Homeజాతీయంఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది..

ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుందా..? ఎవరూ ఊహించని విధంగా వచ్చే నెలలో సీఎం జగన్ ప్రకటన చేసే
అవకాశం ఉందా..

జనవరి నెలలోనే ఏపీ అసెంబ్లీ రద్దుపై సీఎం ప్రకటిస్తారనే వార్త రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షా లను ఒప్పించడంలో జగన్ సక్సెస్ అయ్యారని అంటున్నారు. మొన్న ఢిల్లీ పర్యటన వెనుక అసలు అజెండా అదే అంటున్నారు. చాలా రోజులుగా దీనిపై బీజేపీ పెద్దలను కలిసినా.. సానుకూల స్పందన రాలేదని.. కానీ తాజా పర్యటనలో జగన్ ప్రతిపాదనకు కేంద్ర పెద్దలు ఆంగీకరించారని తెలుస్తోంది.

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం జగన్ .. ఓ వైపు రాష్ట్ర సమస్యలు.. ఇతర నిధులు.. విభజన హామీలపై కాసేపు మాట్లాడిన తరువాత.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలి అనుకుంటున్నామని.. అందుకు కారణాలు కూడా వివరించారని ఓ ప్రచారం జరుగుతోంది. అందుకు మోదీ కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. దీంతో అన్నీ కుదిరితే, తెలంగాణలో ఎన్నికలతో పాటే ఏపీలో ఎన్నికలు ఉండే అవకాశం ఉందని, లేదంటే అంతకన్నా ముందే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు..

2024 వరకు అధికారంలో ఉండేందుకు అవకాశం ఉన్నా.. ఆయన ఎందుకు అసెంబ్లీని రద్దు చేయాలి అనుకుంటున్నారన్నదానిపై ప్రధానికి వివరణ ఇచ్చినట్టు టాక్. దీనివెనుక.. జగన్ పలు రకాలుగా సర్వే చేయించుకున్నారు. అందులో ఒకటి ఐ ప్యాక్ సర్వే కాగా.. మరొకటి వైసీపీ ఎంపీ పర్యవేక్షణలో ఓ ప్రైవేటు సంస్థ సర్వే
చేసింది. అలాగే ప్రభుత్వ ఇంటెలిజన్స్ ద్వారా కూడా ఎప్పటి కప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ నివేదికలను పూర్తిగా పరిశీలించిన తరువాతే ఆయన ముందస్తుకు వెళ్లడమే మేలను భావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి నమ్మకం ఉందని.. కానీ ఒకవేళ టీడీపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తే.. పరిస్థితి వేరేలా ఉండే అవకాశం ఉందని అంచనాకు వచ్చినట్టు టాక్..

అలాగే ప్రస్తుతం ఆర్థికంగానూ ఇబ్బందులు ఉన్నాయని.. అవి మరింత పెరిగే ప్రమాదం ఉందని.. ఆ సమస్యను అధిగమించాలంటే ముందస్తు వెళ్లడమే మంచిదని జగన్ భావిస్తున్నట్టు ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతానికి విపక్షాలు చేస్తున్నంత వ్యతిరేకత ప్రభుత్వంపై లేదని.. కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయి.. కేంద్రం నుంచి నిధులు రాకపోతే.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఏడాదిలోపే ఎన్నికలకు వెళ్తే.. కచ్చితంగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది జగన్ నమ్మకం అని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు తాజాగా ఆయన నర్సీపట్నంలో మాట్లాడిన తీరు చూసినా.. పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లినట్టే కనిపిస్తోంది..అధికంగా రాజకీయాలపైనే ఫోకస్ చేశారు.

చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తూనే మాట్లాడారు.. అంతేకాదు ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని.. ప్రతి వైసీపీ కార్యకర్త కాలర్ ఎగరేసుకుని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగొచ్చు అని జగన్ అన్నారు. ఇప్పటికే పలుమార్లు గడప గపడకు ప్రభుత్వంపై సమీక్షలు నిర్వహించిన ఆయన.. జనవరి రెండో వారంలోపు మరో సమీక్ష నిర్వహించి.. ఆ వెంటనే అసెంబ్లీ రద్దుపై ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.. ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న అంశం ముందస్తు ఎన్నికలు.

ఏప్రిల్ తర్వాత అసెంబ్లీని రద్దు చేయడానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల వద్ద అనుమతి తీసుకున్నారన్న ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై వైసీపీ వర్గాలు మాత్రం గుంభనంగా ఉంటున్నాయి. గత కొంతకాలంగా రాష్ట్రంలో ముందస్తు మాట తరచూ వినిపిస్తోంది. చంద్రబాబు పదే పదే ఎన్నికలు ముందే వస్తాయంటూ కేడర్‌ను సంసిద్ధం చేస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తలను అధికార పార్టీ కొట్టివేస్తూ వస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెబుతూ వస్తోంది. కానీ వైసీపీ ముందస్తుకు తమ పార్టీ శ్రేణులను చాలా రోజులుగా సిద్ధం చేస్తోంది. మూడున్నరేళ్ల పాలన పూర్తిచేసుకున్న వైసీపీ ప్రభుత్వం మళ్లీ వచ్చే ఎన్నికల కోసం శ్రేణులను సిద్ధం చేస్తోంది.

ఎన్నికలకు ఏడాదిన్నర ముందే గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం ద్వారా జనం బాట పట్టింది. మార్చిలో ఈ కార్యక్రమం ముగిసిపోతుంది. అప్పుడే టిక్కెట్లు ప్రకటిస్తానని జగన్ కూడా స్పష్టం చేశారు. ఈ పరిణామాలను గమనించిన విపక్షాలు ఆరు నెలల తర్వాత ముందస్తు ప్రకటన ఖాయమని ఊహిస్తున్నాయి. ఇప్పుడు
అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. అప్పటికే బడ్జెట్ సమావేశాలు ముగిసిపోనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఏ క్షణమైనా ముందస్తు ఎన్నికలపై అధికారిక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన నేతలు ముందస్తు సంకేతాలపై ఓ అంచనాకు వచ్చాయి.


దానికి తగ్గట్లే చంద్రబాబు నిత్యం జనంలోనే ఉంటున్నారు. లోకేష్ పాదయాత్ర కూడా మరికొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతోంది. కొంతకాలంగా ప్రభుత్వంపై దూకుడుగా వెళ్తోన్న పవన్ కళ్యాణ్ కూడా వారాహితో యాత్ర మొదలుపెట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ ముందస్తుకు సూచనలుగానే భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజు కూడా..ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని సిద్ధంగా ఉండాలని తమ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఇదంతా ఓ సందేశమేనని నమ్ముతున్నారు.

విపక్షాలు ఎన్నికలకు సన్నద్ధం కాకుండా చేసి.. అడుగులు వేయాల్సి ఉంటుంది. సీఎం జగన్ ఏం ఆలోచిస్తున్నారో కానీ ముందస్తుపై గత ఏడాది నుంచి ఏపీలో చర్చ జరుగుతూనే ఉంది. ఏపీలో 2024 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఈ ఎన్నికలు కూడా జరుగుతాయి. అయితే రాష్ట్ర పరిస్థితులు, పార్టీ ప్రణాళిక లాంటి అనేక అంశాలు ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ ను పురిగొల్పుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

సార్వత్రిక ఎన్నికల వరకూ ఆగితే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా టర్న్ అవుతాయోననే భయం వైసీపీ శ్రేణుల్లో ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత బాబు పర్యటనలకు విపరీతంగా జనం వస్తుండడం, లోకేశ్ పాదయాత్ర మొదలైతే టీడీపీ కేడర్ మరింత యాక్టివ్ కావడం.. లాంటి అంశాలు వైసీపీని కలవరపెడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా సంక్రాంతి తర్వాత పూర్తిస్థాయిలో రాష్ట్రంలో మకాం వేసేందుకు సిద్ధమవుతున్నారు. వారాహి ద్వారా ప్రచారం చేసేందుకు రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు.

మరోవైపు ఐప్యాక్ సర్వే కూడా వైసీపీని మరింత కలవరపాటుకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బొటాబొటి మెజారిటీ సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం మాత్రమే ఉందని ఐప్యాక్ సర్వే తేల్చినట్టు సమాచారం. ముఖ్యంగా 90 – 100 సీట్లు మాత్రమే ఈసారి వైసీపీకి దక్కుతాయని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఇది వాస్తవం అయితే ఎన్నికల నాటికి ట్రెండ్స్ ఎలాగైనా మారొచ్చు. ఇటీవల పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కూడా 35-40 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమాత్రం బాగాలేదని జగన్ ప్రకటించారు.

గతంలో 151 సీట్లు రాగా వారిలో 40 మంది ఎమ్మెల్యేల పరిస్థితి బాగాలేదంటే 110 స్థానాల్లో మాత్రం పట్టు ఉన్నట్టు లెక్క. ఈసారి 175 సీట్లూ గెలవాలని టార్గెట్ పెట్టుకుంటోంది వైసీపీ. కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. పైగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగులకు జీతాలు కూడా ఒకటే తేదీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి ఎన్నికల వరకూ కొనసాగితే ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత రావడం సహజం. మరోవైపు షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ వరకూ ఆగితే టీడీపీ, జనసేన మరింత బలపడే ప్రమాదం కూడా ఉంది. అందుకే వాటికి తగిన సమయం ఇవ్వకుండా ఉండేందుకు, ఉద్యోగుల నుంచి వ్యతిరేకతను తప్పించుకునేందుకు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

మరి ముందస్తు ఉంటుందో లేదో తేలాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.

Must Read

spot_img