- ఇప్పటివరకు ఇంఛార్జిగా ఉన్న మాణిక్కం .. తన పదవికి రాజీనామా చేశారా..?
- ఇంతకీ అసలు టీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది…
తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడేలా లేదు. దిగ్విజయ్ సింగ్ వచ్చి పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా.. గొడవలు సద్దుమణగలేదు. కాంగ్రెస్‌లో రేవంత్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య నెలకొన్న విభేదాల్లో.. మరో కీలక పరిణామం చోటచేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతల నుంచి మాణిక్కం ఠాగూర్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌కి సంబంధించిన అన్ని వాట్సప్ గ్రూప్‌ల నుంచి ఆయన లెఫ్ట్ అయ్యారు.
ఇప్పటి వరకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు అని చివరి మెసేజ్ పెట్టారు మాణిక్కం ఠాగూర్. ఆ తర్వాత అన్ని గ్రూప్‌ల నుంచి ఆయన నిష్క్రమించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా మాణిక్ రావ్ ఠాక్రే నియమితులయ్యారు. మాణిగం ఠాగూర్ స్థానంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్‌గా మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతను ఏఐసీసీ అధిష్టానం నియమించింది. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గమంతా మాణిక్కం ఠాగూర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
రేవంత్ రెడ్డి చేతిలో మాణిక్కం ఠాగూర్ కీలుబొమ్మలా మారారని.. ఆయన వల్లే పార్టీలో ఇన్ని సమస్యలని.. దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. మాణిక్కం ఠాగూర్‌ను తప్పిస్తే.. అంతా సర్దుకుంటుందని వివరించారట. అంతకుముందు డిసెంబరు 19న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాణిక్కం ఠాగూర్ సమావేశమై.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై వివరించారట. పార్టీలో నేతల మధ్య అంతర్గత పోరు తారా స్థాయికి చేరిందని… వారి గొడవలను తాను పరిష్కరించలేనని
చెప్పారట. కొందరు నేతలు తనను కావాలనే టార్గెట్ చేశారని ఫిర్యాదు చేశారట. పరిస్థితులను మీరే పరిష్కరించాలని కోరారట.
తెలంగాణ ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారట. తెలంగాణ కాంగ్రెస్ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. మల్లిఖార్జున ఖర్గే ఫోన్ చేసినప్పటికీ సీనియర్లు ఎవరూ హాజరు కాలేదు. ఇక తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలతో తాను వేగలేనని ఆయన బాధ్యతల నుంచి వైదొలికినట్లుగా తెలుస్తోంది. మాణిగం
ఠాగూర్ బాధ్యతల నుంచి వైదొలిగారని… నాలుగైదు రోజుల తర్వాత హైకమాండ్ కొత్త ఇంచార్జ్ ను ప్రకటించే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ గంటల వ్యవధిలో తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను మహారాష్ట్రకు చెందిన పార్టీ నేత మాణిక్ రావ్ ఠాక్రేకు అప్పగించింది.
కాగా, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాణిక్కం ఠాగూర్ ఇన్నాళ్లూ మద్దతుగా నిలిచారు. ఆయన ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటే.. కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని మరింత ఇబ్బందిపెట్టే అవకాశముందని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాణిక్కం ఠాగూర్‌పై తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నేతలు ఆరోపణలు చేశారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డికి ఆయన సపోర్టు చేస్తున్నారని హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు.
రేవంత్ రెడ్డి వద్ద నుంచి డబ్బులు కూడా తీసుకున్నారని కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ సమావేశం అవ్వడం, రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి నష్టం చేస్తున్నారని ఆరోపించడం.. పార్టీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దిగ్విజయ్ సింగ్ రిపోర్టు సమర్పించిన తర్వాత మాణిక్కం ఠాగూర్‌ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. తాజా పరిణామం దీనికి ఊతమిస్తోంది.
అయితే, మాణిక్కం ఠాగూర్‌ను కాంగ్రెస్ అధిష్టానమే తొలగించిందా? లేకపోతే.. తాను ఇంఛార్జ్‌గా ఉండగా, ఇక్కడి వ్యవహారాలను పరిశీలించేందుకు మరో నేతను పంపించారని మాణిక్యం ఠాగూర్ మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నారా? లేదా మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. చాలాకాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుల లొల్లి నడుస్తోంది.
పార్టీలో సుదీర్ఘకాలంగా ఉంటూ వస్తోన్న పాతకాపులకు పార్టీ పగ్గాలను అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించినప్పటికీ.. ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కొద్దిరోజుల కిందటే దిగ్విజయ్ సింగ్ సైతం- హైదరాబాద్ కు వచ్చి.. సయోధ్య కుదర్చడానికి తనవంతు ప్రయత్నాలు చేశారు గానీ సాధ్యపడలేదు. రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలనేది సీనియర్ల డిమాండ్.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు, భువనగిరి లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. వీరంతా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తోన్న వారే. దీనికి కారణాలు లేకపోలేదు. రేవంత్ రెడ్డి ఇదివరకు సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగడమే.
ఈ గందరగోళ పరిస్థితులను చక్కబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్..
పార్టీ హైకమాండ్ దృష్టికీ ఇక్కడి పరిస్థితులను తీసుకెళ్లారు. దిగ్విజయ్ సింగ్ ను కూడా రాష్ట్రానికి రప్పించి- నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అవేవీ కార్యరూపాన్ని
దాల్చలేకపోయాయి. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు, రేవంత్ రెడ్డి వర్గీయుల మధ్య సయోధ్యను కుదర్చలేకపోయాయి. దీనితో మాణిక్కం ఠాగూర్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక్కడి గొడవలను శాంతింపజేయడంలో విఫలం కావడానికి నైతిక బాధ్యతగా ఆయన ఇన్ ఛార్జ్ పదవి నుంచి తప్పుకొన్నారు.
తన రాజీనామా లేఖను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గెకు పంపించారు. తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులన్నింటినీ వివరిస్తూ ప్రత్యేకంగా మరో లేఖను కూడా మాణిక్కం ఠాకూర్ రాసినట్లు చెబుతున్నారు. మాణిక్కం ఠాగూర్ రాజీనామా వ్యవహారంతో- తెలంగాణ కాంగ్రెస్ విభేదాలు పతాక స్థాయికి చేరినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనుంది తెలంగాణ.
ఆగస్టు-అక్టోబర్ లల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తోన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా రాష్ట్ర ఇన్ ఛార్జే తన పదవి నుంచి తప్పుకోవడం కలకలం రేపుతోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం ముగిసిందా ? లేక తాత్కాలికంగా సీనియర్లు చల్లబడ్డారా ? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు కూల్ అవ్వాలంటే మాణిక్యం ఠాగూర్‌ను తప్పించి మరో వ్యక్తిని ఇంఛార్జ్‌గా నియమించాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.
ఇందుకోసం అప్పుడే కొత్త నేత కోసం కాంగ్రెస్ నాయకత్వం అన్వేషణ మొదలుపెట్టిందని.. ఈ రేసులో హర్యానాకు చెందిన దళిత నేత పునియా ఉన్నారనే కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. తాను అన్నీ చూసుకుంటానని.. నేతలెవరూ పదే పదే బహిరంగంగా పార్టీ వ్యవహారాలపై మాట్లాడవద్దని సూచించారు.
సీనియర్ నేత అయిన దిగ్విజయ్ సూచించడంతో… తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నారని..అయితే వారంతా మళ్లీ ఎప్పుడు నోరు విప్పుతారో చెప్పలేమని పార్టీలో టాక వినిపిస్తోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్‌ను ఎంపిక చేసే ప్రక్రియను కాంగ్రెస్ నాయకత్వం కొత్త సంవత్సరంలే మొదలుపెట్టే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సీనియర్లకు ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఇందుకోసం ఎంపిక చేస్తారని.. తెలంగాణలోని పార్టీ వ్యవహారాల గురించి సమగ్రంగా తెలిసిన దిగ్విజయ్ పర్యవేక్షణలోనే ఈ మొత్తం ప్రక్రియ ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
మరి మాణిక్కం ప్లేస్ లో వచ్చేదెవరన్నదే ఆసక్తికరంగా మారింది…