మంత్రే వారికి టార్గెట్టా..తిరుగుబాటు నేతకు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కు ఎత్తులు వేస్తున్నారా..ఏకంగా మాజీ మంత్రి కే చేక్ పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారా…ఇందులో భాగంగానే కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా చేశారా..ప్రతిపక్షాల రాజకీయ చదరంగంలో మంత్రి నెగ్గుకొస్తారా…మంత్రికి వ్యతిరేకంగా ఉన్న వారిని కమలం గూటికి చేర్చుకుంటుందా… అసమ్మతి నేతలు కూడా అవకాశం దొరికితే కాంగ్రెస్ లేదా బిజెపి వైపు చూస్తున్నారా..ఆ జిల్లాలో అప్పుడే రాజకీయ చదరంగం పాచికలు మొదలయ్యాయా…ఇంతకీ ఏదా జిల్లా..ఏవరా నేతలు..
ఎమ్మెల్యే ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు ఉండగానే వనపర్తిలో రాజకీయ చదరంగం మొదలైంది. మంత్రి నిరంజన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్న కొందరు బీఆర్ఎస్ అసమ్మతి నేతలు పావులు కదుపుతూ ఎత్తులు వేస్తూ ఆట మొదలు పెట్టేశారు. అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను, అయోమయంలో ఉన్న కార్యకర్తలను బయటకు రప్పించి కాంగ్రెస్ లో చేర్పించడానికి పాచికలు వేస్తున్నారు. వీరి జిమ్మిక్కులను చూసిన అధికార బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తం కావడంతో ఆట రసకందాయంలో పడింది. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ లో ఉన్న ఓ కీలక నేత మంత్రి నిరంజన్ రెడ్డితో వచ్చిన విభేదాల వల్ల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆ నేత మరికొందరితో చేతులు కలిపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి నిరంజన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ లోని అసమ్మతి నేతలతో జత కడుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ ను వీడిన జెడ్పీచైర్మన్ లోకనాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, వారి అనుచర వర్గంతో సన్నిహితంగా మెలుగుతూ వారందరినీ కాంగ్రెస్ గూటికి చేర్చాలని ఎత్తులు వేస్తున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డికి అనుంగా శిష్యుడుగా ఉన్న మెగా రెడ్డి నాటకీయ పరిణామాల్లో మంత్రితో విభేదించి పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు.. ఆయనతోపాటు జడ్పీ చైర్మన్, వనపర్తి ఎంపీపీ, మరో కొందరు పార్టీ ప్రజాప్రతినిధులను రాజీనామా చేయించడంలో సఫలీకృతమయ్యారు.
ధన బలం, అంగ బలంతో పాటు పెద్దమందడి, గణపురం మండలాలలో కొంత పట్టు ఉన్న మేఘా రెడ్డికి కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తే బీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కోవచ్చని ఆ దిశగా పావులు కదుపుతూ వచ్చారు. దీనిపై నేరుగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో పాటు మాజీ మంత్రి చిన్నా రెడ్డి తో సంప్రదింపులు జరిపారు. ఈ సారి ఎమ్మెల్యే ఎన్నికలలో చిన్నారెడ్డి పోటీ చేయకుండా మేఘారెడ్డి వంటి ధన బలం ఉన్నవ్యక్తికి టికెట్ ఇస్తే బాగుంటుందని ప్రతిపాదనలు పెట్టారు.
అయితే చిన్నారెడ్డి దీనికి అంగీకరించకుండ ముందు వారందరినీ కాంగ్రెస్ పార్టీ లో చేరమని ఎన్నికల సమయంలో అధిష్టానం ఎలా నిర్ణయిస్తే అలా పని చేద్దామని సూచించడంతో సదరు నేతలు ఖంగుతిన్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి చిన్నారెడ్డి వద్ద చేసిన రాజీ ప్రయత్నాలు బెడిసికొట్టడంతో సదరు నేతలు చిన్నారెడ్డి పోటీ నుంచి తప్పుకునేలా చేసి ఆయనకు చెక్ పెట్టాలని పావులు కదుపుతున్నారు.. దీంట్లో భాగంగానే సొంత పార్టీకి చెందిన నేతలచే తిరుగుబాటు డ్రామా మొదలు పెట్టించారట చిన్నారెడ్డి. ఇదివరకే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కొందరు మాజీ మంత్రి చిన్నారెడ్డి ఈ దఫా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయరాదని చిన్నారెడ్డి హటావో..కాంగ్రెస్ బచావో అన్న నినాదంతో వ్యతిరేకంగా పని చేస్తున్నారు. వారితో సైతం ఈ కీలక నేతలు జతకట్టి వనపర్తి మున్సిపాలిటీలో ఉన్న ఐదు మంది కాంగ్రెస్ కౌన్సిలర్లచే పార్టీకి రాజీనామా చేయించడానికి పూనుకున్నారు. ఈ విషయం కావాలని బయటకు పొక్కేలా చేశారు.
దీంతో చిన్నారెడ్డి వారితో మాట్లాడి కొన్నాళ్లు వేచి ఉండండి తొందరపడకండి తాను పోటీ నుంచి తప్పుకొనే విషయం ఆలోచిద్దాం అని సంప్రదింపులు జరుపుతుండగానే చిన్నారెడ్డి వర్గీయులు దీనిని వ్యతిరేకించారట. దీంతో తప్పని పరిస్థితుల్లో తిరుగు బాటు చేసిన నలుగురు కౌన్సిలర్లు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీమంత్రి చిన్నారెడ్డి వ్యతిరేక కూటమి నేతలందరూ కలిసి పెబ్బేరు మున్సిపల్ కౌన్సిలర్ లతో సైతం పార్టీకి రాజీనామా చేయించాలని, అలాగే నియోజకవర్గంలోని పలు మండలాలను సందర్శించి కాంగ్రెస్ కార్యకర్తలతో పార్టీకి రాజీనామాలు చేయించి.
ఆయన పై ఒత్తిడి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ప్రచారం కొనసాగుతోంది. ఇక బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకి వచ్చిన అసమ్మతి నేతలు ఇటు కమలం గూటికి చేరాలా లేక కాంగ్రెస్ పార్టీ లో అవకాశం దక్కుతుందా అన్న ఆశతో ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉబలాటపడుతున్న పెద్దమందడి ఎంపీపీ మెఘా రెడ్డి కాంగ్రెస్ పార్టీ అయితే ఓటు బ్యాంకు బలంగా ఉంటుందని ఆశపడుతున్నారు. మరోవైపు బిజెపి వీరి చేరిక కోసం తలుపులు తెరిచి ఉంచిందట.
ఒకవేళ కాంగ్రెస్ లో అవకాశం లభించకపోతే బిజెపిలో చేరే ఆలోచనలో వారు ఉన్నట్లు జరుగుతున్న పరిణామాలను చూస్తే తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో చిన్నారెడ్డి వ్యతిరేక వర్గీయులు జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి తోపాటు పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి, వనపర్తి ఎంపిపి కిచ్చారెడ్డి వారి అనుచరులను కాంగ్రెస్ లోకి తీసుకురావాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు మేఘారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బలంగా ఉంటుందని పావులు కదుపుతూ పైకి మాత్రం కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డికి తప్ప బలమైన అభ్యర్థి ఎవరికి టికెట్ ఇచ్చినా మద్దతు తెలుపుతామని ప్రకటిస్తున్నారు. ఇక కాంగ్రెస్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి ఇటీవల మెఘారెడ్డిని రహస్యంగా కలిసి. మాట్లాడటం పట్ల పలు రకాలుగా చర్చలు వినిపిస్తున్నాయి.
ఇదంతా ఇలా ఉండగా మేఘా రెడ్డి వర్గం మంత్రి నిరంజన్ రెడ్డి ని ఎలాగైనా దెబ్బతీయాలని మంత్రి కి మద్దతు దారులుగా చెలామణీ అవుతున్న కొందరు భవిష్యత్తులో వనపర్తి రాజకీయాలను మలుపు మలుపు తిప్పేందుకు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తు న్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా భవిష్యత్తులో ప్రతిపక్షాలు ఏకమై మంత్రికి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. దీంతో ప్రతిపక్షాల్లోనే వర్గపోరు భారీగా ఉండడంతో, వీరంతా మంత్రికి చెక్ పెట్టగలరా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ముందుగా అసమ్మతి నేతలు ఏ పార్టీలో చేరతారోనన్న చర్చ సెగ్మెంట్లో వెల్లువెత్తుతోంది.
దీంతో వీరి చేరికతోనే ఏమైనా చేయగలమని స్థానిక నేతలు భావిస్తున్నారు. అదేసమయంలో వీరు మాత్రం తమకు టిక్కెట్ హామీ ఎక్కడ లభిస్తే, అక్కడికి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సెగ్మెంట్లో రాజకీయాలు హీటెక్కాయి. వీరిని ఏ పార్టీ చేర్చుకోగలదో .. వారికే బలం ఉంటుందన్న టాక్ తో ప్రతిపక్షాలు .. వీరిపై ఫోకస్ పెట్టాయని కూడా అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవెంతమేరకు వర్కవుట్ అవుతుందన్నదే హాట్ టాపిక్ గా మారింది.
వీరి రాజకీయ చదరంగంలో మంత్రి పావుగా మిగలతాడా.. లేక తన రాజకీయ చతురతతో ప్రతిపక్షాలకే చెక్ పెడతాడో వేచి చూడాలి..