ఆ మహిళా మంత్రి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఒకటా రెండా.. మంత్రి అయ్యాక కాంట్రవర్షీలు ఆమెకు వైఫైలా మారాయి. మొన్న సొంత పార్టీ నేతలే ఆమెకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు.. నిన్న భూ వివాదాలన్నారు.. ఇప్పుడు తాజాగా ఇంకో సమస్య ఆమె మెడకు చుట్టుకుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి జరుగుతుంటే.. ఆ మహిళా మంత్రికి సంబంధించిన ఓ వీడియో అధికార పార్టీని కార్నర్ చేసేలా వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది.. ఆ మహిళా మంత్రిని కాంట్రావర్షీస్ ఎందుకు వెంటాడుతున్నాయి..
రాజకీయ నాయకులన్నాక వివాదాలు, విబేధాలు చాలా కామన్ గా ఉంటాయి. అయితే ఏ నేతకైనా వివాదాలు అప్పుడప్పుడు వస్తుంటాయి.. కానీ ఆ మహిళా మంత్రికి మాత్రం కాంట్రవర్షీలు వైఫై లాగా చుట్టూ ఉంటాయి. ఇంతకీ ఎవరా మంత్రి అంటే సీఎం జగన్ రెండో క్యాబినేట్ లో లక్కీగా ఛాన్స్ కొట్టేసిన ఉషాశ్రీ చరణ్. ఆమె రాజకీయాల్లోకి చాలా ఏళ్ల క్రితమే వచ్చినా.. యాక్టీవ్ గా ఉన్నది మాత్రం 2019 ఎన్నికల సమయంలోనే. తొలిసారి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. అందునా టీడీపీకి కంచుకోటలా ఉన్న ప్రాంతంలోనే గెలుపొందారు.

అప్పట్లో ఆమె ఎంతో సౌమ్యంగా ఉండేవారు. కనిపించిన ప్రతి ఒక్కర్నీ అన్న తమ్ముడు, అక్కా అంటూ పలుకరించే వారు. కానీ ఎమ్మెల్యే అయ్యాక సీన్ మారింది. తెర ముందు ఒక చిత్రం.. తెర వెనుక ఇంకో చిత్రం అన్నట్టుగా విమర్శలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే వివాదాలు చుట్టుముట్టాయి. అది కూడా ప్రతిపక్షాల నుంచి కాదు.. సొంత పార్టీ నేతల నుంచే వివాదాలు మొదలయ్యాయి. అవి పెరిగి పెద్దవై నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేకంగా ఒక పెద్ద గ్రూప్ తయారైంది. వీరంత అధిష్టానానికి ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేశారు. తమను ఆమె నుంచి కాపాడండంటూ వేడుకున్నారు.
కానీ అధిష్టానం ఇవేవి పట్టించుకోకుండా అన్ని వివాదాలు ఉన్న ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ కు మంత్రి పదవి ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అన్ని వివాదాలు ఉంటే.. ఇక మంత్రి అయ్యాక ఆ వివాదాలు తగ్గుతాయనుకున్నారు. కానీ ఇంకా ముదిరి పాకాన పడ్డాయి. మంత్రిగా జిల్లాలో అడుగు పెట్టిన రోజు నుంచి ఆమెకు సమస్యలు స్టార్ట్ అయ్యాయి. అవి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు.. సొంత పార్టీ నేతలకు టార్గెట్ గా మారారు. వారిని కేసులు పెట్టి.. అరెస్టులు చేయిస్తూ.. అణిచివేయిస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు సీన్ లోకి ప్రతిపక్షాలు వచ్చాయి.
ముందుగా కళ్యాణదుర్గం సమీపంలో చెరువు కబ్జా ఆరోపణలు వెల్లువెత్తాయి. అది 2వందల కోట్ల విలువ చేసే స్థలం అది. మంత్రి అనుచరులే చెరువు స్థలాన్ని కబ్జా చేసి మట్టి వేసి చెరువునే పూడ్చి వేస్తున్నారని టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు పెద్ద కాంట్రవర్షీగా మారాయి. తాజాగా మంత్రికి సంబంధించిన భూఆక్రమణల చిట్టా ఇదుగో అంటూ టీడీపీ నేతలు ఉన్నం హనుమంతరాయచౌదరి, ఉమా మహేశ్వరనాయుడు బ్యాచ్ లు మీడియా ముందుకు వచ్చాయి.
సర్వే నెంబర్లు, పేర్లతో సహా ఆధారాలు తీసుకొచ్చారు. కొన్ని పత్రికల్లో సర్వే నెంబర్లు, ఆధారాలతో సహా పతాక శీర్షికలో వచ్చాయి. అయితే వాటన్నిటినీ మంత్రి ఏమాత్రం ఖాతరు చేయకపోగా.. నన్ను ఎదుర్కొలేక వారి ఇమేజ్ పెంచుకునేందుకు టీడీపీ నేతలు ఇలా ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మగాళ్లు అయితే నిరూపించండి.. చేత కాని దద్దమ్మల్లా ఆరోపణలు చేయవద్దంటూ తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలను పంచ్ డైలాగ్స్ తో ఆడుకున్నారు. అయితే ప్రతిపక్షాలు కూడా ఎక్కడా తగ్గలేదు. మేము నిరూపిస్తామంటూ బయలుదేరిన టీడీపీ నేతలను అరెస్టులు చేయడం ఇష్యూని మరింత పెద్దది చేసింది.
అప్పటి వరకు ఇలాంటి వాటిపై స్పందించని సీఎం జగన్ కూడా దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారన్న వార్తలు వచ్చాయి. మంత్రి ఉషాశ్రీని పిలిచి మరీ క్లాస్ ఇచ్చినట్టు సోషియల్ మీడియాలో బాగా ప్రచారమైంది. ఈ వివాదాలు ఇంకా ముగియనే లేదు.. ఒక వీడియో రూపంలో మంత్రికి కొత్త కష్టాలు తెచ్చి పెట్టాయి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలను టీడీపీ, వైసీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అందరికీ తెలిసిందే. అయితే అధికార పార్టీ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తోందని.. డబ్బులు పంచుతున్నారని.. బెదిరిస్తున్నారని ఇలా చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు.
ఇలాంటి సమయంలో ఒక క్యాబినెట్ మినిస్టర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు పంపకాల డిస్కషన్ కు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆ మంత్రి ఎవరో కాదు.. మన ఉషాశ్రీ చరణే. ఆ వీడియోలో నిజమెంతో కానీ.. టీడీపీకి, వామపక్షాలకు ఇది మంచి ఆయుధంలా మారిపోయింది. అధికార పార్టీ అరాచకాలకు ఇదిగో సాక్ష్యం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఇలాంటి వాటికి మంత్రి ఉషాశ్రీ చరణ్ భయపడేది లేదంటూ ప్రతిపక్షాలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఒక బీసీ మహిళ మంత్రి అవడం టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని..
అందుకే నాపై ఇలాంటి వీడియోలు తయారు చేశారంటూ కామెంట్ చేశారు. అంతే కాదు వీడియోలు మార్ఫింగ్ చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని నన్ను పావుగా మార్చారని విరుచుకుపడ్డారు. కానీ కళ్యాణదుర్గం టీడీపీ నేతలు మాత్రం ఇది మార్ఫింగ్ అయితే.. అదే మాట మీద నిలబడాలని.. దేవుని వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో మంత్రి చేసే కుట్రలు అందరికీ తెలుసునని.. గతంలో కూడా క్షుద్ర పూజల తరహా వంటివి చేశారంటూ ఇంకో కొత్త ఆరోపణ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బియ్యం చల్లిన వీడియోలు కూడా తెప్పిస్తున్నామంటూ టీడీపీ నేతలు అంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఏపీలో ప్రలోభాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరుగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో మంత్రి ఉషశ్రీ చరణ్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తున్న విషయంపై డిస్కషన్ జరుగుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. పార్టీ నాయకులు, అనుచరులతో మంత్రి ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియోలో.. ఒక్కో పోలింగ్ స్టేషన్ లో ఎన్ని ఓట్లు, ఎంత ఇచ్చారంటూ చర్చ జరిగినట్లుగా ఉంది. కాగా, సొంత పార్టీ నేతలే వీడియోని బయటకు పంపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వీడియో ఆధారంగా విపక్షాలు మంత్రి ఉషశ్రీ చరణ్ ను టార్గెట్ చేశాయి. ఉషశ్రీచరణ్ పై కల్యాణదుర్గం ఆర్డీవోకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశాయి. కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్.. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న జాబితా పరిశీలిస్తూ సమీక్ష నిర్వహించినట్లుగా ఆ వీడియో ఉండటం వివాదానికి దారితీసింది. మంత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని టీడీపీ నేతలు అస్త్రంగా మలుచుకుని మంత్రిపై దాడికి దిగారు. కల్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు వెంటనే కల్యాణదుర్గం ఆర్డీవో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దీనిపై ఫిర్యాదు చేశారు.
వీడియో ఆధారంగా మంత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఉషశ్రీ చరణ్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో తాను ఉషశ్రీచరణ్కు అప్పుగా ఇచ్చానని.. ప్రభావతి చెబుతున్నారు.. గత ఎన్నికల సమయంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉష శ్రీ చరణ్కు తాను రూ.1.56 కోట్లు అప్పుగా ఇచ్చానని.. అందులో కోటి రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చారన్నారు. మిగిలిన సొమ్ము అడిగినందుకు ఎమ్మెల్యే తన అనుచరులను పురమాయించి దాడులు చేయిస్తోందని ప్రభావతి ఆరోపించారు. ఉదయం ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వెళ్లి కౌన్సిలర్ ప్రభావతి నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించగా అక్కడికి చేరుకున్న పోలీసులు వైసీపీ నేతలు సర్దిచెప్పి అక్కడి నుంచి వెనక్కి పంపారు. కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన తమపై ఎమ్మెల్యే అనుచరులు కొందరు.. తన తమ్ముడు భర్త శ్రీకాంత్రెడ్డిపై దాడి చేయించేందుకు ప్రయత్నించిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి అయిన రోజు నుంచి ఉషాశ్రీ చరణ్ ని ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది.
తాజా వివాదం ఎంత దూరం తీసుకెళ్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది..