మేము ఏది చేసినా ఊరి కోసమే చేస్తాం.. ఊరి కోసం ఏమైనా చేస్తాం.. ఇదీ అక్కడ లీడర్లు నిత్యం చెప్పే మాటలు. కానీ పట్టుమని ఆ ఊరిని ఒక్క రోజు కూడా ప్రశాంతంగా ఉంచిందే లేదు. నిత్యం తమ ఆధిపత్యం కోసం ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా వారు చేసే పనుల వల్ల ఆ నియోజకవర్గంలో ప్రశాంతత అన్నది దూరమైంది. కోల్పోయిన అధికారం కోసం ఒకరు.. వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు మరొకరు చేసే యుద్ధం.. అక్కడ ప్రశాంతతకు భంగం కల్గిస్తోంది. పోలీసులు సైతం వీరి చేతుల్లో పావులుగా మారి కలహాలకు కారణమవుతున్నారు..
ఆధిపత్యం కోసం అప్పుడప్పుడు రాజకీయాలు చేయడం.. రాయలసీమలో సహజంగా కనిపిస్తుంది. కానీ తాడిపత్రి నియోజకవర్గంలో ఇది ప్రతి రోజుకనిపిస్తుంది. వారు ఏం చేసినా తాడిపత్రిని తమ చేతుల్లోకి తీసుకునేందుకు చేస్తారు. ఏం మాట్లాడినా.. మా పంతం నెగ్గాలనే ఉంటుంది. అదే ఇప్పుడు ఆ ఇద్దరు నేతలను విమర్శలపాలు చేస్తోంది.ఇంతకీ ఎవరా నేతలు అంటే.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. వీరిద్దరి మధ్య పోరు ఈ నాటిది కాదు.. దాదాపు నాలుగు దశాబ్ధాల క్రితం నుంచే జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య వైరం సాగుతోంది.
అయితే ఇప్పటి నుంచి మొన్నటి వరకు ఈ పోరులో జేసీ బ్రదర్స్ గెలుస్తూనే ఉన్నారు. తాడిపత్రి కేంద్రంగా తమ సత్తాను చాటుతూ వారే రాజులన్న విధంగా మార్చేసుకున్నారు. కానీ తొలిసారి వీరికి ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా తమ చిరకాల ప్రత్యర్థి అయిన పెద్దారెడ్డి నుంచి ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ కుమారులిద్దరూ ఓటమి పాలు కావడం.. ఇక్కడ పెద్దారెడ్డి గెలవడంతో జేసీ బ్రదర్స్ కి గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. ఇక అప్పటినుంచి మొదలైంది.. అసలైన వార్. గతంలో వీరి మధ్య చాలా ఘర్షణలు జరిగినా..
అప్పుడప్పుడు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఇది నిత్యకృత్యంగా మారింది. పోయిన చోటనే వెతుక్కోవాలి అన్నట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి తన వార్ ని స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయనకు అనేక ఇబ్బందులు ఎదురయ్యారు. గతంలో కొన్న వాహనాలకు సంబంధించిన మిగిలిన అంశాల్లో ఆయన జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అలా జైలుకు వెళ్లి వచ్చిన తరువాత కూడా జేసీ ఎక్కడా తగ్గలేదు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేస్తున్న పనులన్నిటికీ ఆయన అడ్డు చెప్పడం మొదలు పెట్టారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలతో నిత్యం రాజకీయ వేడి కనిపించింది.
చివరకు కొందరు చేసిన విమర్శలు తట్టుకోలేక ఆగ్రహంతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. రాష్ట్రంలో అన్ని చోట్లా.. వైసీపీ గెలిస్తే.. తాడిపత్రిలో మాత్రం టీడీపీ గెలిచింది. ఇది తనపై ప్రజలకున్న అభిమానం అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ స్థానంలో కూర్చున్నారు. అప్పటి వరకు వార్ వన్ సైడ్ ఉండేది. కానీ అధికారం రావడంతో ఇప్పుడు జేసీకి ఆయుధం ఇచ్చినట్టైంది.
ఇక మున్సిపాల్టీ జరిగే ప్రతి పని విషయంలో రచ్చ మొదలైంది. ఈక్రమంలో పోలీస్ స్టేషన్ నిర్మాణం, మున్సిపల్ వాహనాల మరమ్మతులు ఇలా ఒకటేంటి ఏం చేసినా రచ్చే అవుతోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఎంత రైట్ ఉందో మున్సిపాల్టీ తనకూ అంతే రైట్ ఉందంటూ జేసీ తాడిపత్రిని తన చేతుల్లోకి తీసుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రోజుల తరబడి ఇక్కడ హైటెన్షన్ వాతావరణం ఉంటోంది. ఈ ఇద్దరు నేతల విషయంలో మున్సిపల్ అధికారులునలిగిపోతూనే ఉన్నారు.
మరోవైపు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో టార్గెట్ అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సుమారు ఆరు నెలల నుంచి డీఎస్పీ చైతన్యపై జేసీ వార్ ప్రకటించారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి కంటే ఆయన్నే ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాడిపత్రిలో ఏ చిన్నపాటి సంఘటన జరిగినా.. ఇందులో తన అనుచరులను ఇబ్బందులు పెడుతున్నారని జేసీ కోప్పడుతున్నారు. పైపెచ్చు.. జేసీ ఎలాంటి నిరసన కార్యక్రమం చేపట్టినా ఆయన్ని ఇంటి నుంచి కదలనివ్వడం లేదు.
దీంతో ఆయన మరింత ఆగ్రహంగా ఊగిపోయారు. ఎమ్మెల్యే ఏది చెబితే అది చేస్తున్నారని.. మమ్మల్ని కదలినవ్వడం లేదని జేసీ చేయని విమర్శ లేదు. ఒకానొక సందర్భంగా బూతులు కూడా తిట్టిన సందర్భాలు లేకపోలేదు. అంతటితో ఆగకుండా డీఎస్పీపై గతంలో ఎస్సీకి, ఇతర అధికారులకు ఫిర్యాదులు చేశారు. కానీ వాటిపై స్పందన లేకపోవడంతో కోర్టుల ద్వారా ప్రైవేట్ కేసులు వేయడం ప్రారంభించారు. అంత చేసినా ఆయన సాటిస్ ఫై కాలేదో లేక డీఎస్పీ వెనక్కు తగ్గలేదో కానీ.. జేసీ మరింత ఆగ్రహంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఒకానొక దశలో జేసీ ఇక ఇంత గలీజ్ గా ఉన్న డీఎస్పీ గురించి ఇక నేనుమాట్లడనని చెప్పేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులపై జేసీ అనుచరులు దాడులు చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. అదే సమయంలో తాజాగా జేసీ మనుషులు ఉండగా వారిపై డీఎస్పీ దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.ఇక జేసీ ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు డీఎస్పీపై పరుష పదజాలంతో దూషిస్తూ వచ్చారు. తాజాగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాదయాత్ర ప్రారంభించారు.
పెద్దవడుగూరు మండలంలో ఆయన పాదయాత్రచేస్తుండగా..పెద్దారెడ్డిపై ఆరోపణలు చేస్తూ కొన్ని కరపత్రాలు వచ్చాయి. దీంతో ఇక పెద్దారెడ్డి కూడా జేసీపై అదే రేంజ్ లోనే రియాక్ట్ అయ్యారు. నేను పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేక గ్రామాలలో ఫ్యాక్షన్ గొడవలు పెట్టడానికి ఇలా పాంప్లెట్లు పంచుతున్నాడని… నీకు దమ్ము ధైర్యం ఉంటే 30 సంవత్సరాల లో ఏమి చేశాడో నేను మూడు సంవత్సరాలు ఏమి చేసానో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.నాకు అధికారం ఉన్నా లేకున్నా జెసి బ్రదర్స్ ని చెప్పుతో కొడతానంటూ వ్యాఖ్యలు చేశారు.
నేను తలుచుకుంటే జేసీ బ్రదర్స్ ను వారి నాయకులు, కార్యకర్తలు ఎవరు కాపడలేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జెసి కుటుంబం వారు మా అన్నను చంపడానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఆశ చూపారని పెద్దారెడ్డి అన్నారు. వాళ్ళింటికి వెళ్లినోన్ని.. బెడ్ రూమ్ లోకి వెళ్లి కూడా కొడుతానంటూ ఛాలంజ్ చేశారు. అంతే కాకుండా పోలీసులపై ఇంత నీచంగా మాట్లాడుతుంటే పోలీస్ సంఘాలు ఏం చేస్తున్నాయని కేతిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఆ యూనియన్లకు జెసి ప్రభాకర్ రెడ్డే అధ్యక్షుడా అంటున్నారు. పోలీసులకు జెసి బ్రదర్స్ అంటే భయం ఉంటే తాడిపత్రిని జమ్ము కాశ్మీర్మా దరిగా స్పెషల్ జోన్ గా ప్రకటించి ప్రత్యేక అధికారులను నియమించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా సాగుతుండగానే, జేసీ అనుచరుడిపై ఒక అటాక్ జరిగింది. దీంతో డీఎస్పీని,ఎమ్మెల్యేని కార్నర్ చేయడానికి ఒక అవకాశం దొరికినట్టైంది. జేసీ ప్రధాన అనుచరుడు గండికోట కార్తీక్ పై ఆదివారం రాత్రి అటాక్ జరిగింది. కొందరు వ్యక్తులు కత్తులతో వెంటాడి దాడి చేశారు. అయితే ఇది వైసీపీ నేతలే చేశారని బాధితుడు చెప్పుకొచ్చాడు. బాధితున్ని అనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పరామర్శించిన జేసీ ప్రభాకర్ రెడ్డి అసలు మేము పోలీసులకు కంప్లైంటే ఇవ్వమని తేల్చేశారు. అసలు పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదంటూ కామెంట్ చేశారు.
ఎమ్మెల్యేకి తొత్తుగా పని చేస్తున్న డీఎస్పీపై కంప్లైంట్ ఇస్తే ఏం చేశారని జిల్లా ఎస్పీ ని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ ప్తె నమ్మకం పోయిందని.. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని వార్నింగ్ లు ఇచ్చారు. మా అనుచరులప్తె దాడులు చేస్తున్న ఎలాంటి చర్యలు లేవని.. ఈ దాడి ఘటనలప్తె సుమోటోగా కేసు నమోదు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేను పంచె ఊడగొట్టే రోజులు దగ్గర పడ్డాయంటూ కామెంట్ చేశారు. ఇలా ఈ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుతో తాడిపత్రిలో నిత్యం ఏదో ఒక గొడవ ఉంటోంది. ఇటు అధికారులకు, పోలీసులకు కత్తి మీద సవాల్ గామారిపోయింది. ఇద్దరు నేతలు ఏం చేసినా తాడిపత్రి ప్రజల కోసమే అంటారు కానీ.. ఇక్కడ ప్రశాంతత దెబ్బతింటున్న విషయం గురించి మాత్రం మాట్లాడరు. దీంతో వీరిద్దరి మధ్య ప్రజలు నలిగిపోతున్నారు.