Homeఅంతర్జాతీయంచైనా బెలూన్ ను కూల్చేసిన అమెరికా..

చైనా బెలూన్ ను కూల్చేసిన అమెరికా..

అమెరికా ఎయిర్ స్పేస్ లో చైనా బెలూన్ ప్రకంపనలు స్రుష్టిస్తోంది. చైనా నుంచి వచ్చిన స్పై బెలూన్ అని అమెరికా ఆరోపిస్తుండగా అలాంటిదేమీ లేదని వాదిస్తోంది చైనా. అయితే చిలికి చిలికి గాలివానగా మారిన ఈ వివాదం నేపథ్యంలో సదరు బెలూన్ ను అమెరికా కూల్చివేసింది. ఈ చర్య చైనా ఆగ్రహాన్ని మరింతగా పెంచింది. దీనికి ప్రతిచర్య ఉంటుందని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది.

కోవిడ్ వల్ల ప్రపంచం రికవరీ అయితే.. చైనా లో ఇంకా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ డ్రాగన్ దేశానికి బుద్ధి రావడం లేదు.. జనం మరణిస్తున్నా గుణ పాఠాలు నేర్చుకోవడం లేదు.. మరోవైపు వృద్ధిరేటు మందగిస్తోంది.. నిర్మాణరంగం కుదేలవుతోంది.. కంపెనీలు మొత్తం ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి.. ఇలాంటి స్థితిలో ఏ దేశమైనా తనను తాను ఆత్మ పరిశీలన చేసుకుంటుంది.. తన తప్పుల్ని సరిదిద్దుకొని కొత్త విధానాల వైపు పయనిస్తుంది. అదేంటో గాని చైనాకు ఇన్ని వరుస విపత్తులు ఎదురవుతున్నా దాని బుద్దిలో మాత్రం మార్పు రావడం లేదు. దీనికి తోడు ప్రపంచంపై బెలూన్ ల ద్వారా నిఘా పెడుతోంది. ఏకంగా బెలూన్ల రూపంలో ఉన్న ఎయిర్ షిప్ లను ఎగరేస్తోంది.

ఇలాంటి ఎయిర్ షిప్ తమ దేశం మీద ఎగురుతున్నట్టు గమనించిన అమెరికా దానిని యుద్ధ విమానాల సహాయంతో పేల్చేశారు.. మొదట దానిని గ్రహాంతర వాసుల యూఎఫ్ఓ అని అనుకున్నారు. పేలిన బెలూన్ ను చూడగా అందులో రకరకాల పరికరాలను పరిశీలించారు.. అధునాతన కెమెరాలు.. వీడియో రికార్డు చేసే పరికరాలు ఉన్నట్టు గమనించారు.. అయితే ఈ పరికరాలు వేగంగా ఫోటోలు తీసి అవి ఎక్కడి నుంచి అయితే ప్రయోగించబడ్డాయో అక్కడికి వాటిని పంపిస్తున్నాయి.. వాటిని నిలువరించడం సాధ్యం కాని సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయడంతో అమెరికా అధికారులు ఆ ఫోటోల అప్ లోడ్ ను నిలువరించలేకపోయారు.. అయితే ఇది ఎక్కడి నుంచి ప్రయోగించబడిందో… దాని రిమోట్ సెన్సింగ్ ఆధారంగా అది చైనా దేశానికి సంబంధించినదని అమెరికా అధికారులు గుర్తించారు.

ప్రస్తుతం అమెరికా ఉపరితలం మీద ఎగురుతున్న ఎయిర్ షిప్ కేవలం అమెరికాను మాత్రమే ఉద్దేశించి ప్రయోగించినది కాదు. భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ మీదుగా గాలివాటం కారణంగా ఇది అమెరికా వెళ్ళింది. మరి ఇంత జరుగుతున్నా భారత్ తో పాటు జపాన్ దేశాలు ఈ బెలూన్ ని ఎందుకు గుర్తించలేకపోయాయన్నది ప్రశ్నార్తకంగానే ఉంది. 60 వేల అడుగుల ఎత్తులో నెమ్మదిగా ప్రయాణించే ఎయిర్ షిప్ లాంటి దానిని సివిల్, మిలటరీ గ్రౌండ్ రాడార్లు గుర్తించలేవు. ఎయిర్ షిప్ ఎలాంటి వేడిని విడుదల చేయదు కాబట్టి హీట్ సిగ్నేచర్ అంటూ ఏదీ ఉండదు.. కాబట్టి ఉపగ్రహాలు కూడా గుర్తించలేవు. ఎయిర్ షిప్ లేదా పెద్ద పెద్ద బెలూన్లను గుర్తించాలి అంటే భూ దిగువ కక్ష్యలో ఉండే శాటిలైట్లు కావాలి.. వాటిని నియర్ ఎర్త్ ఇమేజింగ్ టెక్నాలజీ లు గుర్తించగలవు.

అయితే ఇది చాలా ఖరీదైన వ్యవహారం కాబట్టి ఈ టెక్నాలజీ మన దేశంతో పాటు జపాన్ దగ్గర కూడా లేదు. అందుకే బెలూన్ రాకను ఈ రెండు దేశాలు గుర్తించలేకపోయాయి. అమెరికా దగ్గర ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి వెంటనే గుర్తించగలిగింది. దానిని మానిటర్ చేయగలిగింది. ప్రస్తుతం అమెరికా, జపాన్, భారత్ చైనా కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాబట్టి… ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఎలాంటి టెక్నాలజీని వాడి దెబ్బతీయవచ్చు? అనే కోణంలో చైనా ఈ ప్రయోగం చేసింది. యుద్ధం అంటూ వస్తే ఇదే ప్రయోగించి వైరస్ ను విడవవచ్చు.. లేదా ఓ పరిధిలో ప్రభావం చూపగలిగే స్ట్రాటజిక్ అణు బాంబులను కూడా బెలూన్ ద్వారా ఉపయోగించవచ్చు. చూడ్డానికి చిన్నగా కనిపిస్తున్నా దగ్గర నుంచి చూస్తే ఇది రెండు బస్సుల సైజులో ఉందని అధికారులు అంటున్నారు.

ఈ బెలూన్ ను ధ్వంసం చేసిన అనంతరం అమెరికా చైనా పై నిరసన తెలిపింది. కానీ చైనా విదేశాంగ శాఖ మాత్రం అది కేవలం వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించినది అని, నియంత్రణ తప్పి అమెరికా భూభాగం వైపు ప్రయాణించిందని వివరణ ఇచ్చింది. దీని మీద తాము విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నది. చైనా అధికారులు ఇచ్చిన వివరణలోనే అది కంట్రోల్ తప్పింది అనే పదం వాడింది కాబట్టి అది బెలూన్ కాదు కంట్రోల్ ఎయిర్ షిప్ అని పరోక్షంగా ఒప్పుకున్నట్టు అయింది.. చాలా కాలం తర్వాత అమెరికా స్టేట్ సెక్రటరీ అయిన ఆంటోనీ బ్లింకెన్ చైనాలో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్న సందర్భంలో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న దౌత్య సంబంధాలు మరింత క్షీణించి అది అతడి పర్యటన రద్దు చేసుకునే దాకా వెళ్ళింది.

Must Read

spot_img