Homeఆంధ్ర ప్రదేశ్మాజీ ఎంపీ ఉండవల్లి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయా..?

మాజీ ఎంపీ ఉండవల్లి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయా..?

ఏపీలో రాజకీయ పరిస్థితులు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పడం, ఇటీవల చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కావడంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ -జనసేన కలిసే పోటీ చేస్తాయి అన్న టాక్ మొదలైంది. ఈ క్రమంలో టీడీపీ -జనసేన కు మధ్య సీట్ల పంపిణీ కి సంబందించి కూడా అనేక ఊహగానాలు వస్తున్నాయి. 2019 ఎన్నికల నాటి కంటే జనసేన బలపడి నందున 40 నుండి 45 స్థానాలు అడుగుతున్నదని, అయితే 25 నుండి 30 స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని, ఈ మేరకు ఆయా పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఏపీలో ఏ ఇద్దరు ముగ్గురు రాజకీయాలపై మాట్లాడుకుంటున్నా జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా..? సీట్ల పంపిణీ ఎలా ఉంటుంది.. ?

ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది…? బీజేపీ ఏ స్టాండ్ తీసుకుంటుంది.. ? అనే అంశాలపైనే చర్చించుకుంటున్నారు. అయితే జనసేన -టీడీపీ పొత్తులకు సంబందించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. ఒక విధంగా ఆ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టించినట్లుగా, జనసేనలో జోష్ నింపుతున్నట్లుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చాలా తెలివైన వ్యక్తి అని, తనని సీఎం అభ్యర్థి గా ప్రకటించకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని తాను అనుకోవడం లేదని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.

ఈ కీలక ప్రతిపాదనకు టీడీపీ అంగీకరించక పొతే పవన్ కళ్యాణ్ కు పెద్దగా జరిగే నష్టం అయితే లేదు కానీ, టీడీపీకి మాత్రం మరో సారి భారీ నష్టం జరుగుతుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఈసారి టీడీపీ అధికారంలోకి రాకపోతే జగన్ ఆ పార్టీని భూస్థాపితం చేస్తారని అన్నారు. ఈ పరిస్థితుల్లోచంద్రబాబే ఒక అడుగు వెనక్కు వేయక తప్పదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అయితే తన కుటుంబాన్ని అవమాన పర్చే రీతిలో అధికార వైసీపీ సభ్యులు సభలో మాట్లాడారని ఆరోపిస్తూ.. చంద్రబాబు గత ఏడాది మళ్ళీ ముఖ్య మంత్రిగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానని, లేకుంటే అసెంబ్లీకే రాను అంటూ శపధం చేసి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నట్లు పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్ధిత్వాన్ని డిమాండ్ చేస్తే చంద్రబాబు రాజకీయ భవితవ్యం ఏమిటీ.. ఆయన చేసిన శపథం పక్కన పెడతారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.పొత్తులకు సంబంధించి ఇప్పటి వరకూ చర్చలు జరగలేదని, ఇదీ సమయం కూడా కాదని ఆయా పార్టీల నేతలు అంటున్నప్పటికీ రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. జనసేన, టీడీపీ కలిసే పోటీ చేస్తాయని, ముసుగు తొలగించారని వైసీపీ విమర్శిస్తూనే ఉంది.

ఈ పరిణామాలు చూస్తుంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అనే వాళ్లు ఉన్నారు. మహారాష్ట్రలో శివసేన చీలికవర్గం నేత ఏక్ నాథ్ శిండే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించగా, ఇష్టం లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ పార్టీ అధిష్టానం అదేశాలతో ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. ఇంతకు ముందు బీహార్ 78 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. కేవలం 45 స్థానాలు గెలుచుకున్న నితీష్ కుమార్ కు సీఎం పదవిని కట్టబెట్టింది. ఆ తర్వాత నితీష్ కుమార్.. ఎన్ డీ ఏ నుండి వైతొలగి ఆర్ జేడీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీని రాష్ట్రంలో బతికించుకోవడం క్రోసం చంద్రబాబు ఆ త్యాగానికి సిద్దమవుతారా అనేది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఒక వేళ చంద్రబాబు అటువంటి కీలక నిర్ణయం తీసుకుంటే తెలుగు తమ్ముళ్లు స్వాగతిస్తారా, ఆ పార్టీ నేతలు ఒప్పుకుంటారా అనేది కూడా వేచి చూడాలి. కాగా ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన కామెంట్స్ మాత్రం టీడీపీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. మరో పక్క ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి వచ్చినా వైసీపీ, జగన్ అధికారాన్ని అడ్డుకోలేరని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ షాక్ ఇచ్చారన్న టాక్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే పార్టీ భవిష్యత్తు ఏమిటనే విషయాన్ని మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ భవిష్యత్తుపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తోంది. ఇంతకీ ఉండవల్లి చెప్పిందేమంటే టీడీపీ గనుక వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే రెండోసారి కూడా ఘోర ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు దేనికదే పోటీ చేస్తే జగన్ గెలుపును ఎవరూ ఆపలేరని కూడా అన్నారు. జగన్‌ను ఓడించాలని
చంద్రబాబుకు బలంగా ఉంటే జనసేనతో పొత్తు పెట్టుకోవటం తప్ప వేరేదారి లేదని తేల్చేశారు.

పొత్తు పెట్టుకోవాలంటే సీట్ల షేరింగ్ కాదని పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే జనసేన పొత్తుకు ముందుకొస్తుందని అన్నారు. చంద్రబాబు-పవన్ భేటీలో తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే పొత్తుకు రెడీ అని పవన్ స్పష్టంగా చెప్పినట్లు ఉండవల్లి చెప్పారు. పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించటం మినహా చంద్రబాబుకు వేరే దారి కూడా లేదని మాజీ ఎంపీ అభిప్రాయపడ్డారు. ఉండవల్లి జోస్యానికి, హెచ్చరికలకు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య రాసిన ఓపెన్ లెటర్ బలమిస్తోంది. పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే టీడీపీ, జనసేన పొత్తుకు కాపు సంక్షేమ సేన మద్దతిస్తుందని జోగయ్య కండీషన్ పెట్టారు. నిజానికి ఇదే ఆలోచన చాలామంది కాపుల్లో నడుస్తోంది.

ఏపీలో ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తుతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఇదే సమయంలో ఫలితాలపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీతో కాపు ఓటింగ్ చీలికపై కొత్త చర్చ మొదలైంది. ఏపీలో కాపు సీఎం నినాదంతో త్వరలో సీఎం కేసీఆర్ పర్యటనకు రానున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన కాపు నేతలు కొందరు బీఆర్ఎస్ లో చేరారు. టీడీపీ, జనసేన పొత్తుపై ప్రభావం చూపేలా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.ఇప్పుడు ఈ మొత్తం సమీకరణాలపై మాజీ ఎంపీ ఉండవల్లి కీలక విశ్లేషణ చేసారు.

కాపు ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందనే అంశంపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.ఏపీలో సీఎం జగన్ చెబుతున్నట్లు క్లాస్ వార్ కాదని..క్యాస్ట్ వార్ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. కాపులు సంఖ్య పరంగా అధికారం డిసైడ్ చేసే స్థానంలో ఉన్నా.. ఆర్దికంగా..రాజకీయంగా ప్రయోజనాలు పొందని లార్జెస్ట్ కమ్యూనిటీగా మిగిలిపోయిందని విశ్లేషించారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న కాపులంతా ఆ పార్టీలకే ఓటు వేస్తారని చెప్పలేమని ఉండవల్లి పేర్కొన్నారు. కాపులకు పట్టుదల ఎక్కువగా ఉంటుందని.. 2014 ఎన్నికల్లో టీడీపీకి వేసిన కాపు మెజార్టీ ఓటర్లు 2019లో పవన్ కు మద్దతు ఇవ్వలేదని అన్నారు.

2019 ఎన్నికల్లో కాపులు మెజార్టీ ఓటింగ్ జగన్ కు అనుకూలంగా పోల్ అయిందని విశ్లేషించారు. కాపు ఓటింగ్ ఎవరికి పడితే వారికి అధికారందక్కించుకోవటానికి అవకాశం ఉంటుందన్నారు. ఏ రంగంలో చూసినా కమ్మ – రెడ్డి వర్గాలు పోటీ పడుతున్నాయని.. కాపులు వెనుకబడి ఉన్నారని చెప్పుకొచ్చారు. కాపులు ఎవరికి వేసినా మెజార్టీ ఓటింగ్ అటే ఉంటుందని వివరించారు. గోదావరి జిల్లాల్లో కాపు ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా పేర్కొన్నారు. పవన్ అప్పుడు వేయలేదని..ఇప్పుడు వేస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో హోరా హోరీ పోరు తప్పదని ఉండవల్లి అంచనా వేసారు. ఇప్పటికే వైసీపీ, టీడీపీలు అధికారంపై ధీమాతో ఉన్నాయి.

తాజాగా ఉండవల్లి వ్యాఖ్యలు .. అటు టీడీపీలో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పటివరకు సీట్ల షేరింగ్ జరుగుతోందన్న వాదనకు ఉండవల్లి వ్యాఖ్యతో ఇక పవర్ షేరింగే కీలకం కానుందని టాక్ వినిపిస్తోంది.

Must Read

spot_img