Homeఅంతర్జాతీయంభారత్ పై చైనా మరో బారి కుట్ర .. భారత్ తిప్పి కొట్టనుందా ?

భారత్ పై చైనా మరో బారి కుట్ర .. భారత్ తిప్పి కొట్టనుందా ?

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రాజేస్తోన్న చైనా .. ఇప్పుడు నీటి యుద్ధానికి తెర తీసిందా..? భారత్, ఇతర దాయాది దేశాల్లో నీటి కొరతకు పావులు కదుపుతోందా..? అందుకే బ్రహ్మపుత్ర నదిపై పట్టుకు అతిపెద్ద ప్రాజెక్టుకు సిద్ధమైందా..?

చైనా భారీ కుట్రకు పథకం వేస్తోందా? టిబెట్‌లో భారీ ప్రాజెక్ట్‌లు నిర్మించి ఆసియాలోనే అతి పెద్ద నదులను ఎండబెట్టే ప్రయత్నాలు చేస్తోందా? సహజ
సిద్ధమైన నదీ ప్రవాహాలకు అడ్డుకట్ట వేసే జలాలను తరలించుకుని పోవాలనే దుర్మార్గపు ఆలోచన చేస్తోందా?

అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో చైనా చేపట్టిన 60 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆనకట్ట నిర్మాణంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. యార్లుంగ్‌ త్సాంగ్పో నదిపై నిర్మిస్తున్న ఈ డ్యామ్‌ ద్వారా చైనా నీళ్లను మళ్లించుకొనే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్తు శాఖ వెల్లడించింది. చైనా ఈ డ్యామ్‌ ద్వారా నీళ్లను ఆపి అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాంలలో వరద పరిస్థితులకు లేదా నీటి కొరతకు కారణమయ్యే అవకాశం ఉందని తెలిపింది.

అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్‌ సన్నద్ధమై ఉందని, నీటి నిల్వ కోసం అరుణాచల్‌ ప్రదేశ్‌లో చాలా చోట్ల ఆనకట్టల నిర్మాణాన్ని చేపట్టిందని అధికారులు తెలిపారు. భారత్‌కు పక్కలో బల్లెమైన చైనా .. దుర్మార్గపు ఆలోచనలు ఊహకందని విధంగా సాగుతున్నాయి. ఆక్రమిత టిబెట్‌ను అడ్డం పెట్టుకుని భయానకమైన కుట్రకు చైనా పథకం వేస్తోందన్న అనుమానాలకు ఆ దేశం చేపడుతున్న హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అభివృద్ధి ప్రణాళిక మాటున ప్రకృతికి తీవ్ర నష్టం కలిగేలా, సహజ సిద్ధమైన నదీ ప్రవాహాల గమనాన్ని దెబ్బతీసే ఆలోచనలు చేస్తోంది. టిబెట్‌ సమీపంలో చైనా నిర్మించ తలపెట్టిన డ్యామ్‌ల పరంపర ..

ఆసియాలోని అతి పెద్ద నదులపై తీవ్ర ప్రభావం పడుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. టిబెట్‌ నదులపై వరుసగా మెగా ప్రాజెక్ట్‌లను చేపట్టడం ద్వారా దక్షిణ, ఆగ్నేయ ఆసియా జల సంపద, జీవావరణంపై ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తోందని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి చైనా వ్యాప్తంగా 30 వేల డ్యామ్‌లు వున్నాయి. అంటే ప్రపంచ వ్యాప్తంగా మిగతా దేశాల్లో ఉన్న డ్యామ్‌లకంటే చైనాలోనే ఎక్కువగా వున్నాయి. చైనాలోని డ్యామ్‌ల వల్ల ఆ దేశానికి ఎంత లబ్ది చేకూరిందోగానీ ఆ డ్యామ్‌ల వల్ల కింది ప్రాంతాల్లో వున్న అనేక దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

ఈ విషయంపై కాస్త ఆలస్యంగానైనా మేలుకున్న ఆ దేశాలు .. ఇప్పుడు చైనా వ్యవహారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనా తీరుపై మండిపడుతున్నాయి. ఆ దేశం ఎడాపెడా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ల వల్ల తమ దేశాల్లో నదులు ఎడారులవుతున్నాయని ఆరోపిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యామ్‌ నిర్మించాలనే చైనా ఆలోచన అటు భారత్‌, ఇటు బంగ్లాదేశ్‌లపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం వుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. టిబెట్‌లోని చరిత్రాత్మక పెమా కోయ్‌ ప్రాంతంలో చైనా నిర్మించ తలపెట్టిన ఆ సూపర్‌ డ్యామ్‌ ..

ప్రపంచంలోనే అతి పెద్ద పవర్‌ స్టేషన్ త్రీ గోర్జెస్‌ డ్యామ్‌ కంటే పెద్దదని చెప్తున్నారు. నిజానికి 1990ల నుంచే మేకాంగ్ నది వెంబడి యున్నన్‌ ప్రావిన్స్‌లో చైనా అనేక డ్యామ్‌లు నిర్మించింది. 2021 ప్రారంభానికల్లా 50 శాతం మెకాంగ్‌ నది ప్రవాహానికి చైనా అడ్డుకట్ట వేయడంతో థాయిలాండ్‌, లావోస్‌, మయన్మార్‌ల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో చైనా చేపట్టిన, చేపట్టబోతున్న హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ల వల్ల మెకాంగ్‌ నదీ దిగువ ప్రాంతాలన్నీ ఎడారులుగా మారుతున్నాయని పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మపుత్రపై డ్యామ్‌ నిర్మిస్తే భారత్‌పైనే గాక భవిష్యత్తులో చైనా పొరుగున వున్న అనేక దేశాలపై కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా సాంకేతిక పరంగా, ఆర్థిక పరంగా బలహీనమైన దేశాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కుంటాయని, భయానక విపత్తులకు లోనవుతాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

డ్రాగన్ కంట్రీ చైనా తలపెట్టిన బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్‌ నిర్మాణం దయాది దేశాల మధ్య కొత్త వివాదాలకి కారణాలయ్యేలా ఉంది. టిబెట్‌ నుంచి భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నది దిగువన అరుణాచల్‌ ప్రదేశ్‌కు అతి సమీపంలో భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టుకు చైనా పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేసింది.

దీంతో భారత్, చైనా దేశాల మధ్య కొత్త వివాదాలకు బీజం పడనుందని పర్యావరణ వేత్తలే కాక విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. చైనా అభివృద్ధి పేరుతో మొత్తం 60 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలతో కూడిన 14వ పంచవర్ష ప్రణాళికకు చైనా పార్లమెంట్‌ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (సీపీసీ) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదే బ్రహ్మపుత్రపై ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు కమ్యూనిస్టు పార్టీ టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌ డిప్యూటీ చీఫ్‌ చె డల్హా ఇప్పటికే వెల్లడించారు. కాలుష్యం, తద్వారా భూతాపం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో 2060 నాటికి కర్బన్‌ ఉద్గారాలను కనిష్ట స్థాయికి తగ్గించుకోవాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఇందులో భాగంగానే టిబెట్‌లో హైడ్రో పవర్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది చైనా. కాగా, చైనా చర్యలను ఇండియా, బంగ్లాదేశ్ తోపాటు, టిబెట్‌ పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిని డోర్జీ పాగ్మో అనే దేవతగా టిబెట్‌ ప్రజలు ఆరాధిస్తారు. టిబెటన్‌ సంస్కృతి, సంప్రదాయాల్లో ఈ పవిత్ర నదికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర 2,900 కిలోమీటర్లు ప్రవహిస్తూ భారత్, బంగ్లాదేశ్‌లలో నీటి అవసరాలను తీరుస్తోంది. బ్రహ్మపుత్ర ఎగువ భాగంలో ఎన్నో ప్రాజెక్టుల్ని నిర్మించిన చైనా ఇప్పుడు దిగువ భాగంపై కూడా కన్నేసింది. అరుణాచల్‌కి సమీపంలో భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైంది. 60 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగే ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతాలకు నీటికి కొరత ఏర్పడుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అంతే కాకుండా వరదలు వంటివి సంభవించినప్పుడు గేట్లు ఎత్తేస్తే దిగువ ప్రాంతాలు కొట్టుకొని పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు భారత్‌కు చైనా ఎలాంటి సమాచారం అందించకపోవడం గమనార్హం.

పశ్చిమ టిబెట్‌లోని హిమానీనదాల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నది సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన నదిగా పేరుగాంచింది. టిబెటన్‌ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో బ్రహ్మపుత్రపై చైనా తలపెట్టిన ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్‌ డ్యామ్‌ కానుంది. దీని వల్ల భారత్ కు పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ ప్రాజెక్టు వల్ల మన భూభాగంలో ఆకస్మిక వరదలతో పాటు నీటి ఎద్దడి కూడా పెరుగుతుంది. ఈ నది టిబెట్, బంగ్లాదేశ్, భారతదేశంలో ప్రవహిస్తోంది. చైనా కడుతున్న భారీ ఆనకట్టల వల్ల అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం రాష్ట్రాల్లో భారీ వరదలు వచ్చే ప్రమాదం, కొన్నిసార్లు నీటికి కటకట ఏర్పడే ముప్పు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ డ్యామ్ నిర్మిస్తే, గతంలో కంటే ఎక్కువసార్లు, పెద్దఎత్తున వరదలు వచ్చే ప్రమాదముందని “నేచర్ కమ్యూనికేషన్స్” అనే పత్రిక ప్రచురించింది. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం అరుణాచలప్రదేశ్ లో బహుళ ప్రయోజన ప్రాజెక్టు నిర్మాణానికి యోచిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని సియాంగ్ జిల్లాలో 10వేల మెగావాట్ల సామర్ధ్యం కలిగిన జల విద్యుత్ కేంద్ర నిర్మాణ ప్రతిపాదన చేపట్టనుంది.

దీనివల్ల సరిపడా నీటిని నిల్వచేసుకోవడంతో పాటు, విద్యుత్ ఉత్పత్తికీ వీలవుతుంది. చైనా-భారత్ మధ్య సాగుతున్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్ కు రక్షణ కవచంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుంది. వీలైనంత త్వరగా ప్రారంభించి, పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. అయితే బ్రహ్మపుత్రపై చైనా చేపట్టే ఏ ప్రాజెక్టు అయినా అది భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపకూడదని గతంలోనే చైనాకు సూచించామని, దీనికి చైనా హామీ కూడా ఇచ్చిందని కేంద్రం చెబుతోంది. కానీ, ఆ హామీని ఎంతమేరకు నిలబెట్టుకుంటుందోన్నదే అనుమానాస్పదంగా మారింది.

చైనా కుట్రకు చెక్ చెప్పే వ్యూహంలో భారత్ సైతం అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.

Must Read

spot_img