Homeఅంతర్జాతీయంఆ దేశంలో విద్యార్థినులందరూ టీనేజీ తల్లులే..

ఆ దేశంలో విద్యార్థినులందరూ టీనేజీ తల్లులే..

అమెరికాలోని ఓ పాఠశాలలో విద్యార్థినులందరూ టీనేజీ తల్లులే కనిపిస్తారు. అమెరికాలో గత ఏడాది చివరన మాతృత్వం అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. చిన్న వయసులోనే గర్భం దాల్చి తల్లులవుతున్న వారి కోసం టెక్సాస్‌లో ప్రత్యేకంగా ఒక స్కూల్ నడుపుతున్నారు. ఈ స్కూల్ టీనేజ్ తల్లులకు ఎలా చేయూతనందిస్తుంది. వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో ఈ రోజటి ఇండెప్త్ లో చూద్దాం.

ముందుగా ఆ స్కూల్ లో చదువుకుంటున్న ఆడపిల్లలను గమనిస్తే..అక్కడ చదువుతున్నఓ అమ్మాయి హెలెన్.. 2021 ప్రారంభంలో ఉన్నట్టుండి ఎప్పటి కంటే ఎక్కువగా తినడం మొదలు పెట్టింది. ఈ 15 ఏళ్ల అమ్మాయికి ఎందుకు తనకింత తినాలనిపిస్తుందో అర్థం కాకపోయేది.

ఎవరికైనా మామూలుగా ఇలా తినాలనిపిస్తుందా? అని తన అక్కని అడిగింది. ”అవుతుండొచ్చు” ఆమె సమాధానం చెప్పారు. అంతే కాదు..హెలెన్ మనసు కూడా ఎప్పుడూ నలతగా, గందరగోళంగా ఉండేది. దాని వల్ల ఆమె తరచూ తన కుటుంబంతో, స్నేహితులతో గొడవలు పడేది. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆమెకు నెలసరి ఆలస్యమైంది. తన పుట్టిన రోజు పరీక్ష చేయించుకుని షాక్ తింది..ఆనాడే ఆమె గర్భవతి అని తేలింది. తాను ఓ బిడ్డకు తల్లినవబోతున్నానని ఆమె అస్సలు నమ్మలేదు. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఆమెను మరింత క్రుంగదీసాయి.

బాలికలతో పోలిస్తే స్పానిష్ మూలాలున్న పిల్లల్లో ప్రెగ్నెన్సీలు అత్యధికంగా ఉంటున్నాయి.

ఈ వార్త తెలిసిన తన స్నేహితులంతా హెలెన్‌ను దూరం పెట్టారు. అబ్బాయిలను ఆమె తన చుట్టూ తిప్పుకున్నదనే నిందలు హెలెన్ మోయాల్సి వచ్చింది. ఇంతటికీ కారణమైన తన బాయ్ ఫ్రెండ్.. తన బిడ్డకు కాబోయే తండ్రి హెలెన్ క్లాస్‌మేట్ కూడా తనతో మాట్లాడటం మానేశాడు. అయితే వారెవరితోనూ పోరాడాలని హెలెన్ అనుకోలేదు. నెలలు నిండుతున్న సమయంలో, ఆమె స్కూల్ మారాలని నిర్ణయించుకున్నారు. బయట నుంచి చూస్తే, అమెరికాలోని ఇతర ఉన్నత పాఠశాల మాదిరిగానే లింకన్ పార్క్ హైస్కూల్ కూడా కనిపిస్తుంది.

ప్రత్యేక విద్యా సేవలందిస్తున్న కొన్ని స్కూళ్లలో ఇది ఒకటి. గత మూడు దశాబ్దాలుగా అమెరికాలో టీనేజ్ పిల్లలు గర్భవతులయ్యే రేటు తగ్గింది. కానీ, ఇతర బాలికలతో పోలిస్తే స్పానిష్ మూలాలున్న పిల్లల్లో ప్రెగ్నెన్సీలు అత్యధికంగా ఉంటున్నాయి. అమెరికాలో ఇతర వర్గాలతో పోలిస్తే లాటినో బాలికలే అత్యధికంగా చిన్న వయసులోనే గర్భవతులవుతున్నారు. అమెరికాలో అబార్షన్లకు ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణను తీసివేస్తూ 2022లో సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించడంతో.. చిన్న వయసులోనే గర్భం దాల్చే వారి సంఖ్య మరింత పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లింకన్ పార్క్ 2005 నుంచి ప్రత్యేకంగా టీనేజ్ తల్లులకి తన సేవలందిస్తోంది. లింకన్ పార్కులోని విద్యార్థినులంతా దాదాపు 14 నుంచి 19 ఏళ్ల లోపు వారే. వారందరూ కూడా దాదాపు లాటిన్లే. చాలా మంది కుటుంబాల సంపాదన అరకొరగానే ఉంటుంది. కొంతమంది అమెరికాలో పుట్టిన మెక్సికన్ నివాసితుల పిల్లలు. అమెరికాలో ఈ ఏడాది అమ్మతనం సంస్కృతి పరంగా, రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, అనుకోని ఈ జీవన మార్పుల వల్ల బాలికలు అప్పటికే ఎదుర్కొంటోన్న సవాళ్ల నుంచి వారిని బయటపడేసేందుకు లింకన్ పార్క్ స్కూల్ కృషి చేస్తోంది.

ఇక్కడ చదువుకునే పిల్లలంతా హెలెన్ లాగే భుజాన పుస్తకాలు, జర్నల్స్‌తో పాటు తమ తమ నెలల పిల్లలు ఉన్నారు. వారి వెంట డైపర్లు, బేబీ బట్టలున్నాయి. ఈ పాఠశాలలో 70 మంది విద్యార్థినులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్య ఏటా మారుతూ ఉంటుంది. ఎందుకంటే కొత్తగా గర్భం దాల్చిన వారు ఈ స్కూల్‌లో చేరడం, కొందరు బిడ్డ పుట్టిన తర్వాత తమ మునపటి స్కూళ్లకు వెళ్లిపోవడం జరుగుతూ ఉంటుంది.

లింకన్ పార్క్‌లో 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఏడుగురు సెకండరీ స్కూల్ విద్యార్థినులు కూడా దీనిలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అలాగే, ముగ్గురు విద్యార్థులకైతే అప్పటికే ఒక్కొక్కరికి ముగ్గురుగా పిల్లలున్నారు. అయితే ఇలా ఉన్నందుకు విద్యార్థినులకు లభిస్తొన్న సౌకర్యాలు అద్భుతంగా ఉంటున్నాయి. పైగా ఇతర పాఠశాల విద్యార్థుల మాదిరిగానే వీరి స్కూల్ సిలబస్ ఉంటోంది. విద్యార్థులు తమ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యేలా లింకన్ స్కూల్ యజమాన్యం సహకరిస్తుంది.

విద్యార్థినులను తీసుకెళ్లి, తీసుకొచ్చే బస్సులలో పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా సీట్లు ఇతర సౌకర్యాలకు ఏర్పాట్లు కలుగజేస్తున్నారు. ఉదయం పూట విద్యార్థినులు వారి కోసం, వారి పిల్లల కోసం అల్ఫాహారం తీసుకొస్తుంటారు. తమ పిల్లలు అక్కడే ఉన్న డేకేర్ సెంటర్‌లో ఉచితంగా చదువుకోవచ్చు. ఎలాంటి ఫీజుల బెడదా ఉండదు. తమ పిల్లలు ఆరోగ్యం బాగలేనప్పుడు ఆసుపత్రిలో చూపించేందుకు ఆ విద్యార్థులకు అనుమతి కూడా ఉంటుంది. తల్లులకు అవసరమైనప్పుడు పిల్లల వస్త్రాలను అందించేందుకు క్లాస్‌రూమ్‌లో ఒక దగ్గర పెద్ద వార్డ్‌రోబ్ ఉంది. బయట అసౌకర్యంగా అనిపించిన ఈ తరహా అమ్మాయిలకు స్కూల్ క్లాస్‌రూమ్‌లలో ఎంతో ఆత్మీయత, అనురాగాలు పొందుతున్నారు. అయితే అక్కడి విద్యార్థులకు, టీచర్లకు ఇదంతా చాలా సహజం.

మొత్తంగా దేశవ్యాప్తంగా చిన్న వయసులోనే తల్లులవుతోన్న వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ, టెక్సాస్‌లో మాత్రం ఈ సంఖ్య అధికంగా ఉంది. చిన్న వయసులోనే పిల్లలకి జన్మనిస్తున్న టాప్ 10 రాష్ట్రాలలో టెక్సాస్ మొదటి స్థానంలో ఉంటోంది. ఇందుకు కారణాలేంటన్న విషయంపై ఆధ్యయనం జరిగింది. బాలికల గర్భధారణ రేట్లలో చాలా అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

అయితే, టెక్సాస్‌ రాష్ట్రం అబార్షన్ చట్టాలను చాలా కఠినంగా అమలు చేయడం, పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్ తప్పనిసరి కాకపోవడం లాంటి కారణాలతో ఆ ప్రాంతంలో అత్యధికంగా చిన్న వయసులోనే బాలికలు తల్లులవుతున్నారు. బాలికలతో ఈ సమాచారం పంచుకోకపోతే, వారికి దీనిపై అవగాహన రాదని లింకన్ పార్క్ హైస్కూల్ ప్రిన్సిపల్ సింథియా కార్డెనాస్ చెప్పారు. వారికి దీని ప్రభావాలు తెలుసుకునేందుకు కనీసం అవకాశం ఇవ్వడం లేదన్నారు. టెక్సాస్‌లో గర్భిణీలయ్యే బాలికలకు తప్పనిసరిగా ప్రజారోగ్య సదుపాయాలను అందించాలని లేదంటే ప్రెగ్నెన్సీ తీసేసుకోవాలనుకుంటే వారు కఠినమైన అబార్షన్ చట్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.

ఇతర రాష్ట్రలకు వెళ్లి అబార్షన్ సర్వీసులు పొందడం తక్కువ ఆదాయం గల మహిళలకు కష్టమవుతుంది. తాను గర్భం దాల్చినట్టు తెలియగానే మనం ముందు చెప్పుకున్న హెలెన్ రెండు విషయాల గురించి ఆలోచించించింది. ఒకటి అబార్షన్ చేయించుకోవడం.. లేదంటే ఎవరికైనా తన బిడ్డను దత్తత ఇవ్వడం..అయితే తాను ఏ నిర్ణయం తీసుకున్నా తాను సపోర్టు చేస్తానని హెలెన్ తల్లి హెలెన్‌కు మద్దతుగా నిలిచారు. చివరికి హెలెన్ తన పండంటి బిడ్డకు జన్మించారు. ఇప్పుడు ఆమె నిర్ణయం మారింది. తనతోనే తన కూతుర్ని కూడా ఉంచుకోవాలనుకుంటోంది.

మనం చెప్పుకుంటున్న ఈ కథలో హెలెన్ ఓ పాత్రధారి మాత్రమే.. ఇలాంటి హెలెన్ లు వందలాదిగా అమెరికాలో ఉన్నారు. వారి భవిశ్యత్తు గురించి ప్రభుత్వం కూడా ఆలోచిస్తోంది..

Must Read

spot_img