Home Politics కన్నడ నాట ఎన్నికల వేళ ఓ ఆసక్తికర చర్చ..

కన్నడ నాట ఎన్నికల వేళ ఓ ఆసక్తికర చర్చ..

గతం కన్నా భిన్నంగా ఈ దఫా ఎన్నికల పోరు సాగనుందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ..
తాజా పరిణామాలేనని తెలుస్తోంది. దీంతో అసలు కన్నడ ఎన్నికల నగారా మ్రోగిన వేళ ఏం జరుగుతోందోనన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ రాష్ట్ర ఎన్నికల్లో చారిత్రాత్మక అంశాలు ప్రచారాస్త్రాలు అవుతున్నాయా.. ?

కన్నడ ఎన్నికల ప్రచారంలో టిప్పు సుల్తాన్ .. వంటి పాలకుల పేర్లు ఎందుకు తెరపైకి వస్తున్నాయి.. దీంతో కర్ణాటక ఎన్నికల్లో హిందూ, ముస్లిం అంశాలే ప్రధానాంశాలు అవుతున్నాయా..? దేశ భక్తికి, మతానికి సంబంధం దిశగా అడుగులు పడుతున్నాయా..? అందుకే అమిత్ షా సైతం అదే వ్యూహంలో కర్నాటక ప్రచారంలో పావులు కదుపుతున్నారా..?

దక్షిణ భారతావనిలో, ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో హిందూ –ముస్లిం సంబంధాలను సూక్ష్మంగా పరిశీలించిన మానవ శాస్త్రజ్ఞుడు జస్కియె అస్సయాగ్. ఈ ఫ్రెంచ్ విద్వజ్ఞుడు భారతీయ అధ్యయనాలకు సుప్రసిద్ధుడు. రెండు దశాబ్దాల క్రితం ప్రచురితమైన ఆయన ఉద్గ్రంథం ఎట్ ది కాన్‌ఫ్లుయన్స్ ఆఫ్ టు రివర్స్ : ముస్లిమ్స్ అండ్ హిందూస్ ఇన్ సౌత్ఇండియా నేరుగా వర్తమానంతో సంభాషిస్తోంది. వలసపాలనా యుగానికి పూర్వం హిందూ, ముస్లిం సంస్కృతులు సంపూర్ణంగా సమ్మిళితమై ఒక విలక్షణ ఉమ్మడి సంస్కృతి ప్రభవించి విలసిల్లిందని, ఉభయ మతాల ప్రజలు శాంతి సామరస్యాలతో సహజీవనం చేశారన్న అభిప్రాయంతో అస్సయాగ్ విభేదించారు. అయితే హిందువులు, ముస్లింలు పెద్దగా ఘర్షణ పడకుండా కలిసిమెలిసి నివసించారనేందుకు చరిత్రలో గట్టి రుజువులు ఉన్నాయని ఆయన అంగీకరిస్తున్నారు. నిత్య జీవితంలో ఇరు వర్గాల మధ్య కలహాలు కాకుండా సహజీవనమే కనిపిస్తుందని ఆ ఫ్రెంచ్ పండితుడు స్పష్టంగా చెప్పారు.

ఉభయ మతస్థుల ఆర్థిక జీవనం పరస్పరాధారితమై ఉండేది. ఆవాస ప్రాంతాలు వేర్వేరుగా ఉండేవి. వైవాహిక సంబంధాలు ఉండేవి కావు. స్నేహ సంబంధాలు సైతం అరుదే. అయినప్పటికీ వీధిలోను, మార్కెట్‌లోను, అప్పుడప్పుడూ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలలోనూ రోజూ ఒకరినొకరు కలుసుకోవడం, సుహృద్భావ పూర్వకంగా సహాయ సహకారాలు అందించుకోవడాన్ని హిందువులు, ముస్లింలు శతాబ్దాలుగా పాటించారని అస్సయాగ్ అన్నారు. ఉత్తర కర్ణాటకలో హిందువులు, ముస్లింలు నిత్యం నిష్ఠగా సందర్శించే ఆరాధనా మందిరాల గురించి అస్సయాగ్ వివరంగా రాశారు. ఒక దర్గా గురించి కూడా ఉంది. ఒక రహదారి
పక్కన ఉన్న ఆ దర్గాను ముస్లింలే కాకుండా హిందువులూ నిత్యం సందర్శిస్తూ పీర్‌కు నివాళులర్పిస్తుంటారని ఆయన పేర్కొన్నారు.

ఆ పుణ్య పురుషుని ఆశీస్సులు కోరకుండా హిందువులు సైతం ఎటువంటి కొత్త పనులకు పూనుకోరని ఆయన తెలిపారు.

12వ శతాబ్దికి చెందిన మహాసంస్కర్త బసవణ్ణసంస్మృతిలో ఏటా జరిగే ఒక ఉత్సవం గురించి అస్సయాగ్ రాశారు. వ్యవసాయ జీవన రంగంలో బృహత్తర ప్రాధాన్యమున్న గేదెలను పూజించే వేడుక అది. గేదెలు బసవణ్ణ అవతారాలని ఆయన అనుయాయులు విశ్వసిస్తారు. హిందువులే కాదు, ముస్లింలు సైతం ఆ ఉత్సవం సందర్భంగా గేదెలను ఆ మహాపురుషుని అవతారాలుగా భావించి,దనుగుణంగా వాటిని గౌరవిస్తారని అస్సయాగ్ వివరించారు. ఉత్తర కర్ణాటకలోని మత సమ్మేళన సంస్కృతికి ఉత్కృష్ట ఉదాహరణగా రాజబాగ్ సావర్ అనే జానపదకథానాయకుడు గురించి ఆయన రాశారు. రాజబాగ్‌ను హిందువులు తమ గురువుగాను, ముస్లింలు ఒక పుణ్యాత్ముడుగాను గౌరవిస్తారు. కర్ణాటక శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అస్సయాగ్ పుస్తకాన్ని చదివాను.

పాలక పక్షం అయిన భారతీయ జనతా పార్టీ తన ప్రచారంలో ఉద్దేశపూర్వకంగా హిందూస్ వెర్సెస్ముస్లిమ్స్ అన్న అంశానికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. ఈ ఎన్నికల ప్రచారాన్ని అలా నిర్వహించాలని నిజానికి ఏడాది క్రితమే నిర్ణయం తీసుకున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. కనుకనే హిజాబ్ ధారణ, హలాల్ మాంసం విక్రయాలు, హిందూ –ముస్లింల మధ్య మతాంతర వివాహాలపై వివాదాలు చెలరేగాయి. అవి రగిల్చిన మంటలు ఇంకా ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. సంఘ్ పరివార్ అగ్ర నాయకుల నుంచి సామాన్య ప్రచారక్ వరకు ఈ వివాదాలకు తమవంతు ఆజ్యం పోస్తూనే ఉన్నారు. కర్ణాటకలోని హిందువులు తమ సహపౌరులు ముస్లింల విషయమై భయపడేలా చేయడమే బీజేపీ ఎన్నికల ప్రచార లక్ష్యంగా ఉంది.

ముస్లింలను హిందువులు తీవ్రంగా శంకించేలా పాలకపక్ష ప్రచారం సాగిపోతోంది. కాంగ్రెస్, జనతాదళ్(ఎస్) శాసనసభ్యులను ఫిరాయింపులకు ప్రోత్సహించడం ద్వారా బీజేపీ 2019 జూలైలో కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. దరిమిలా మూడున్నర సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వ పాలన ప్రజాహితానికి తోడ్పడడంలో పూర్తిగా విఫలమయింది. ఏ ఒక్క రంగంలోనూ ఆ ప్రభుత్వ పాలన కించిత్ ప్రభావాన్ని కూడా చూపలేకపోయింది. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలనా దక్షత పూర్తిగా గతించిన విషయమైపోయింది. తన అధ్వాన్న పాలనను కప్పిపుచ్చుకోవడానికే హిందు వర్సెస్ ముస్లిమ్ అంశాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా పాలకపక్షం చేసుకున్నదని కొంత మంది వాదిస్తున్నారు. ఇందులో నిజమున్నప్పటికీ ఆ తరహా ప్రచారం సంఘ్ పరివార్ భావజాలంతో ముడివడివున్నదనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. కర్ణాటక రాజకీయాలను సుదీర్ఘకాలంగా పరిశీలిస్తూ వచ్చిన ప్రొఫెసర్ జేమ్స్ మేనర్ ఒక ఆన్‌లైన్ పత్రికలో సమాజంలో మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ఎడతెగని ప్రయత్నం చేస్తూ ఉంది.చాలా నెలలుగా ఒక పద్ధతి ప్రకారం, శక్తిమంతంగా ఆ ప్రచారాన్ని సాగిస్తోంది.

మత వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు జరుగుతున్న ఇటువంటి ప్రచారం మరే రాష్ట్రంలోనూ ఎవరూ చూసి ఉండరనడంలో సందేహం లేదు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కర్ణాటక రాజకీయాలలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు. వివిధ పదవులలో ఆయన ద్వారా నియమితులు అయినవారే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కీలకంగా ఉన్నారు. అంతా ఆయన నిర్దేశకత్వంలో జరుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. గత ఏడాది తుదినాళ్లలో కర్ణాటకలో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని అమిత్ షా స్వయంగా ప్రారంభించారు.

మాండ్యాలో జరిగిన ఒక సభలో టిప్పు సుల్తాన్‌ను ఘనంగా ప్రస్తుతిస్తున్న వారు కావాలా లేక దేశ భక్తులతో ఉన్నవారు కావాలా అని ఓటర్లను ఆయన ప్రశ్నించారు. ఇక్కడ టిప్పు సుల్తాన్‌ను ప్రస్తుతిస్తున్నవారు అంటే ముస్లింలకు సంకేత నామమని మరి చెప్పనవసరం లేదు. ఆ తరువాత కొద్ది రోజులకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కటీల్ ఒక సభలో మాట్లాడుతూ మురుగునీటి సదుపాయాలు, మౌలిక వసతుల లేమి లాంటి అప్రధాన సమస్యలను ఉపేక్షించి లవ్ జిహాద్ గురించి పట్టించుకోవాలని పార్టీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కటీల్ మహాశయుడే కొద్దిరోజుల క్రితం టిప్పు సుల్తాన్ అనుయాయులు ఈ గడ్డపై ఉండడానికి వీలులేదని, రాముడిని పూజించేవారు మాత్రమే ఉండాలని అన్నాడు. యుద్ధ వీరుడుగా, పరిపాలకుడుగా టిప్పు సుల్తాన్ వివాదగ్రస్తుడు. హిందూ దేవాలయాలకు విశేష దాన ధర్మాలు చేసిన టిప్పు సుల్తాన్ తన ఇస్లామిక్ మత విశ్వాసాలకు పరిపూర్ణంగా కట్టుబడి ఉన్న ముస్లిం పాలకుడు. హిందూత్వ చరిత్రకారులు ఆరోపిస్తున్నట్టుగా ఈ 18వ శతాబ్ది పాలకుడు వాస్తవంగా భయానక నేరాలకు పాల్పడినవాడే అయినప్పటికీ, ఆ కారణంగా చట్టాన్ని శిరసావహించే 21వ శతాబ్ది ధర్మవర్తనులైన ముస్లింలను శిక్షించడం ఎందుకు? శతాబ్దాలనాడు ఎవరో పాల్పడిన దుష్కృత్యాలకు నేడు అమాయకులైన పౌరులను తీవ్ర ఇక్కట్లపాలు చేయడం నాగరిక ప్రవర్తనకు పూర్తిగా విరుద్ధం. అయితే సభ్యతా మర్యాదలు అనేవి హిందూ మితవాదులతో ముడివడివున్న సుగుణాలు కావు కదా. హిందువులు, ముస్లింల మధ్య మత విద్వేషంతో యుద్ధాలు జరిగాయనడం చరిత్రను వక్రీకరించడమే అని అస్సయాగ్ తన పుస్తకం ఆంగ్లానువాదానికి రాసిన మున్నుడిలోపేర్కొన్నారు. తన పరిశోధనలు ఈ వాస్తవాన్ని ధ్రువీకరించాయని ఆయన అన్నారు.
కర్నాటక చరిత్రలో కీలకాధ్యాయమైన టిప్పు సుల్తాన్ .. ఇప్పుడు రాజకీయాస్త్రంగా మారింది. దీనిలో భాగంగానే బీజేపీ శ్రేణులు చేస్తోన్న ప్రచారం మరింత కాక రేపనుందనిఅంచనాలు వెల్లువెత్తుతున్నాయి.