Homeఆంధ్ర ప్రదేశ్తొందరపడి ఓ కోయిల ముందే కూసింది.. ఏపీలో ముందస్తు పక్కానా?!

తొందరపడి ఓ కోయిల ముందే కూసింది.. ఏపీలో ముందస్తు పక్కానా?!

ఏపీలోనూ ముందస్తు నగారా మ్రోగనుందని విశ్లేషకులు, రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి మద్ధతుగా అధికారపార్టీ .. అధినేత జగన్ పావులు కదుపుతుండడంతో, సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈనెల 8న జరిగే భేటీలో దీనిపై క్లారిటీ రావచ్చన్న చర్చ ఏపీవ్యాప్తంగా వెల్లువెత్తుతోంది.

ఏపీలో అధికార పార్టీ ముందస్తుకు వెళుతుందన్న అనుమానాల నేపథ్యంలో ప్రభుత్వం

ఏపీలో అధికార పార్టీ ముందస్తుకు వెళుతుందన్న అనుమానాల నేపథ్యంలో ప్రభుత్వం మరో ఆలోచనలో ఉందన్న టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. ముందస్తు కూడా పక్కా ప్లాన్తో నే వెళ్లాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలుపొందిన జగన్..ఈసారి 175 స్థానాల్లో గెలుస్తామని చెబుతున్నారు.చంద్రబాబు, పవన్, లోకేష్.. ఇలా అందర్నీ ఓడించి తీరుతామంటున్నారు.

పార్టీ వర్గాలకు సైతం ఇదే చెబుతూ వచ్చారు. అయితే గ్రౌండ్ లెవల్లో పరిస్థితి చూస్తున్న వారు.. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్ మాత్రం అది నాకు వదిలేయండన్న రేంజ్ లో మాట్లాడుతుండడం సొంత పార్టీ శ్రేణులకు అర్ధం కాని పరిస్థితి.

జగన్ ధైర్యం చేయడానికి కారణమేమిటబ్బా అని వారు ఆలోచిస్తున్నారు. 175 స్థానాల మాట అటుంచితే.. పార్టీ గ్రౌండ్ లెవల్లో బాగా వీకయ్యిందని పీకే టీమ్ జగన్ కు నివేదించిందట. ప్రజా వ్యతిరేకతకు తోడు విపక్షాలు బలం పెంచుకున్నాయని చెప్పడంతో జగన్ షాక్ కు గురయ్యారట. అయితే దీనిని అధిగమించడం ఎలా? అనేసరికి పీకే టీమ్ అద్భుతమైన సలహా ఇచ్చిందట.

అది నచ్చిన జగన్ దానికే ఫిక్స్ అవుతున్నారు. ఇంతలో పార్టీ నియోజకవర్గ బాధ్యుల చేతిలో ఓ రోడ్డు మ్యాప్ పెట్టి అందుకు అనుగుణంగా పనిచేయాలని చెప్పనున్నారుట. అందుకే ఈ నెల 8న పార్టీ కీలక సమావేశం నిర్వహించిన నేతలకు దిశ నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.

పీకే టీమ్ చెప్పిన ఆ ప్లాన్ పై పార్టీ వర్గాల నుంచి అభిప్రాయం కోరే అవకాశముంది. అప్పుడే ముందస్తు ఎన్నికలకు ఎప్పుడు వెళుతుంది? అందుకు గల కారణాలు తెలియజేయనున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే పీకే టీమ్ ఏం చెప్పింది? అనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

ముందస్తుకు వెళితేనే అత్తెసరు మెజార్టీతోనైనా గట్టెక్కగలరని పీకే టీమ్ జగన్ చేతిలో ఒక నివేదిక పెట్టినట్టు తెలుస్తోంది. సరిగ్గా బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ముందస్తు ప్రకటన చేయాలని సూచించిందట. అప్పటికే ఎన్నికలకు నాలుగు నెలల వ్యవధి ఉంటుంది.

అప్పటికే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. కొత్తగా అప్పులు తెచ్చేందుకు చాన్స్ లభిస్తుంది. కేంద్రం నుంచి ముందస్తు అనుమతి తీసుకుంటే కనీసం రూ.60వేల కోట్లు అప్పు పుట్టే అవకాశముంది. ఆ మొత్తంతో విచ్చలవిడిగా పథకాలు రూపొందించి ప్రతీ ఓటరు ఖాతాలో నగదు జమ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని పీకే టీమ్ సూచించడంతో జగన్ తెగ ఖుషీ అయ్యారట.అందుకే 8వ తేదీన పార్టీ నేతలతో సమావేశమై.. నేరుగా జగన్ ఢిల్లీ బాట పట్టనున్నారు. అక్కడే పీకే టీమ్ ప్లాన్ ను వర్కవుట్ చేయనున్నారు.

మరోవైపు టీడీపీ, జనసేన కలిసే చాన్స్ కూడా ఇవ్వకుండా జగన్ పావులు కదుపుతున్నారు. కేంద్రం వద్ద తనుకున్న పలుకుబడిని వినియోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

పోనీ ఆ రెండు పార్టీలు కలిసినా, కింది స్థాయి కేడర్ కలువకుండా చాలారకాల ప్లాన్లు జగన్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటు పథకాల ద్వారా ప్రజలను, తన మాట ద్వారా కేంద్రాన్ని ఆకట్టుకోవడంతో పాటు టీడీపీ, జనసేనలో అనిశ్చితి సృష్టించాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయం ముందుగానే పసిగట్టిన జనసేన, టీడీపీలు జాగ్రత్త పడినట్టు కూడా టాక్ వినిపిస్తోంది.

అందుకే రాజకీయ అంశాలు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులకు హైకమాండ్లు హెచ్చరికలు పంపాయి. ఇప్పటికే ఏపీలో ఇప్పుడు ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాయి. అయితే అధికార పార్టీలోజరుగుతున్న పరిణామాలతో ముందస్తు సంకేతాలు వెలువడుతున్నాయి. 175 సీట్లను టార్గెట్ చేస్తూ
సీఎం జగన్ వ్యూహాలు రూపొందిస్తున్నారు.

ఇప్పటికే ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కీలక మార్పులు చేశారు. ఏకంగా రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులపై ఫోకస్ పెట్టారు. మూడెంచల విధానంలో వడబోసి అభ్యర్థులను ఫైనలైజ్ చేయనున్నారు. ఇప్పటికే రెండు అంశాలపై అభ్యర్థుల జాబితాను వడబోశారు.

ఇందుకు ఐ ప్యాక్ బృందం నివేదికలు, సర్వే సంస్థలతో ద్వారా తెప్పించుకున్న వివరాలు, ప్రభుత్వ నిఘాసంస్థల ద్వారా సేకరించిన వివరాలను
క్రోడికరించి ఒక నిర్ణయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8న పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తుండడం ముందస్తు ఖాయమని తెలుస్తోంది. అటు తరువాత జగన్ ఢిల్లీ లో పెద్దలను కలవనుండడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.

జీ20 శిఖరాగ్ర సమావేశం వచ్చే ఏడాది భారత్ లోనే జరగనుంది. దానికి సన్నాహక సమావేశం ఈ నెల 8న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరగనుంది. సమావేశానికి సీఎం జగన్ తో పాటు విపక్ష నేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఇరువురు నేతల ఢిల్లీ షెడ్యూల్ సైతం ఖరారైంది. అయితే అంతకంటే ముందుగానే జగన్ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించడానికి డిసైడ్ కావడం హాట్ టాపిక్ గా మారింది.

అంతకంటే ముందుగానే జగన్ తన సొంత జిల్లా కడప టూర్ కు బయలుదేరుతుండడం, అటు నుంచి వచ్చిన వెంటనే పార్టీ వర్గాలతో సమావేశం, అటు తరువాత నేరుగా ఢిల్లీ వెళ్లడం వంటి పరిణామాలతో .. ఏదో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని అధికార పక్షంతో పాటు విపక్షాలు సైతం అనుమానిస్తున్నాయి.

ఎన్నికల వ్యూహాలను రూపొందించే పనిలో ఉన్న జగన్ అత్యున్నత సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో భేటీ కానున్నారు.ఇప్పటికే సమావేశానికి విధిగా హాజరుకావాలని అందరికీ ఆహ్వానాలు అందాయి. ఎన్నికలకు దిశా నిర్ధేశం చేయడానికే ఈ కీలక సమావేశమంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో పార్టీ అనుబంధ విభాగాలను, శ్రేణులను కలుపుకొని వెళ్లేందుకు ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేసి పార్టీ బాధ్యుల చేతిలో పెట్టనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు పనితీరు పేలవంగా ఉండి, ప్రజల్లో మంచి అభిప్రాయం లేని సిట్టింగ్ లను మార్చనున్నారన్న వార్తలు వస్తున్నాయి. అటువంటి వారిని తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం ఉంది. ఈ సమావేశంలో అటువంటి నేతల విషయంలో ఎటువంటి సంకేతాలు ఇస్తారోనని పార్టీ వర్గాల్లో చర్చ
అయితే నడుస్తోంది. మరోవైపు ఎన్నికలకు ఆరు నెలల ముందు అభ్యర్థులను ప్రకటిస్తామని జగన్ ప్రకటించారు. ఇప్పుడు ముందస్తు సంకేతాలుండడంతో ఎటువంటి ఇబ్బందులు లేని వారి పేర్లు ప్రకటిస్తారన్న చర్చ నడుస్తోంది.

అటు ప్రభుత్వ చర్యలు, ఇటు విపక్షాల హడావుడి చూస్తుంటే ముందస్తు తప్పదన్న ప్రచారం ఊపందుకుంటోంది. అయితే దీనిపై కొందరు ప్రభుత్వ పెద్దలు మాత్రం ముందస్తుకు చాన్సేలేదని చెబుతున్నారు. పార్టీలో సమన్వయం ఏర్పాటుచేయడానికి మాత్రమే జగన్ సమావేశం నిర్వహిస్తున్నారని.. చాలాచోట్ల పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని.. వాటిపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారని.. కఠినంగా హెచ్చరించనున్నారని చెబుతున్నారు.

అయితే వైసీపీ అత్యున్నత సమావేశంతో ఎన్నికలు ఎప్పుడన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ .. ముందస్తు ఎన్నికల విషయాన్ని రివీల్ చేస్తారని, అంతేగాక టిక్కెట్లు ఎవరికి అన్న విషయంపైనా క్లారిటీ ఇస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అంతేగాక ఈ దఫా సీట్లు దక్కని వారిని పార్టీ కోసం ఉపయోగపెట్టుకోవాలని కూడా జగన్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో పరిశీలకులను పెట్టే యోచనలో ఉన్నారని, ఓ నియోజకవర్గ ఎమ్మెల్యేను వేరే సెగ్మెంట్ కు ఇంఛార్జీగా నియమించే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు టిక్కెట్ రేసులో భారీగా ఆశావహులు ఉండడంతో, వచ్చే ఎన్నికల్లో సగానికి పైగా కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారని విశ్లేషకులు అంటున్నారు. అయితే జగన్ నిర్ణయాలపై పార్టీలో ఇప్పటికే వ్యతిరేకత కనిపిస్తోందని, తాజా పరిణామాలతో మరింత అసంతృప్తి రగిలే అవకాశముందని వీరంతా అంచనా వేస్తున్నారు.

అయితే జగన్ ముందస్తు స్ట్రాటజీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

Must Read

spot_img