ప్రధాని మోదీ కేంద్రంగా అప్పటి గుజరాత్ అల్లర్ల పై అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారుతోంది. భారత్‌లో మాత్రం అన్ని సోషల్ మీడియా సైట్ల నుంచి ఈ డాక్యుమెంట్‌ను తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం హుకూం జారీ చేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా అమెరికా కొత్త పాట మొదలుపెట్టింది. తాజాగా బీబీసీకి మద్దతుగా అమెరికా నిలిచింది.
ప్రపంచంలో ఏ మూలనైనా సరే పత్రికా స్వేచ్ఛను అమెరికా గౌరవిస్తుందని తెలిపింది. ప్రజాస్వామ్య దేశంలో భావప్రకటన స్వేచ్ఛకు ప్రాముఖ్యత ఇవ్వాలని వెల్లడించింది. బుధవారం మీడియాతో మాట్లాడిన నెడ్ ప్రైస్ అనే ప్రతినిధి ప్రపంచ వ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తామని చెప్పారు. కానీ అదే అమెరికాలో సీఎన్ ఎన్ అంటే గిట్టని అధ్యక్షుల విషయం గురించి మరచిపోయారు. అమెరికాలో అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా సీఎన్ఎన్ అంటే మండిపడుతుంటారు.
అది మరచిపోయి భారత ప్రధానిపై బీబీసీ పక్షపాతంతో తయారుచేసిన డాక్యుమెంటరీ ప్రసారాన్ని సమర్థించారు. ప్రజాస్వామ్య విలువలైన భావప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛలకు తమ మద్దతు ఉంటుందని ప్రజా స్వామ్యాన్ని ఇవి బలోపేతం చేస్తాయన్నారు. ఈ విషయాన్ని తాము బలంగా నమ్ముతామని చెప్పారు. కేవలం ఈ విలువల ఆధారంగానే ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయని ఆయన ఉదహరించారు.
ఇందుకు భారత్ మినహాయింపు కాదని చెప్పుకొచ్చారు. అమెరికా భారత్ మధ్య రాజకీయ, ఆర్థిక, ప్రజానుబంధాలు కొనసాగుతున్నాయంటే ఇందుకు కారణం ఇరు దేశాలు ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తాయి కాబట్టే అని అన్నారు. ఇదిలా ఉంటే బీబీసీ డాక్యుమెంటరీ గురించి తనకు తెలియదని అయితే భారత్ అమెరికా దేశాలు ప్రజాస్వామ్య దేశాలు కాబట్టి ప్రజాస్వామ్య విలువలకు భంగం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని మాత్రమే తాను చెబుతున్నట్లు ప్రైస్ చెప్పారు. ప్రజాస్వామ్య దేశాలు ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కచ్చితంగా వాటిపై నిలదీశామని ప్రైస్ చెప్పుకొచ్చారు.
- ప్రధాని మోదీ కి యూకే ప్రధాని రిషి సునాక్ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలుస్తూ మాట్లాడారు..
తమ దేశానికి చెందిన బీబీసీ ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేస్తే దానిని ఆయన తప్పు పట్టారు. ఒకవైపు భారతదేశపు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన అంశాన్ని దురుద్దేశ్యపూర్వకంగా ఇప్పుడు మళ్లీ తెరకెక్కించడాన్ని ఆయన తోసిపుచ్చారు. అదే సమయంలో బీబీసీ డాక్యుమెంటరీ గురించి ఇసుమంతైనా మాట్లాడలేదు.
అంతేకాదు బీబీసీ డాక్యుమెంటరీలో గుజరాత్ అల్లర్లకు ప్రధాని మోదీ కారణం అని చెప్పిన డాక్యుమెంటరీతో తాను అంగీకరించబోనని సునాక్ స్పష్టం చేశారు. మోదీ క్యారెక్టర్ అలాంటిది కాదన్నది తన దృఢమైన భావన అని చెప్పుకొచ్చారు. యూకే పార్లమెంటులో బీబీసీ డాక్యుమెంటరీ పై ఈ విధమైన చర్చ జరిగింది.
పాకిస్తాన్ సంతతి ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ గుజరాత్ అల్లర్ల పై ప్రస్తావించిన సందర్భంలో యూకే ప్రధాని రిషి సునాక్ పై విధంగా స్పందించారు. అంతకు ముందు బీబీసీ 2002 గుజరాత్ అల్లర్లపై రెండు భాగాలున్న డాక్యుమెంటరీని విడుదల చేసింది. గుజరాత్ అల్లర్ల సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని మోదీ ఉన్నారు. అల్లర్లకు ప్రధాన కారణం మోదీనే అని చెబుతూ ఈ డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఇక ఈ డాక్యుమెంటరీ విడుదల కాగానే వివాదాలకు దారి తీసింది. వెంటనే అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం బీబీసీ సిరీస్ భారత్‌లో స్క్రీనింగ్ కాకుండా ఆదేశాలు జారీ చేసింది.
సోషల్ మీడియాలో అప్పటికే వైరల్ అయిన వీడియోలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కేవలం ప్రధాని మోదీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలన్న లక్ష్యంతో ఇది జరిగింది. ఈ వీడియోను బీబీసీ విడుదల చేయడం జరిగిందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. భారత్‌లో ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధిస్తున్నామని చెబుతూ ఇంతకంటే ఎక్కువగా మాట్లాడేందుకు ఏమీ లేదని తేల్చి చెప్పింది.
మొత్తానికి ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికలకు మరో సంవత్సరం వ్యవధి ఉన్న నేపథ్యంలో ఈ తరహా వీడియోలను ప్రచారంలోకి తేవడం అన్నది ఎవరి ఎజెండానో దేశ ప్రజలు తెలుసుకున్నారని బీజేపీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో ముగియనున్న నేపథ్యంలో అదే సమయంలో బీబీసీ ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయడం వెనుక దురుద్దేశాలున్నాయని తెలిపింది.