Homeఅంతర్జాతీయంచైనా దుందుడుకు తనానికి .. నెహ్రూ కారణమన్న అమిత్ షా ...

చైనా దుందుడుకు తనానికి .. నెహ్రూ కారణమన్న అమిత్ షా …

తవాంగ్ ఘటనపై చర్చ వేళ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. భారత్ కు ఐరాసలో శాశ్వత సభ్యత్వం ఉంటే, ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న ఆయన .. దీనికి తొలి ప్రధాని నెహ్రూనే కారణమని వ్యాఖ్యానించారు. దీంతో ఈ అంశంలో నెహ్రూ పాత్ర ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.

చైనా దుందుడుకు తనానికి .. భారత తొలి ప్రధాని నెహ్రూ కారణమన్న అమిత్ షా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అసలు ఈ వ్యాఖ్యల వెనుక షా చెబుతున్నదేమిటి..? దీనికి, నెహ్రూకు సంబంధం ఏమిటన్నదే ఆసక్తికరంగా మారాయి.

అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్సే ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణపై నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పష్టంగా వివరాలు వెల్లడించడంలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న రెండు రోజుల వరకూ ప్రభుత్వం మౌనంగా ఉందని కాంగ్రెస్‌తోపాటు విపక్షాలు విమర్శలు చేశాయి. అయితే, ఈ అంశంపై పార్లమెంటు వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. చైనా విషయంలో కాంగ్రెస్ గతంలో అనుసరించిన విధానాలతోపాటు భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ లక్ష్యంగా అమిత్ షా విమర్శలు చేశారు. నెహ్రూ వల్లే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం రాలేదని కూడా అమిత్ షా వ్యాఖ్యానించారు.

అయితే, ఈ వ్యాఖ్యల్లో నిజం ఎంత? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

భద్రతా మండలిలో భారత్ ప్రతిపాదించిన చాలా అంశాలను వీటో అధికారంతో చైనా అడ్డుకుంటోంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా చైనా కొనసాగడమే దీనికి కారణమన్న సంగతి అందరికీ తెలిసిందే. చైనా విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను బీజేపీ ఎప్పటికప్పుడే తప్పుపడుతోంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని తీసుకునేందుకు భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తిరస్కరించారని విదేశాంగ చెబుతున్నట్లు 2004 జనవరి 9న ద హిందూలో ఓ కథనం ప్రచురించారు. నెహ్రూ తిరస్కరించడంతోనే ఆ సభ్యత్వం చైనాకు వెళ్లిందని ఆ కథనంలో పేర్కొన్నారు. నెహ్రూ-ద ఇన్విటేషన్ ఆఫ్ ఇండియా పేరుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ రాసిన వ్యాఖ్యలను ఈ కథనంలో ఉటంకించారు.

1953లోనే భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే, దీనికి నెహ్రూ తిరస్కరించారని శశిథరూర్ రాసుకొచ్చారు. భద్రతా మండలిలో చైనా వీటోల వల్ల భారత్ ఇబ్బంది పడటానికి తొలి ప్రధాన మంత్రి నెహ్రూ, కాంగ్రెస్సే కారణమని రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం అదే విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి చెప్పారు. అయితే, ఈ విషయంలో నెహ్రూను విమర్శించే వారు కొన్ని అంశాలను గుర్తుపెట్టుకోవాలి. 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటైంది. అప్పుడప్పుడే అది రూపుదిద్దుకుంటోంది. నిజానికి 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటైనప్పుడు భారత్‌కు స్వాతంత్ర్యం కూడా రాలేదు. మరోవైపు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తామని తమకు అధికారికంగా ఎలాంటి ప్రతిపాదనా రాలేదని 1955 సెప్టెంబరు 27న పార్లమెంటు వేదికగా నెహ్రూ చెప్పారు.

. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చేరాలని అధికారికంగా లేదా అనధికారికంగా ఎలాంటి ప్రతిపాదనా రాలేదు. మీడియాలో కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో ఎలాంటి నిజమూ లేదని ఆయన చెప్పారు. యూఎన్ చార్టర్ అధారంగా ఏర్పాటైన ఐక్యరాజ్యసమితిలో ఐదు దేశాలకు శాశ్వత సభ్యత్వం లభించింది. ఆ చార్టర్‌ను సవరించకుండా కొత్త దేశాలకు భద్రతా మండలిలో సభ్యత్వం ఇవ్వడం వీలుకాదు. ఇక్కడ భారత్‌కు సభ్యత్వం ఇవ్వాలంటే భద్రతా మండలిలోని అన్ని దేశాలు ఏకాభిప్రాయంతో ముందుకు రావాలి. మరోవైపు ఇదివరకు మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ కూడా భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం రాకపోవడానికి నెహ్రూనే కారణమని ఆరోపించారు. అప్పట్లో చైనాకు నెహ్రూ మద్దతు ప్రకటించారు.

చైనాతోపాటు కశ్మీర్ విషయంలోనూ నెహ్రూ తప్పు చేశారని జైట్లీ అన్నారు.

1955 ఆగస్టు 2న అప్పటి ముఖ్యమంత్రులకు నెహ్రూ రాసిన లేఖను ఆనాడు జైట్లీ ప్రస్తావించారు. 1955 ఆగస్టు 2న అప్పటి ముఖ్యమంత్రులకు నెహ్రూ ఒక లేఖ రాశారు. ఐరాసలో చైనాకు సభ్యత్వం ఇస్తామని, భద్రతా మండలిలో మాత్రం చైనాకు చోటు ఇవ్వమని అప్పట్లో అమెరికా చెప్పినట్లు ముఖ్యమంత్రులకు నెహ్రూ లేఖ రాశారు. అంతేకాదు చైనాకు భద్రతా మండలిలో చోటు ఇవ్వకపోవడం సరికాదని తాను భావిస్తున్నట్లు లేఖలో నెహ్రూ రాసుకొచ్చారని జైట్లీ చెప్పారు. 1950లలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనాకు శాశ్వత సభ్యత్వం కోసం భారత్ గట్టి మద్దతు తెలిపింది. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది.

అయితే, మావో నేతృత్వంలోని పీపుల్స్ రిపబ్లిక్‌కు కాకుండా, తైవాన్ కేంద్రంగా చ్యాంగ్ కాయీ షెక్ నేతృత్వంలోని రిపబ్లిక్ ఆఫ్ చైనాకు సభ్యత్వం ఇవ్వాలని అప్పటి అగ్ర దేశాలు భావించాయి. కానీ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు శాశ్వత సభ్యత్వం దక్కాలని నెహ్రూ భావించినట్లు తన పుస్తకంలో శశిథరూర్ రాసుకొచ్చారు. 1950ల్లో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మావోను బుజ్జగించేందుకే నెహ్రూ అలా చేశారని కొందరు విదేశాంగ నిపుణులు చెబుతుంటారు. మరోవైపు ఆసియా దేశాల మధ్య ఐక్యత ఉండాలనే చైనాకు నెహ్రూ గట్టి మద్దతు పలికారని మరికొందరు చెబుతుంటారు. నెహ్రూకు అంతర్జాతీయ వ్యవహారాల్లో దార్శనికత కొరవడిందని మరికొందరు అంటారు. అయితే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు నెహ్రూను మద్దతుపలికి తప్పుచేశారని అనేవారు కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి.

నెహ్రూ రెండు దేశాల మధ్య బ్యాలెన్స్ ఆఫ్ పవర్ చాలా ముఖ్యమని భావించారు. ఆ ఉద్దేశంతోనే ఆయన చైనాకు గట్టి మద్దతు పలికారని విశ్లేషకులు అంటున్నారు. నెహ్రూ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలంటే మనం 20వ శతాబ్దపు రాజకీయ వాతావరణాన్ని పరిశీలించాలి. అగ్ర దేశాలు తమ మిత్రదేశాలకు దగ్గరగా ఉండాలని, అంతర్జాతీయ సంస్థల్లో చేరాలని నెహ్రూ భావించేవారని విశ్లేషకులు అంటున్నారు.

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను శక్తిమంతమైన దేశంగా నెహ్రూ చూసేవారని వీరంతా అంటున్నారు.

ప్రపంచ రాజకీయాలకు అనుగుణంగా చైనాలో మార్పులు జరగాలని, లేకపోతే ఇది జర్మనీ తరహాలో ప్రమాదకరంగా మారుతుందని ఆయన అంచనావేశారు. భద్రతా మండలిలో చైనాకు శాశ్వత సభ్యత్వం కోసం నెహ్రూ గట్టి మద్దతు తెలపడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. కొత్త చైనా వల్ల ఆసియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ మారుతోందని నెహ్రూ గుర్తించారు. అందుకే ప్రపంచ రాజకీయాల్లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చోటు కల్పించకపోవడం అవివేకమైన చర్య అవుతుందని, ఇది మరింత ప్రమాదకరంగా మారొచ్చని ఆయన భావించారని స్పష్టం చేస్తున్నారు.

ఒక దేశం శక్తిమంతం అయినప్పుడు దేశ లక్ష్యాలు కూడా పెరుగుతాయని అంతర్జాతీయ వ్యవహారాల్లో చెబుతుంటారు. దీనికి భారత్ మినహాయింపేమీ కాదు. ఇటీవల కాలంలో భారత్ సైనిక, ఆర్థిక శక్తి చాలా పెరిగింది. దీంతో అంతర్జాతీయ వ్యవహారాల్లో పెద్ద పాత్రను భారత్ ఆశిస్తోంది. దీనిలో భాగంగానే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని భారత్ డిమాండ్ చేస్తూ వస్తోంది. దీనికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా.. భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై మద్దతు ప్రకటించాయి.

ఐరాసలో శాశ్వత సభ్యత్వంతో చైనా దూకుడుకు చెక్ ఏవిధంగా పెట్టగలమన్నది ప్రశ్నగా మారినా.. ఈ అంశంలో నెహ్రూ పాత్రపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..

Must Read

spot_img