది. ఆ బెలూన్‌లో కమ్యూనికేషన్ సంకేతాలను సేకరించగలిగే పరికరాలు ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం వాటిపై అమెరికా దర్యాప్తు సాగిస్తోంది.
మరి.. అమెరికా నిఘా బెలూన్ల సంగతేంటి?.. చైనా గగనతలంలో ఏకంగా పది బెలూన్లను చైనా కనుగొన్నట్టు చెబుతోంది. అమెరికా ఎయిర్‌బెలూన్ల సంచారం గురించి అదనపు సమాచారం కావాలంటే.. వెళ్లి వాళ్లనే అడగండి అంటూ వ్యాఖ్యానించారు చైనా ప్రతినిధి వాంగ్ బెన్‌బిన్. ఈ ఆరోపణలపై అమెరికా స్పందించాల్సి ఉంది. ఏది ఏమైనా నిఘా బెలూన్ల వ్యవహారంతో అమెరికా, చైనాల మధ్య పరిస్థితులు నానాటికీ ఉద్రిక్తతంగా మారుతున్నాయి. ఈ అంశంతో పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి ఇరు దేశాలు.
ఇదిలా ఉండగా సీన్ లోకి కామెడీ యాక్టర్ లా టెస్లా సీఈఓ, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ చొరబడ్డారు. కరెంట్ అఫైర్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టే మస్క్ తాజాగా అమెరికాలో చోటుచేసుకుంటోన్న బెలూన్ వింత ఘటనలపై స్పందించాడు. ఇలాంటి సంఘటనలకు ఏ మాత్రం భయపడవద్దని ఎలాన్ తన ఫాలోవర్లకు అభయం ఇచ్చారు. అంతరిక్షం నుంచి తన స్నేహితులు..అంటే ఏలియన్స్ వచ్చారని ఇందులో భయపడాల్సిందేమీ లేదని చమత్కరించారు.
ఈ నేపథ్యంలో గ్రహాంతరవాసుల కదలికలపై మరోసారి పెద్ద చర్చే సాగుతోంది. ఎలాన్ మస్క్ ఒక్కరే కాదు..అమెరికా రక్షణ రంగ నిపుణులు గ్లెన్ వాన్ హెర్క్ కూడా అదే అభిప్రాయం వచ్చేలా మాట్లాడారు. ఏలియన్స్ ఉనికిని కొట్టి పారేయలేమంటూ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ క్రమంలోనే మస్క్ ట్వీట్ కు విపరీమైన క్రేజ్ నెలకొంది. దీంతో ఇదికాస్తా వైరల్ గా మారింది.
అమెరికా ఎయిర్‌ఫోర్స్ జనరల్ గ్లెన్ వ్యాన్ హెర్క్ ఇంకా ఏమన్నారంటే..”ఆ వస్తువులు ఏలియెన్స్‌కు సంబంధించినవా.. కాదా అనే విషయాన్ని కొట్టిపారేయలేం. ఈ విషయాన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ నిపుణులు కనుక్కుంటారు. ప్రస్తుతం ఉత్తర అమెరికాకు వీటి వల్ల పొంచి ఉన్న ముప్పును అన్ని రకాలుగా అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ వస్తువులు ఎలా, ఎక్కడి నుంచి వస్తున్నాయో మిలిటరీ ఇంకా గుర్తించలేదు. ఇప్పటికైతే వాటిని బెలూన్లుగా పిలవలేం. వస్తువులుగానే చూస్తాం” అన్నారు. మరో అమెరికా రక్షణ రంగ అధికారి మాట్లాడుతూ ఇప్పటివరకు లభించిన వస్తువుల్లో గ్రహాంతరవాసులకు సంబంధించిన ఆధారాలేమీ దొరకలేదన్నారు. నెటిజన్లు మాత్రం ఈ డాట్స్ అన్నింటినీ చక్కగా జోడించేసి 2023లో ఏలియన్స్ వస్తారంటూ బల్గేరియా జోతిష్యురాలు బాబా వంగా చెప్పిన జోస్యం నిజం కానుందని అంటున్నారు..