Homeఅంతర్జాతీయంఅమెరికా బ్యాంకింగ్‌ రంగంలో మరో బ్యాంక్‌ మూసివేత.. 

అమెరికా బ్యాంకింగ్‌ రంగంలో మరో బ్యాంక్‌ మూసివేత.. 

అమెరికా బ్యాంకింగ్‌ రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. న్యూయార్క్‌ ఆధారిత సిగ్నేచర్ బ్యాంక్‌ ను మూసివేసినట్లు అమెరికా నియంత్రణ సంస్థలు ప్రకటించారు. దేశంలోనే అతిపెద్దదైన సిలికాన్‌ వాలీ బ్యాంకును మూసివేసిన రెండు రోజుల్లోనే ఈ ఘటన జరిగింది.. ఇది బ్యాంకింగ్‌ చరిత్రలోనే మూడవ అతిపెద్ద వైఫల్యంగా పేర్కొంటున్నారు విశ్లేషకులు.. అగ్రరాజ్యంలో మరో టెక్‌ ఫ్రెండ్లీ బ్యాంక్‌ మూతబడింది. ఆ బ్యాంక్‌ పేరు సిగ్నేచర్‌ బ్యాంక్‌.. న్యూయార్క్ కేంద్రంగా సేవలు అందిస్తోన్న సిగ్నేచర్ బ్యాంక్.. మొత్తం విలువలో మూడింట ఒక వంతును కోల్పోయింది..

అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ తుఫాను ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ తుఫాను దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి, సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ గాలివాన ప్రభావం ఇంకా తగ్గకముందే, అగ్రరాజ్యంలో మరో టెక్‌ ఫ్రెండ్లీ బ్యాంక్‌ మూతబడింది. ఆ బ్యాంక్‌ పేరు సిగ్నేచర్‌ బ్యాంక్‌. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో కుప్పకూలిన వాషింగ్టన్‌ మ్యూచువ్‌ తర్వాత అమెరికా చరిత్రలో ఇది రెండవ అతిపెద్దది. న్యూయార్క్‌ కేంద్రంగా పని చేస్తోంది సిగ్నేచర్ బ్యాంక్.. స్థిరాస్తి, డిజిటల్‌ అసెట్స్‌ బ్యాంకింగ్‌ సహా మొత్తం తొమ్మిది విభాగాల్లో ఈ బ్యాంకు సేవలు అందిస్తున్నా… మొత్తం డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో రంగం నుంచే వచ్చాయి.

గత బుధవారం సాయంత్రం నుంచి సిగ్నేచర్‌ బ్యాంక్‌ విలువ పతనమవుతూ వచ్చింది, మొత్తం విలువలో మూడింట ఒక వంతును కోల్పోయింది. దీంతో ఈ బ్యాంక్‌ ను మూసివేస్తున్నట్లు అక్కడి ఆర్థిక, బ్యాంకింగ్‌ నియంత్రణ సంస్థలు ప్రకటించాయి. బ్యాంక్‌ మరింత కుప్పకూలకుండా నియంత్రణ సంస్థలు తీసుకున్న చర్య ఇది. అయితే, తమ క్రిప్టో ఆధారిత డిపాజిట్లను త్వరలోనే 8 బిలియన్‌ డాలర్లకు కుదించుకుంటామని డిసెంబరులో బ్యాంకు ప్రకటించింది. సిగ్నేచర్ బ్యాంకును ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ తన నియంత్రణలోకి తీసుకున్నట్లు న్యూయార్క్‌ రాష్ట్ర ఆర్థిక సేవల విభాగం పేర్కొంది.

అమెరికాలో రెండు రోజుల వ్యవధిలో మూతబడిన రెండో బ్యాంక్‌ సిగ్నేచర్.. ఈ వార్త బయటకు వచ్చాక ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా ఆందోళనలోకి జారుకున్నాయి. మదుపర్లు విచ్చలవిడిగా అమ్మకాలకు దిగారు, ముఖ్యంగా బ్యాంక్‌ స్టాక్స్‌ను విపరీతంగా అమ్మడం మొదలు పెట్టారు. ప్రపంచ సంకేతాలు ప్రతికూలంగా మారడంతో భారత స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. నష్టాల్లోనే ప్రారంభం అయినా, ఆ తర్వాత క్రమంగా పడిపోతూ భారీ నష్టాల్లోకి మారాయి. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి BSE సెన్సెక్స్‌ 1.61% లేదా 950 పాయింట్ల నష్టంతో… 58,201 వద్ద ఉంది. NSE నిఫ్టీ50 1.57% లేదా 272 పాయింట్ల నష్టంతో 17,140 వద్ద ఉంది. ఇదే సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.27% లేదా 921 పాయింట్లు క్షీణించి 39,561 వద్ద ఉంది. బ్యాంక్‌ డిపాజిట్ల
ఇన్సూరెన్స్‌ కంపెనీ ‘ది ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌’ , సిగ్నేచర్‌ బ్యాంకును తన ఆధీనంలోకి తీసుకుంది.

2022 చివరి నాటికి సిగ్నేచర్‌ బ్యాంక్‌ వద్ద 110.36 బిలియన్‌ డాలర్ల ఆస్తులు, 88.59 బిలియన్‌ డాలర్ల విలువైన డిపాజిట్లు ఉన్నాయి. ఈ బ్యాంకు డిపాజిటర్లు ఆందోళన చెందవద్దని, నిధులు ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంటుందని FDIC ప్రకటించింది. ఇందుకోసం తాత్కాలికంగా ఓ ‘బ్రిడ్జ్‌ బ్యాంక్‌’ను ఏర్పాటు చేశామని వెల్లడించింది. దీని ద్వారా సిగ్నేచర్‌ కస్టమర్లు, డిపాజిటర్లు తమ ఫండ్స్‌ను యాక్సెస్‌ చేయవచ్చని తెలిపింది. SVB విషయంలో US ట్రెజరీ ఒక కీలక ప్రకటన చేసింది. SVB డిపాజిటర్లు మార్చి 13 నుంచి “వారి డబ్బు మొత్తాన్ని” యాక్సెస్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. SVB, సిగ్నేచర్‌ బ్యాంక్‌ ఉదంతం తర్వాత డిపాజిట్‌దార్లు అమెరికాలోని అన్ని బ్యాంక్‌ శాఖల ఎదుట క్యూ కట్టారు, డిపాజిట్లు వెనక్కు తీసుకోవడం మొదలు పెట్టారు. దీంతో, బ్యాంకులకు అవసరమైన డబ్బు అందుబాటులో ఉంచడానికి 25 మిలియన్‌ డాలర్లతో తాత్కాలిక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఫెడ్‌ ప్రకటించింది. రెండు వరుస రోజుల్లో రెండు బ్యాంక్‌లు పతనం కావడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. బ్యాంక్‌ల పతనానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. డిపాజిట్‌దార్లు ఆందోళన చెందవద్దని, వాళ్ల డబ్బు సురక్షితంగా ఉందని హామీ ఇచ్చారు.

మరోవైపు.. HSBC డిపాజిట్లు కోల్పోయి మూతబడిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కు చెందిన యూకే శాఖను కొనుగోలు చేసి అందరికీ షాకిచ్చింది… ఒక బ్రిటిష్‌ పౌండ్‌ విలువను ఇండియన్‌ కరెన్సీలోకి మారిస్తే 99.13 రూపాయలు వస్తుంది. 99 రూపాయలతో ఏమేం కొనొచ్చు అన్న ప్రశ్నను మీరు ఎవరినైనా అడిగితే, ఆ రేటులో వచ్చే రకరకాల వస్తువుల పేర్లు చెబుతారు. అదే ప్రశ్నను HSBCని అడిగితే, తాను ఒక బ్యాంక్‌నే కొంటా అంటుంది. చెప్పడమే కాదు, కేవలం 99 రూపాయలతో ఒక బ్యాంక్‌ను కొనేసింది కూడా. మల్టీ నేషనల్ బ్యాంక్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ అయిన HSBC, ప్రపంచమంతా షాక్‌ అయ్యే డీల్‌ కుదుర్చుకుంది. అమెరికాలో డిపాజిట్లు కోల్పోయి మూతబడిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌కు చెందిన UK అనుబంధ శాఖను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ అక్షరాల ఒక్క పౌండ్‌ మాత్రమే.

2023 మార్చి 10 నాటికి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూకే శాఖకు 5.5 బిలియన్ పౌండ్ల రుణాలు & 6.7 బిలియన్ పౌండ్ల డిపాజిట్లు ఉన్నాయి. SVB UK మాతృ సంస్థకు చెందిన ఆస్తులు & అప్పులను ఈ లావాదేవీ నుంచి మినహాయించారు. “యూకేలో బిజినెస్‌కు సంబంధించి ఈ డీల్‌ చాలా వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉందని… HSBC చీఫ్ ఎగ్జిక్యూటివ్ నోయెల్ క్విన్ తెలిపారు.. ఈ డీల్‌ వాణిజ్య బ్యాంకింగ్ ఫ్రాంచైజీని బలోపేతం చేస్తుందని చెప్పారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో వినూత్న ప్రయోగాలు చేస్తున్న & వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల అవసరాలను తీర్చడంలో కూడా సాయపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ UK కస్టమర్లను HSBC బ్యాంక్‌లోకి ఆహ్వానిస్తున్నామని, వారికి ఉత్తమ సేవలు అందిస్తామని చెప్పారు. ఖాతాదార్లు UKలో, ప్రపంచవ్యాప్తంగా ఎదగడానికి సహాయం చేయడానికి ఎదురుచూస్తున్నామని ” తెలిపారు.

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ సంక్షోభం తర్వాత ప్రపంచ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఒక్కసారిగా భయాందోళనలు ఎగసిపడ్డాయి. డిపాజిట్ల కోసం, ముఖ్యంగా సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌లో దాచిన డిపాజిట్లను వెనక్కు తీసుకోవడానికి ఖాతాదార్లు క్యూ కట్టారు. దీంతో, ఆ బ్యాంక్‌ కుప్పకూలింది. యూకేను కూడా ఆ ప్రకంపనలు తాకాయి. అక్కడి డిపాజిట్‌దార్ల ప్రయోజనాలను కాపాడడానికి యూకే గవర్నమెంట్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ రంగంలోకి దిగాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూకే సబ్సిడియరీ విక్రయానికి అనుమతి ఇచ్చాయి. ఇప్పుడు, యూకే శాఖ HSBC చేతుల్లోకి వెళ్లడంతో బ్రిటిష్‌ డిపాజిట్లకు భరోసా వచ్చినట్లయింది. SVBకి చెందిన UK కస్టమర్లు మునుపటిలాగే సాధారణ బ్యాంకింగ్‌ను ఆస్వాదించవచ్చు. వారి డిపాజిట్లు ఇకపై HSBC బలం, భద్రత నడుమ సురక్షితంగా ఉంటాయి. SVB UK సహోద్యోగులను కూడా మేం స్వాగతిస్తున్నాం. వారితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం అని కూడా HSBC చీఫ్ ఎగ్జిక్యూటివ్ నోయెల్ క్విన్ వెల్లడించారు..

2008 ఆర్థిక సంక్షోభ సమయంలో కుప్పకూలిన వాషింగ్టన్‌ మ్యూచువ్‌ తర్వాత అమెరికా చరిత్రలో ఇది రెండవ అతిపెద్ద బ్యాంక్ సంక్షోభం..సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ సంక్షోభం తర్వాత ప్రపంచ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఒక్కసారిగా భయాందోళనలు ఎగసిపడ్డాయి. దీని ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి, సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి

Must Read

spot_img