రోజు రోజుకు పెరుగుతున్న వాయుకాలుష్యం..!
పొగ తాగకపోయినా క్యాన్సర్ భారీన పడే అవకాశం…?
ఈ భూమి మీద ప్రతి ఒక్కటి కలుషిత బారీన పడుతుంది. ఇప్పటి వరకు మనం నీరు కలుషితం అవటం గురించి విన్నాం. కానీ ప్రస్తుతం మనం ఫ్రీగా పీల్చుకునే గాలి కూడా కాలుష్యం అవుతుందని తెలుసా..? మొదట వాయు కాలుష్యం రెండవ ప్రపంచ యుద్ద సమయంలో ఎక్కువగా కలుషితం అయింది. కానీ తాజాగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఓ సర్వేలో ప్రపంచ జనాభాలో దాదాపుగా 99 శాతం మంది కలుషిత గాలిని పీల్చుతున్నారని తేలింది. మనం పీల్చుకునే గాలిలో ఎక్కువగా హానికారక రేఫువులు, దుమ్ము, దూళీతో పాటు పలు రకాల రసాయనాలు కూడా కలుస్తున్నట్లు తాజా ఓ సర్వే తెలిపింది. ఈ హానికారకాలు బయట గాలి పీల్చుకునే మనతో పాటు తల్లి గర్భంలో అప్పుడే ప్రాణం పోసుకునే పిండాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది ప్రయోగాత్మకంగా గర్భస్థ పిండాల్లో చొచ్చుకెళ్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. బెల్జియంలోని హాసెల్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ నిజాలు బయటపడ్డాయి.
చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతున్న వాయు కాలుష్యం..

ప్రపంచం సంగతి పక్కన పెడితే… మన భాగ్యనగరంలో కూడా వాయుకాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతున్నది. కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయి పలు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న కాలుష్యం మాత్రం తగ్గడంలేదు. ఇదీ ఈలానే కోనసాగితే త్వరలో మనం ప్రస్తుతం వైరస్ భారీన పడకుండా ఎలాగైతే మాస్కులు పెట్టుకున్నామో…భవిష్యత్ లో ఆక్సిజన్ ట్యాంక్ లను వీపుకు వేలాడు తీసుకునే పరిస్థితి తప్పదు అనిపిస్తుంది. ప్రభుత్వం కాలుష్యం తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలో వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో పాటు, పరిశ్రమల నుండి తీవ్ర స్థాయిలో కాలుష్యం పెరుగుతున్నది. దీనిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. గతేడాది నగరంలోని సనత్నగర్ ఏరియాలో ఒక్కరోజే వాయుకాలుష్య తీవ్రత 324 పాయింట్లుగా నమోదైనట్లు అధికారిక నిర్థారణ జరిగింది. ఇది ఆందోళన కలిగించే స్థాయి అని, ఇలానే నమోదైతే శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జనరల్ గా వాయికాలుష్య తీవ్రత నాణ్యత ప్రమాణాల ప్రకారం 300-400 పాయింట్ల మధ్య నమోదైతే వాయుకాలుష్యం అధికంగా ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఇప్పటికే భాగ్యనగరంలో ఆరు ప్రాంతాలలో తీవ్రత మధ్యస్థంగా ఉందని అంచనా వేశారు. ఈ మధ్యస్థ స్థాయి కాలుష్యం కూడా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. తాజాగా చేసిన సర్వేలో ఐడీఏ పాశమైలారం వద్ద 188, జూపార్క్ వద్ద 185, ఇక్రిశాట్ వద్ద 183, బొల్లారం ప్రాంతంలో 182, సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర 147, సోమాజిగూడలో 122 పాయింట్లుగా ఏక్యూఐ నమోదైంది. దీంతో నగరంలో వాయు కాలుష్యంపై డేంజర్ బెల్స్ మోగే అవకాశాలు ఉన్నట్లు బావిస్తున్నారు. మాములుగా 100-200 పాయింట్ల మధ్య గాలి నాణ్యత నమోదైతే మధ్యస్థంగా ఉన్నట్లు పరిగణిస్తారు. దీని వలన శ్వాస తీసుకోవడంలో అసౌకర్యం, ఆస్తమా, హృదయ సంబంధిత వ్యాదులు వచ్చే అవకాశం ఉంది. కాగా, కోకాపేట్‌లో ఏక్యూఐ అత్యధికంగా 41, అత్యల్పంగా 19 పాయింట్లుగా నమోదైంది. ఇక ఈసీఐఎల్, ఐఐటీ కంది, కొంపల్లి, రామచంద్రాపురంలో గాలి నాణ్యత సంతృప్తకర స్థాయిలో ఉంది. ఈ విధంగా వాయు కాలుష్యం పెరిగిపోతే త్వరలోనే హైదరాబాద్ మరో ఢిల్లీగా మారే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కలుషిత గాలినే పీల్చుకుంటున్నాం…

ప్రభుత్వం ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకుని వాహానాల వినియోగం తగ్గించేందుకు ఇప్పటికే పలు రవాణా సౌకర్యాల సర్వీసులను అందుబాలులోకి తెచ్చింది. అంతేకాకుండా, ప్రజా రవాణా కోసం మెట్రో సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ కాలుష్యం పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మన చుట్టూ ఆవరించిన వాతావరణంలో విషతుల్యత నానాటికీ పెరుగుతోంది. ప్రాణాలను నిలపాల్సిన గాలి అదృశ్య హంతకిగా మారిపోతోంది. ప్రపంచ జనాభాలో 99 శాతం మంది కలుషిత వాయువులను శ్వాసిస్తున్నారు. అందులోని హానికారక రేణువులు.. అన్ని రక్షణ వలయాలను ఛేదించుకొని గర్భస్థ పిండాల్లోకీ చొచ్చుకెళుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడి కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని 2018లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు.

జీవకోటిని నాశనం చేస్తున్న వాయుకాలుష్యం సమస్త మానవాళికి ముప్పుగా పరిణమిస్తోంది. గాలి కాలుష్యం మూలంగా ఏటా కోటి యాభై లక్షల మంది మరణిస్తుండగా, నీటి కాలుష్యంతో తొమ్మిది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక 40 శాతం మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. 60 శాతం మంది గుండె జబ్బులు, డయాబెటిస్ తదితర వ్యాధులకు గురవుతున్నాట్లు సమాచారం. ఎక్కువ సమయం ఇల్లు లేదా ఆఫీస్ కార్యాలయంలో గడపడం శ్రేయస్కారమని వేరే వేరే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు.. ఎన్ 95 లేదా పీఎం 2.5 మాస్క్ ధరించడం శ్రేయస్కరమని వైద్యనిపుణలు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో వాయునాన్యతను బట్టి సాధ్యమైనంత వరకు కాలుష్యం లోకి వెళ్లకుండా ఉండేలా చూసుకోవాలి.. ఒక వేళ వెళ్లిన తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు…
పొగ రాయళ్లతోనూ… పొంచి ఉన్న పెను ప్రమాదం…

పొగ తాగే వారి కన్న తాగని వారు ఎక్కువగా జబ్బుల భారీన పడే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెప్తున్నారు. పొగ తాగే వారి కంటే పీల్చే వారు ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్ భారీన పడుతున్నట్లు తాజా సర్వేలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేశారు. ధూమపానం చేయనివారిలో క్యాన్సర్ సహజంగా అభివృద్ధి చెందుతుందని ఈ పరిశోధన నివేదిక చెబుతోంది. బయట రోడ్డుపై వెళ్లేటప్పుడు చాలా మంది పొగరాయళ్లు దూమాపానం చేస్తారు. వారు పీల్చి వదిలిన పొగను మనం పీల్చితే పలు రకాల శ్వాసకోస వ్యాధుల భారీన పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు లంగ్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు ఆధ్యయనంలో వెల్లడైంది. ఊపిరితిత్తులకు హానిచేసే సిగరెట్లలో 4,000లకు పైగా రసాయనాలు ఉంటాయి. అందులో 60కి పైగా క్యాన్సర్ కారకాలే. ఒకప్పుడు విపరీతంగా పొగతాగి మానేసిన వారిలోనూ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వారి కుటుంబసభ్యులకూ అంతే ముప్పు పొంచి ఉంటుంది.