ఈ మధ్య మన దేశంలో విమాన ప్రయాణాలు జనాన్ని జడిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. మొన్నమొన్నటిదాకా ప్రతీ రోజూ దేశంలో ఏదో ఓ విమానం త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుందన్న వార్తలు నిజంగానే ప్రయాణీకులను భయభ్రాంతులకు గురి చేసాయి. విమాన ప్రయాణాలలో సాధారణంగా జరిగే టర్బులెన్సులు కూడా భయపెట్టాయి.

అయితే వాటిని పక్కనబెడితే ఎయిర్ పోర్టుల్లో సౌకర్యాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నానాటికీ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న ప్రయాణీకుల రష్ ను ఎయిర్ పోర్టులు తట్టుకోలేకపోతున్నాయి. వారికి సౌకర్యాలు కలిగించడంలో ఎయిర్ పోర్టు మేనేజ్మెంట్లు చేతులెత్తేస్తున్నాయా అన్న అనుమానలు కలుగుతున్నాయి.
అంతంత మొత్తాలను పెట్టి టిక్కెట్ కొన్నాక చేసే ప్రయాణమంటే… సుఖవంతంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు.సుఖంగా, సౌకర్యంగా, సత్వరంగా, సకాలంలో చేరడం కోసమే విమాన ప్రయాణాలను ఎంచుకుంటారు. కానీ, మన దేశంలో ఇప్పుడు అవి నరకప్రాయంగా మారుతున్నాయని అంటున్నారు రెగ్యులర్ గా ప్రయాణించే జనం. ఎక్కడ చూసినా కొండవీటి చేంతాడంత క్యూలు… బోర్డింగ్ కోసం గంటల కొద్దీ నిరీక్షణ… చీకాకు పరిచేటన్ని చెకింగ్‌లు.. నిలిచేందుకు జాగా లేని రద్దీ… ఎటుచూసినా లగేజ్… ట్రాలీల కొరత… విమానాల జాప్యం… ఇదీ ఇప్పుడు పరిస్థితి.
ప్రతీ రోజూ 1200 విమానాలతో, ఏటా 6.9 కోట్ల ప్రయాణికులతో దేశంలో కెల్లా బిజీగా ఉండే ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత వారంగా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఎయిర్‌పోర్ట్ కాస్తా చేపల బజారులా తయారైందంటూ నెటిజన్లు పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సాక్షాత్తూ పౌర విమానయాన మంత్రి సోమవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకొని, రద్దీ నివారణ చర్యలపై చర్చించాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా విమానాశ్రాయాల్లోని లోటుపాట్లపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.
ప్రస్తుతం గంటలో గమ్యం చేరే దేశీయ విమాన ప్రయాణికులు సైతం గడువు కన్నా కనీసం మూడున్నర గంటల ముందే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రిపోర్ట్ చేయాల్సిన దుఃస్థితి నెలకొంది.. వేరే లగేజ్ లేకుండా, 7 కిలోల హ్యాండ్ బ్యాగేజీ ఒక్కటే తెచ్చుకొమ్మని ఇండిగో లాంటి విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. దేశంలోకెల్లా అతి పెద్దదైన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టీ1, టీ2, టీ3 అని మూడు టెర్మినల్స్ ఉన్నాయి.
అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు కొన్ని దేశీయ సర్వీసులూ టీ3 నుంచే నడుస్తుంటాయి. తాజా పరిణామాలతో రద్దీ ఎక్కువగా ఉండే కీలక సమయాలైన ఉదయం, సాయంత్రం వేళల్లో విమానాల సంఖ్యను తగ్గించాలనే యోచన చేస్తున్నారు. కొన్ని సర్వీసులను టీ3 నుంచి ఇతర టెర్మినల్స్‌కు మార్చాలని భావిస్తున్నారు. అయితే, ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే అంటున్నారు ప్రయాణీకులు.
పది రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామంటున్న మంత్రివర్యులు శాశ్వత పరిష్కారాలపైన దృష్టి పెట్టడం లేదు. పైపై పూతగా మందు రాస్తున్నారు. దీని వల్ల ఏ లాభమూ లేదు. నిజానికి దేశంలో విమాన ప్రయాణాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అవసరాలు, సమయం ద్రుష్టిలో పెట్టుకుని త్వరగా పూర్తయ్యే విమాన యానానికే మొగ్గు చూపుతున్నారు.
ఒక్క ఢిల్లీలోనే కాదు… పుణే, ముంబయ్, బెంగళూరుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. హైదరాబాద్‌లో సైతం మొన్నటిదాకా వేర్వేరుగా ఉన్న జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికుల నిష్క్రమణ మార్గాన్ని ఇటీవల టెర్నినల్ విస్తరణ కోసమంటూ ఒకేచోటకు మార్చారు. అలా ఒకేచోట జనం కేంద్రీకృతమై, ఒత్తిడి పెరిగిపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. ప్రపంచీకరణతో పెరుగుతున్న రద్దీకి తగ్గట్టు కొన్నేళ్ళుగా దేశంలో పలు విమానాశ్రయాల ఆధునికీకరణ కొనసాగింది. తీరా ఢిల్లీ వ్యవహారంతో అవన్నీ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జరగలేదని అనుమానం కలుగుతోంది.
దేశాల్లో కోవిడ్ నిర్బంధాలు ఎత్తివేసేసరికి దేశీయంగా, అంతర్జాతీయంగా విమానాల ద్వారా ప్రయాణాలు చేయడం బాగానే పెరిగింది.

కొత్తగా గోవాలో మోపా వద్ద కట్టిన ఎయిర్ పోర్ట్ యాత్రికుల సామర్థ్యం 44 లక్షలు మాత్రమే. అది ఇప్పటికే ఉన్న డాబోలిమ్ ఎయిర్‌పోర్ట్ కన్నా తక్కువ సత్తా కావడం విడ్డూరం అంటున్నారు రెగ్యులర్ గా జర్నీ చేసే యాత్రీకులు. నిజానికి దేశవ్యాప్తంగా అపారమైన పర్యాటకులు సముద్రతీరాలలో సెద తీరేందుకు గోవా వస్తుంటారు. ఓ సీజనంటూ లేకుండా నిత్యం ఇక్కడ రద్దీగానే ఉంటుంది.
అనేక దేశాల్లో కోవిడ్ నిర్బంధాలు ఎత్తివేసేసరికి దేశీయంగా, అంతర్జాతీయంగా విమానాల ద్వారా ప్రయాణాలు చేయడం బాగానే పెరిగింది. ఇబ్బడిముబ్బడిగా జనం తమ ప్రయాణాల కోసం విమానాలనే ఎంచుకుంటూ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్నారు, ఎయిర్‌లైన్స్‌లో ఇప్పుడున్న వసతులపై ఒత్తిడి అధికమైంది. గత ఆదివారం ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచే 4.27 లక్షల మందికి పైగా ప్రయాణించారంటే ఇది ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
కోవిడ్ నిబంధనలు ఎత్తేశాక ఈ ఏడాది జూలైలో యూరప్‌లోని పలు విమానాశ్రయాల్లో ఇలాంటి గందరగోళమే నెలకొంది. లండన్‌లోని అత్యంత రద్దీగా ఉండే హీత్రూ విమానాశ్రయంలోనూ ఇదే కథ కనిపిస్తోంది. కరోనా కాలంలో విస్తరణ ప్రణాళికలకు బ్రేకులు పడ్డ విమానాశ్రయాలు ఇప్పుడు మళ్ళీ ఆ పనులను పట్టాలెక్కించాల్సి ఉంది.
ప్రయాణికుల చెకింగ్..ఓ పద్ధతి ప్రకారం సాగకపోవడం, విమానాశ్రయ అధికారుల్లో అలసత్వం లాంటి కారణాలతో మన దేశ రాజధాని ఢిల్లీలో గందరగోళం నెలకొంది. ఎయిర్‌లైన్స్ చెక్-ఇన్ కౌంటర్లలో సిబ్బంది లేకపోవడం, ఉన్నా అరకొరగా ఉండడం రద్దీకి దారి తీస్తోంది. సెక్యూరిటీ చెక్ చేయాల్సిన నిపుణులైన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ‘సీఐఎస్‌ఎఫ్’ సిబ్బంది కూడా తక్కువగానే ఉన్నారు.
సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగులను 3 వేలకు పైగా రద్దు చేసి, వారి స్థానంలో అనుభవం లేని 2 వేల కన్నా తక్కువ ప్రైవేట్ భద్రతా సిబ్బందిని పెట్టడం ఎందుకు చేసారో కానీ సమస్యలు మొదలయ్యాయి. వీటిని తక్షణం సరిదిద్దాలని ప్రయాణీకులు కోరుతున్నారు.
బ్యాగేజ్, బిల్లింగ్ నుంచి బోర్డింగ్ దాకా అన్నింటా ఆధునిక సాంకేతికతను ఆశ్రయించడం ఓ మార్గం. అంతర్జాతీయ ప్రయాణం చేసి వస్తున్నవారి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ఇప్పటికీ గంటన్నర నుంచి రెండు గంటలు పడుతోంది. ప్రస్తుతానికి విమానంలోనే వివరాలు నింపే పద్ధతి పెడతామంటున్నారు. దీనికి డిజిటలీకరణ మాత్రమే ఓ మంచి పరిష్కారంగా ఉండనుంది.
సంవత్సరాంతపు సెలవులు, పండగలతో మనదేశంలో ఎప్పుడూ ప్రయాణాలు కొనసాగుతూ ఉంటాయి. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది సరైన వ్యూహరచన, ప్రణాళికాబద్ధంగా ప్రాథమిక వసతులు మాత్రమే..ఇందుకు వెంటనే కౌంటర్లనూ, సిబ్బందినీ పెంచాలి. స్మార్ట్ సిటీల్లా స్మార్ట్ ఎయిర్‌పోర్ట్‌లు కూడా ఉండాలి.
ప్రపంచశ్రేణి టెర్మినల్స్ ఏర్పాటున వేగవంతం చేయాలి. ఇప్పటికైనా ఢిల్లీ, హైదరాబాద్, ముంబయ్ – ఇలా ప్రాంతానికో రకం కాకుండా అన్నిచోట్లా ఒకే ప్రామాణిక సెక్యూరిటీ ప్రోటోకాల్ తేవాలి. ముఖం చూసి గుర్తించే బయోమెట్రిక్ పద్ధతిని అమలు చేయాలి. అదే బోర్డింగ్ పాస్‌గా ‘డిజి యాత్ర’ విధానాన్ని ఇటీవలే ఎయిర్‌పోర్టుల్లో అమలు చేస్తున్నారు. ఇది మొక్కుబడిగా కాకుండా అన్నిచోట్లకు విస్తరించాలి.
ఉద్యోగులకు అన్ని వ్యవస్థలపై అవగాహన పెంచడం అవసరం. ప్రపంచంలోని 10 రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీ, ముంబయ్ చేరనున్న వేళ ఇలాంటి క్షేత్రస్థాయి అంశాలపై శ్రద్ధ చూపించాలని నిపుణులు చెబుతున్నారు.