ఆర్కిటిక్ మహాసముద్రం వేడెక్కుతోంది.. అంతలా ఇంతలా కాదు..నాలుగింత వేగంగా హీటెక్కిపోతోంది. ఒక్కోచోట ఒక్కోమాదిరిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఒకచోట నాలుగింతలు మరో చోట ఏడింతలుగా కూడా పెరిగిపోతోంది. మనం నివసించే భూమి అత్యద్భుతమైన ఎకోసిస్టంతో ఏర్పడింది. మనిషికి తెలివితేటలు లేని కాలంలో పుడమితల్లి ప్రక్రుతి శోభతో కళకళలాడింది. ఎప్పుడైతే మనిషి తనకు అనుమతి లేని వాటిలో జోక్యం చేసుకోవడం మొదలైందో అప్పటి నుంచి నేచర్ ఇన్ బాలన్స్ అన్నది మొదలైంది. ఎలాగైతే మనిషిలో వివేకం కొత్త పుంతలు తొక్కిందో అప్పటి నుంచే భూమికి కష్టాలు మొదలయ్యాయి.
తోటి ప్రాణులకు తోటి జీవులైన వ్రుక్షాలకు ఇబ్బందులు ప్రారంభమైనాయి. పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే సుమారు 1.1 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ వేడితో భూమి రగిలిపోతోంది. అయితే ఈ వేడెక్కె ప్రక్రియ అంతటా ఒకేలా కనిపించడం లేదు. కొన్ని చోట్ల చాలా ఎక్కువగా వేగంతో కొనసాగుతోంది. ఆర్కిటిక్ మహాసముద్రం విషయంలోనూ అంతే..గత 43 ఏళ్లలో మిగతా ప్రపంచంతో పోల్చి చూస్తే నాలుగు నుంచి ఏడు రెట్లు వేగం పుంజుకున్నట్టు తాజా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అధ్యక్షుడు ఎరిక్ సోల్హెమ్ ట్వీట్ చేయడంతో అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన మానవాళి చాలా నెమ్మదిగా స్పందిస్తోందని ఆయన అన్నారు.
ఆ కారణంగానే ప్రపంచంలో అనేక ప్రక్రుతి బీభత్సాలు, వాతావరణ వైపరీత్యాలు సంభవిస్తున్నాయని ఆయన చెబుతున్నారు. ఈ విషయాన్ని మరోలా చెప్పకనే చెప్పారు వాతావరణ శాస్త్రవేత్తలు. సముద్రంలో నదులు ప్రవహిస్తుంటాయని ఎంత మందికి తెలుసు..సముద్రంలో ప్రవహించే ఆ ప్రవాహాలలో ఉండే వేడి కారణంగానే ఒడ్డున ఉన్న భూమిపై వాతావరణం నిర్ణయం జరిగిపోతుందని కూడా చాలా మందికి తెలియదు. ఆ వేడి నీటి ప్రవాహాలలో ఉష్ణోగ్రతలు తగ్గినా ఎక్కువైనా ఆ ప్రభావం బయట మనం చూసే వాతావరణంలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇది శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా చెబుతున్న మాట. ఇప్పుడు ఎరిక్ సర్ చెబుతున్నట్టు గత 43 ఏళ్లలో మిగతా ప్రపంచంతో పోలిస్తే నాలుగు రెట్లు కన్నా ఎక్కువ వేగంగా వేడెక్కినట్టు ఇప్పటికే సర్వే నివేదికలు వెల్లడించాయి. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే మరీ ముఖ్యంగా వాతావరణం సరిగా ఉండటానికి ఆర్కిటిక్ ప్రాంతం తోడ్పడుతుంది. ఇది దెబ్బ తింటే విపరీత పరిణామాలు తప్పవు. ఇంతకీ ఆర్కిటిక్ ఎందుకు వేడెక్కుతోంది.. అన్నది చాలా కీలకమైన ప్రశ్న. దీనికి చాలావరకు ఆర్కిటిక్ మహా సముద్రపు మంచు కారణమని చెబుతున్నారు నిపుణులు.
ఇది సముద్రం మీద ఒక మీటరు నుంచి ఐదు మీటర్ల మందంతో పొరలా పరచుకుని ఉంటుంది. చలికాలంలో గడ్డకడుతుంది. వేసవిలో కరుగుతుంది. ఇది సూర్యుడి వల్ల కలిగే వేడిని 85శాతాన్ని తిరిగి అంతరిక్షంలోకి మళ్లిస్తుంది. అదే మిగతా సముద్రాలైతే 90శాతం వేడిని తమ లోపలకి గ్రహిస్తుంటాయి. మంచుపొరతో కప్పుకుని ఉన్నప్పుడు ఆర్కిట్ మహా సముద్రం ఓ అద్దంలా పనిచేస్తుంది. సూర్యుడి వేడిని వెనక్కు పంపిస్తుంది. అదే మంచు కరిగినప్పుడు వేడిని గ్రహించడం పెరుగుతుంది. దీంతో మంచు మరింత వేగంగా కరుగుతుంది. ఫలితంగా మహా సముద్రం ఇంకాస్త త్వరగా వేడెక్కుతుంది. ఆర్కిటిక్ ‘ఆర్కిటిక్ యాంప్లికేషన్’కు చాలా వరకు కారణం ఇదే అంటున్నారు. దిగువ అక్షాంశాలతో పోలిస్తే ఆర్కిటిక్ మీద సమీప ఉపరితల గాలి ఉష్ణోగ్రతలో మార్పులు పెరగడాన్ని ఆర్కిటిక్ యాంప్లికేషన్ అంటారు. చాలావరకు దీని నిష్పత్తి సుమారు ప్రస్తుతం 2.5 ఉంటుందని భావిస్తున్నారు. అంటే ప్రపంచ సగటు వేడికన్నా ఆర్కిటిక్ వద్ద 2.5 రెట్లు ఎక్కువ వేగంగా వేడెక్కుతోందని అర్థం. అయితే ఆర్కిటిక్ యాంప్లికేషన్ నిష్పత్తి సుమారు 4 వరకు ఉంటోందని తాజా ఆధ్యయనంలో వెల్లడైంది.
ఇదంతా వినేవారికి అంటే ఆర్కిటిక్ కు దూరంగా భారతదేశంలోని ఓ తెలుగు రాష్ట్రంలో కూర్చుని ఉన్న మనకు అర్థం కాని విషయం ఏమిటంటే.. అక్కడెక్కడో ఆర్కిటిక్ ప్రాంతం వేడెక్కితే మనకేంటి అని.. అలా అనుకోవడానికి వీలు లేదు. అక్కడ వేడి ప్రభావానికి ఇక్కడి అనేక అంశాలు స్పందిస్తాయి. వీటిల్లో ఒకటి గడ్డకట్టిన భూ ఉపరితలం పొర ప్రతీ వేసవిలో కరుగుతూ వస్తే దీనిలో ఇన్నాళ్లూ బందీగా ఉన్న కార్బన్ స్వేచ్చగా వాతావరణంలోకి విడుదలవుతుంది. ఇలా గడ్డకట్టుకుపోయిన మంచులో ఎంత కార్భన్ ఉందో తెలిస్తే గుండెలు గుభేలుమంటాయి.
ప్రపంచ సగటు ఉష్ణోగ్రతను 3 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా పెరిగేలా చేసేంత కార్బన్ దాగి ఉంది. అది గానీ విడుదలైందో వాతావరణం మరింత వేడెక్కిపోతుంది. ఇప్పటికే ఉదయం ఏడు గంటలకే సూర్యుడి వేడిని తట్టుకోలేకపోతున్నాం.. అలాకానీ జరిగితే సూర్యుడు రాకముందే వాతావరణంలో విపరీతమైన వేడి పుట్టుకు వచ్చేస్తుంది. ఈ మంచు పొరనే పెర్మా ఫ్రాస్ట్ అని అంటారు. రోజురోజుకు పెరిగిపోయే కార్బన్ శాతం తిరగి ఆర్కిటిక్ ఇంకాస్త వేడెక్కేలా చేస్తుంది. అప్పుడు పెర్మాఫ్రాస్ట్ ఇంకాస్త త్వరగా కరగడం మొదలై అదో సైకిల్ గా మారి విష వలయంగా తయారవుతుంది. మరో ఉపద్రవం ఏమిటంటే గ్రీన్ లాండ్ మంచు పలకలు కరగడం.. ఉత్తరార్థ గోళంలోని అతి పెద్ద మంచు ఫలకం ఇదే అని చెబుతారు. దీనిలో ఎంత మంచు దాగి ఉందంటే. దానితో సముద్ర మట్టాల ఎత్తు 7.4 మీటర్ల వరకు పెరిగేలా చేస్తుంద.
మంచు గడ్డకట్టుకుని ఉండటమే క్షేమకరం.. అంతే కానీ కరిగే వేగం పెరిగితే పెను ప్రమాదం ముంచుకు వచ్చినట్టే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు బెల్ట్ అండ్ ఇనిషియేటివ్ ప్రెసిడెంట్ ఎరిక్ చెబుతున్నదీ హెచ్చరిస్తున్నదీ ఇదే..అనేక కారణాల వల్ల అంటార్కిటిక్ ద్రువ ప్రాంతంలో మంచు కొండలు కరిగిపోతున్నాయని. దీనికి కారణం మనందరికీ బాగా తెలుసు. అదే గ్లోబల్ వార్మింగ్. మరి గ్లోబల్ వార్మింగ్ దేనికన్నది కూడా మనకు తెలుసు..అది మన వాడుతున్న శిలాజ ఇంధనాల వినియోగం పెరిగిపోవడం వల్లనే..సో.. ఇంతటి వినాశనానికి మనకు తెలియకుండానే మనం కారణమవుతున్నాం అన్నది మనం గమనంలో ఉంచుకోక తప్పదు.
ఇంత వేగంగా ఆర్కిటిక్ వార్మింగ్ రేటు పెరగడం ప్రపంచం మొత్తానిపై ప్రభావం చూపిస్తోందని అంటున్నారు శాస్త్రజ్నులు. దీనిని ఆర్కిటిక్ పోలార్ ఆంప్లిఫికేషన్ అంటున్నారు. ప్రస్తుత రోజులలో వివిధ దేశాలలో ఆ ప్రభావం తాలూకు వైపరీత్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆస్ట్రేలియాలో హీట్ వేవ్, దాంతో పాటే భారీ కుండపోత వర్షాలు వరదలు లాంటివి చాలానే జరిగాయి. పెరిగిన ఓషియానిక్ హీటింగ్ కారణంగా వాతావరణంలో చాలా రకాలుగా మార్పులు జరుగుతున్నాయి. అది ప్రపంచానికి పెద్ద ముప్పులా మారబోతోంది. అనుకున్న సమయంలో వర్షాలు పడకపోవడం, ఉన్నట్టుండి వేడి వాతావరణం రెట్టింపుగా మారడం, ఊహించనంత చలితో గడ్డ కట్టుకుపోయే వాతావరణాలు సర్వసాధారణమైపోతాయి.
అకాల వర్షాలు మెరుపు వరదలు, మంచు కొండలపై నుంచి జాలువారే గ్లేషియర్ వరదలు దిగువ ప్రాంతాలను ముంచేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం లాంటి కారణాలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. దీనంతటికి కారణం సముద్రంపై గడ్డకట్టుకుని ఉండాల్సిన మంచు పలకలు కరిగిపోతుండటమే. ఆ కరిగిపోవడానికి కారణం పరిశ్రమల ద్వారా బయటకు వచ్చే వేడివాయువులు కాలుష్యాలే అన్నది మనం రోజూ వింటూనే ఉన్నాం. పర్యావరణానికి ఇన్ని రకాలైన నష్టాలు కలుగజేస్తున్న కాలుష్యకారకాలను బహిష్కరించడం ఒక్కటే ప్రస్తుతానికి మానవాళి ముందున్న మార్గం. మరి దేశాలు ఏం చేయనున్నాయన్నది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు విశ్లేషకులు. ఆర్కిటిక్ అనగానే మనకు మంచు పలకలు, ద్రువపు ఎలుగుబంట్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఆ రెండూ అద్రుశ్యం కానున్నాయన్నది మనం మరవకూడదు.
ముఖ్యంగా సముద్రంపైని మంచు పలకలు కనిపించకుండా పోతే సూర్యతాపం ఎన్నో రెట్లు పెరిగి మనకు అపారమైన అపకారం తలపెట్టడం ఖాయం అని వారు హెచ్చరిస్తున్నారు.