Homeజాతీయంఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది..

ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది..

ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది.. సోము అన్నట్లు తెర వెనుక .. కోవర్టు రాజకీయం సాగుతోందా..?

కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి రాజీనామా చేసి, తెలుగు దేశం పార్టిలోకి వెళ్ళారు. ఆయనతోపాటుగా ఆయన అనుచరులంతా తెలుగు దేశం పార్టిలోకి వెళతారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కన్నా లక్ష్మినారాయణతోపాటుగా ఆయన ముఖ్య అనుచరులు కొద్దిమంది మాత్రమే సైకిల్ ఎక్కారు. ఇంకా కొందరు భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. అయితే వీరంతా తెలుగు దేశం పార్టీలోకి వెళ్ళటానికి ఇష్టపడలేకనే, బీజేపిలో ఉండిపోయారని అంటున్నారు.

తెలుగుదేశంలోకి వెళ్లడం లేక బీజేపీలోనే ఉండిపోయిన నేత వంగవీటి నరేంద్ర. విజయవాడ తూర్పు నియోజకవర్గం బీజేపి ఇంచార్జ్‌గా ఉన్నారు. కన్నా సహకారంతోనే పార్టీలోకి వచ్చారు. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. వంగవీటి ఫ్యామిలీలో అత్యంత కీలకమైన వ్యక్తి వంగవీటి నరేంద్ర… కన్నాతోపాటుగా ఎక్కడకైనా వెళతారు. కానీ తెలుగు దేశం పార్టీలోకి మాత్రం వెళ్ళలేదు. వంగవీటి మోహన రంగా హత్య, తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో జరగటంతో ఆ పార్టీని జీవితాంతం రాజకీయంగా వ్యతికేరిస్తున్నారు నరేంద్ర.

దీంతో ఆయన పార్టీ మారలేదు. అంతే కాదు గుంటూరుకు చెందిన రిటైర్డ్ శాస్త్రవేత్త చందు సాంబశివరావు కూడా కన్నా లక్ష్మినారాయణ ముఖ్య అనుచరుల్లో ఒకరు. ఆయన కూడా తెలుగు దేశం పార్టీలోకి వెళ్ళలేదు. ఆయన గతంలో తెలుగు దేశం పార్టీ నుంచి కన్నా ప్రోత్సాహంతో భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. దీంతో ఆయన ఇప్పుడు తిరిగి తెలుగు దేశం పార్టీలోకి వెళ్లేందుకు ఇష్టపడటం లేదని అంటున్నారు. కన్నా పార్టీ మారిన సమయంలో అత్యంత తక్కువ మంది మాత్రమే ఆయన వెనుక తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళారు.

అక్కడ వారందరికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. ఆయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న మిగిలిన కన్నా వర్గం పైనే అందరి చూపు ఉంది. వివిధ రకాల కారణాలతో వారు కన్నా తోపాటుగా పార్టీ నుంచి బయటకు వెళ్లలేదు. అయితే ఇప్పుడు వారంతా కన్నా కోవర్ట్‌లు అనే ప్రచారం కూడా మొదలైంది. దీంతో అలాంటి వారందరికి ఇది మింగుడుపడని వ్యవహరంగా మారింది. భారతీయ జనతా పార్టిలోనే కొనసాగుతామంటూ, ఇప్పటికే ఆ పార్టీకి చెంది నాయకులు, చాలా మంది స్టేట్ మెంట్‌లు ఇచ్చినప్పటికి, వాటిని పార్టీ అధినాయకత్వం అంత ఈజీగా తీసుకోవటం లేదు.

ఎక్కడ నుంచి వచ్చారో అక్కడకు వెళితే బెటర్ అని పరోక్షంగా సంకేతాలు పంపుతోందట. దీంతో అటు పార్టీ నుంచి బయటకు వెళ్లలేని స్దితిలో ఉన్నారు. దీనివల్ల కన్నా క్యాడర్‌గా ముద్రపడిన వారికి తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి రాజీనామా చేయటం, టీడీపీలో చేరడంతో ఎక్కువ రిలక్స్ అయ్యింది మాత్రం పార్టీ అధ్యక్షుడు సొము వీర్రాజు అనే ప్రచారం ఉంది. కన్నా పార్టీలో ఉన్నంత కాలంలో సొము వీర్రాజును టార్గెట్‌గా చేసి కామెంట్స్ చేశారు. పార్టీ వీడుతున్న రోజు కూడా కన్నా లక్ష్మినారాయణ, వీర్రాజుపైనే తీవ్ర స్దాయి ఆరోపణలు చేశారు.

దీంతో కన్నా రాజీనామా తరువాత వీర్రాజు రిలాక్స్ అయ్యారని ప్రచారం జరుగుతుంది. దీంతో అదేసమయంలో కన్నా వర్గంగా ముద్ర పడిన వారిని వీర్రాజు ఎంపిక చేసి మరి లిస్ట్ అవుట్ చేసి పెట్టుకున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్ధి పార్టీల్లోనూ తమ మనుషులను కోవర్టులుగా పంపిస్తూ ఉంటారు. ఆ పార్టీల్లో ఏం జరుగుతోందో ఆ కోవర్టులు తమ ఒరిజినల్ పార్టీ బాసులకు ఉప్పందిస్తూ ఉంటారు. ఇటువంటి ఆపరేషన్లతో ఏపీ బీజేపీ తల పట్టుకొంటోంది. పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కోవర్ట్ నేతలు ఏం చేస్తారో అని భయపడాల్సిన పరిస్థితి. ఏపీ బిజెపిలో కొంతకాలంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు చాలా చిత్రంగా అనుమానాస్పదంగా ఉంటున్నాయి.

ఏపీ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఆ పదవికి రాజీనామా చేసి అమాంతం టిడిపిలో చేరిపోయారు. అంటే టిడిపిలో చేరాలని చాలా కాలం క్రితమే డిసైడ్ అయ్యి ఆ తర్వాతనే రాజీనామా చేశారని అనుకోవాలి. అయితే టిడిపి వర్గాల కథనం ప్రకారం అసలు కన్నా బిజెపిలో చేరేటపుడే చంద్రబాబు వ్యూహానికి అనుగుణంగా వెళ్లి ఉండచ్చంటున్నారు. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. కన్నాబిజెపికి బై చెప్పి టిడిపిలో చేరిన రోజున పార్టీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు పై ఒంటికాలిపై లేచి నిలబడ్డారు. సోము వీర్రాజు కారణంగానే పార్టీ నాశనమైపోతోందని తీవ్రమైన ఆరోపణ చేశారు. అందుకే తాను బిజెపిని వీడుతున్నానని కూడా ఆయన అన్నారు.

ఆ తర్వాత సోము వీర్రాజు వ్యవహార శైలి ఏ మాత్రం బాగా లేదని ఆయన్ను ఆ పదవి నుండి తప్పించాల్సిందేనని ఏపీ బిజెపిలోని కొందరు నేతలు ఢిల్లీ వెళ్లి బిజెపి నేత మురళీధరన్ ముందు మొర పెట్టుకున్నారు. బీజేపీ దక్షిణ రాష్ట్రాల ఇంఛార్జ్ గా ఆయన వ్యవహరిస్తున్నారు. దీని వెనుక కూడా కోవర్ట్ ఆపరేషన్ బలంగా ఉందనేది సమాచారం. ఇలా అందరూ సోము వీర్రాజునే టార్గెట్ చేయడానికి కారణాలేంటా అని ఆరా తీస్తే అసలు విషయం బట్టబయలైంది.

2024 ఎన్నికల నాటికి బిజెపితో మళ్లీ పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు తహ తహలాడుతున్నారు. అయితే బిజెపి హై కమాండ్ మాత్రం చంద్రబాబుతో పొత్తుకు ససేమిరా అంటోంది. హైకమాండ్ చంద్రబాబుతో పొత్తుకు విముఖంగా ఉండడానికి ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజే కారణమని బిజెపిలోని టిడిపి నేతలు చంద్రబాబుకు ఉప్పందించారట.2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం చంద్రబాబు నాయుడు దగ్గరుండి నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులకు ఫ్లైట్ టికెట్లు కొని వారిని ఢిల్లీ పంపి అర్జంట్ గా బిజెపిలో చేరిపొమ్మన్నారని హస్తిన కోళ్లు అప్పట్లో అదే పనిగా కొక్కొరొకో అన్నాయి. తెలుగుదేశం ఎంపీలను బిజెపి ఎందుకు తీసుకుందని చంద్రబాబు మాట వరసకు కూడా నిలదీయకపోవడంతో ఇదంతా కోవర్ట్ ఆపరేషన్ లో భాగం అని అప్పుడే అర్థం అయిపోయింది.

అలా చంద్రబాబు నాయుడు పంపిన నలుగురు ఎంపీల్లో సుజనా చౌదరి , సిఎం రమేష్ లు ఇద్దరూ మాత్రం ఇప్పటికీ టిడిపి వాయిస్ నే వినిపిస్తారు. చంద్రబాబు అజెండానే కొనసాగిస్తున్నారు. అమరావతికి బాబు జై అంటే వీళ్లూ సై అంటున్నారు. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బాబు అనమంటే వీళ్లు తడుముకోకుండా అనేస్తున్నారు. అలాగే ఏపీ బిజెపిలో సోము వీర్రాజు వైసీపీ అధినేత కన్నాకూడా ఎక్కువగా చంద్రబాబును ద్వేషిస్తున్నారని ఈ నేతలే చంద్రబాబు చెవిలో వేసేసరికి బాబు తట్టుకోలేకపోయారట. అందుకే ఆపరేషన్ సోము వీర్రాజుకు తెరలేపారు.

కన్నా ఉండగానే సోముకు వ్యతిరేకంగా వ్యవహారాలు చేయించారు. అది హై కమాండ్ దృష్టికి వెళ్లిన తర్వాతనే కన్నాకు ఉద్వాసన పలికి సోము వీర్రాజును అధ్యక్షుని చేసింది నాయకత్వం. అక్కడ తన ప్లాన్ బెడిసి కొట్టడంతోనే చంద్రబాబు రాజీనామా చేసిన వెంటనే కన్నా చేత సోము వీర్రాజుపై విమర్శలు గుప్పించారు. అలాగే తమ కనుసన్నల్లో పనిచేసే కొందరు బిజెపి నేతలను ఢిల్లీ పంపించి సోము వీర్రాజును పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేయించారని ప్రచారం జరుగుతోంది.అసలు ప్లాన్ ఏంటంటే వీలైనంత తొందరగా ఏపీ బిజెపి అధ్యక్ష పదవి నుండి సోము ను తప్పించి చంద్రబాబు నాయుణ్ని అభిమానించే వ్యక్తిని ఎవరినైనా ఆ పదవిలో కూర్చోబెట్టాలన్నది వారి ప్లాన్. బాబును అభిమానించకపోయినా ఫర్వాలేదు కానీ టిడిపితో పొత్తును వ్యతిరేకించకుండా ఉంటే చాలునని వారు భావిస్తున్నారు.

ఆ జాబితాలో ఎన్టీయార్ కుటుంబ సభ్యురాలు అయిన పురంధేశ్వరికే పదవి వస్తే తమ పని తేలికవుతుందని వారు అంచనా వేసుకుంటున్నారు. ఆ మధ్య దగ్గుబాటి వెంకటేశ్వరరావు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో ఉంటే చంద్రబాబు అమాంతం వెళ్లి తోడల్లుణ్ని పరామర్శించారు. ఎన్టీయార్ కు వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత దూరమైన ఈ ఇద్దరూ చాలా ఏళ్ల తర్వాత కలుసుకన్నది కూడా మొన్ననే. మరో రెండు మూడు సార్లు రెండు కుటుంబాల మధ్య గేదరింగ్స్ పెట్టుకుని పాత సంబంధాలు రెన్యువల్ చేసుకుంటే పురంధేశ్వరి కూడా తమకు అనుకూలంగానే ఉంటారని చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారట.

Must Read

spot_img