అగ్రరాజ్యం అమెరికాను ఇప్పుడు ప్రక్రుతి వైపరీత్యం వేదిస్తోంది. ఇంతగా ఓ మంచు తుఫాన్ అమెరికాను అతలాకుతలం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని అంటున్నారు. మొత్తం దేశాన్ని స్థంంభింజేసిన ఈ తుపాన్ ను బాంబ్ సైక్లోన్ అని అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ప్రపంచంలోనే అత్యధిక శక్తి వంతమైన దేశాన్ని ఇంతగా నిర్వీర్యం చేయడాన్ని ఎవరూ ఊహించలేదు..
అగ్రరాజ్యాన్ని బాంబ్ సైక్లోన్ వణికిస్తోంది. దీని వెంటే చైనా నుంచి ఒమిక్రాన్ బీఎఫ్ 7 అమెరికాను వెంటడిస్తే ఎలా అన్న భయం కూడా అగ్రరాజ్యాన్ని వణికిస్తోందంటే అతిశయోక్తి కాదు. అసలే అమెరికన్లు రోగ నిరోదక శక్తి విషయంలో చైనా వాళ్లకేం తీసిపోరు. ఆ విషయం గతంలో రుజువైంది. పొరబాటున బీఎఫ్ వేరియంట్ గానీ ఇటు వైపు విస్తరిస్తే మాత్రం కొంపలు మునిగినట్టే అంటున్నారు నిపుణులు.
దాని కన్నా ముందు ఈ ప్రకృతి విధ్వంసం విరుచుకుపడింది. దీని వల్ల యావత్ దేశ జనజీవనం స్తంభించినట్లైంది. విమాన సర్వీసులతో పాటు రోడ్డు, రైలు రవాణా కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. కరెంటు లేకుండా కాలం గడుపుతున్న కుటుంబాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఎవరికీ నీరు సరఫరా లేదు. రోడ్లన్నీ మంచుతో గడ్డ కట్టుకుపోయాయి.
రాబోయే కొద్దిరోజుల వరకు ఈ విపత్తు నుంచి ఉపశమనం లభిస్తుందనే అవకాశం లేదు. ఇదిలా ఉంటే బాంబ్ సైక్లోన్ అనే పదం జోరుగా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఈ బాంబు తుఫాను అంటే ఏమిటి..? ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాన్ని ఎలా స్తంభింపజేసింది..? దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం..బాంబు తుఫాను అనేది వేగంగా కదిలే తీవ్రమైన తుఫాను.
ఇది 24 గంటల్లో 20 మిల్లీబార్ల ..అంతకన్నా ఎక్కువ వాయుపీడనాన్ని కలిగిస్తుంది. వెచ్చని గాలి ద్రవ్యరాశి చల్లని గాలితో ఢీకొన్నప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈసారి ఆర్కిటిక్ నుండి గాలి గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుండి ఉష్ణమండల గాలికి వ్యాపించింది. ఇది వర్షం, మంచును తీసుకువస్తూ ప్రమాదం తెచ్చిపెట్టింది.
బాంబ్ సైక్లోన్..
బాంబ్ తుపాన్ అనే పదాన్ని మొదటిసారిగా 1980లలో వాతావరణ పరిశోధనలో వెల్లడించారు. ఎమ్ ఐ టీ వాతావరణ శాస్త్రవేత్తలు ఫ్రెడ్ సాండర్స్, జాన్ గ్యాకుమ్, స్వీడిష్ వాతావరణ నిపుణుడు టోర్ బెర్గెరాన్ దీనికి బాంబ్ సైక్లోన్ అని నామకరణం చేశారు. 24 గంటల్లో 24 ఎమ్ బార్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే అనూహ్యమైన వేగవంతమైన లోతైన తుఫానులను వీరు మొట్ట మొదటగా నిర్వచించారు.
ఈ తుఫాను అపూర్వమైన స్వభావం దాని తక్కువ ఉష్ణోగ్రతల తీవ్రతల నుండి వచ్చింది. అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం, ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో చలిగా ఉంది. అమెరికాలోని మిన్నెసోటాలో మైనస్ 38 డిగ్రీల వరకు పడిపోయింది. ఫ్లోరిడాలో హిమపాతం అలాగే కొనసాగుతోంది. ఇలాంటి చలిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే కొద్ది నిమిషాల్లో పెను ప్రమాదం తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇప్పటి వరకు బాంబ్ సైక్లోన్ ప్రభావానికి అమెరికాలో 22 మంది మృతి చెందారు. 17 లక్షల మందికి కరెంటు నీటి సరఫరాలు లేవు. దేశవ్యాప్తంగా 2వేల 7వందలకు పైగా విమానాలు రద్దయ్యాయి. అసలే మంచు తుపాన్, చలి గాలులతోనే ఇబ్బంది పడుతున్న ప్రజలకు కరెంటు కోతలు మరింత కష్టాన్ని కలిగిస్తున్నాయి. వాషింగ్టన్ పరిధిలోని బఫెలో పట్టణంలో అయితే, తుపాన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది.
ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో అత్యవసర సేవలు కూడా అందించలేని పరిస్థితి ఉంది. స్థానికులకు సహాయం అందించేందుకు సహాయక బృందాలు చేరుకోవడం కూడా కష్టమవుతోంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనాలు ఒకదానినొకటి ఢీ కొడుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చెట్లు కూలిపోయాయి.
ఇప్పటికీ కొన్ని చోట్ల రోడ్లపై వందలాది మంది వాహనాల్లో చిక్కుకుపోయి ఉన్నారని అధికారులు తెలిపారు. వేల కొద్ది విమానల రద్దు కూడా అమెరికాలో పెద్ద సమస్యగా మారింది. చివరి నిమిషంలో విమానాలు రద్దు కావడంతో ఎయిర్ పోర్టుల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి క్రిస్మస్ సెలవులకు సొంత ప్రాంతాలకు వెళ్దామనుకుంటున్న వాళ్లకు మంచు తుపాన్ ఆటంకంగా మారింది.
తాజా పరిణామాలతో దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలకు ఆటంకం కలిగింది. గత సంవత్సరం కరోనా కారణంగా ఈసారి బాంబ్ సైక్లోన్ కారణంగా క్రిస్మస్ సంబరాలు వెలవెలబోయాయి. అనేక ఈవెంట్స్ నిలిచిపోయాయి. వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయి.