ఇటీవల కాలంలో దేవుళ్లు, పురాణ కథలు, గిరిజన సంప్రదాయాలను నేపథ్యంగా తీసుకొని ఇండస్ బ్యాటిల్ రాయల్ లాంటి వీడియో గేమ్‌లను రూపొందిస్తున్నారు.. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ స్క్రీన్‌లపై భారత్ ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ఒక వీడియో కనిపించడం చర్చనీయాంశంగా మారింది..
ఆధ్యాత్మిక చరిత్ర, వాస్తుకళా వైభవానికి సైన్స్ ఫిక్షన్ హంగులు అద్దే ఫిలాసఫీనే ఇండో ఫ్యూచరిజం.. ఇంతకూ ఇది ఎలా మొదలైంది…? భారత్ ఇలా మారొచ్చనే ఊహాగానాలతో సాగే కొత్త పంథానా..?
ఇండస్ బ్యాటిల్ రాయల్ లాంటి వీడియో గేమ్‌లతో పాటు సైన్స్ ఫిక్షన్, మ్యూజిక్‌లలో ఇటీవల కాలంలో దేవుళ్లు, పురాణ కథలు, గిరిజన సంప్రదాయాలను నేపథ్యంగా తీసుకోవడం కనిపిస్తోంది. 2022లో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ స్క్రీన్‌లపై భారత్ ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ఒక వీడియో కనిపించింది. ఒక దృశ్యంలో వినాయకుడు యుద్ధానికి సిద్ధమైన యోధుడిగా కనిపించారు.
మరోచోట మొఘల్ చక్రవర్తుల పాలనా కాలానికి ప్రతీకలుగా చెప్పుకునే మినార్ ను బంగారం, లేజర్ తళుకులతో చూపించారు. ఇవన్నీ ఇండస్ బ్యాటిల్ రాయల్ వీడియోగేమ్ ట్రైలర్‌లో కనిపించిన దృశ్యాలు. సింధూ నాగరికత నేపథ్యంలో అంతరిక్షంలో తిరుగుతున్నట్లుగా అనుభూతినిచ్చే గేమ్ ఇది.
ప్రపంచ పురాతన పట్టణ నాగరికతల్లో ఒకటైన ‘‘సింధూ’’ క్రీ.పూ.3000లలో భారత ఉపఖండంలో వెలసింది..
- భారత ఆధ్యాత్మిక చరిత్ర, వాస్తుకళా వైభవానికి సైన్స్ ఫిక్షన్ హంగులు అద్దే ఫిలాసఫీని ఇండో ఫ్యూచరిజంగా పిలుస్తున్నారు..
భవిష్యత్ లో భారత్ ఇలా మారొచ్చనే ఊహాగానాలతో సాగే కొత్త పంథా ఇది. ఇండస్ బ్యాటల్ రాయల్ ఈ కోవలోకే వస్తుంది. ఇటు సైన్స్ ఫిక్షన్ అటు సంగీతం లేదా కళలు ఇలా ఏ మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ… ఈ భవిష్యవాణిలో భారత ఆధ్యాత్మిక చరిత్ర, సంప్రదాయాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇవి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను సంపాదించుకుంటున్నాయి.
దీనికి అధునాతన టెక్నాలజీ, వినసొంపైన సంగీతం, అన్ని వర్గాలకూ ప్రాధాన్యమిచ్చేలా జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి కారణంగా చెప్పుకోవచ్చు.
సింధూ నాగరికతను ఆధారంగా చేసుకొని అంతరిక్షంలో మరో గ్రహం మీదకు వెళ్లే క్రమంలో చాలా మంది దేవుళ్లను ఈ వీడియో గేమ్‌లో చూడొచ్చు. ఇక్కడ ధైర్యానికి ప్రతీకగా భావించే జటాయువు కూడా కనిపిస్తుంది. దీనికి ఫీనిక్స్ రెక్కలు అతికించడం అదనపు హంగుగా చెప్పుకోవాలి. ‘‘ఇండోఫ్యూచరిజంతో మనిషి మెదడు కొత్త లోకంలోకి వెళ్తుంది.
అది పూర్తిగా భారత్ సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రపపంచం’’అని ఇండస్ బ్యాటిల్ రాయల్ గేమ్ వెనకున్న ‘‘సూపర్ గేమింగ్’’ కంపెనీ వ్యవస్థాపకుడు రాబీ జాన్ తెలిపారు. ఇండోఫ్యూచరిజం అనేది కొత్తది కాదు. అయితే, నేడు ఇది ఎక్కువ మందికి చేరువవుతోంది. భారత ఆధ్యాత్మికత, జానపదాలు, గిరిజన సంప్రదాయాలను ఆధారంగా చేసుకొని వస్తున్న ఆల్టర్నేట్ రియాలిటీలు నేడు ఎక్కువ అవుతున్నాయి. ఇవి పశ్చిమ దేశాల భవిష్యత్ విజన్లకు సవాల్ విసురుతున్నాయి.
‘‘ప్రస్తుతం కనిపిస్తున్న భవిష్యత్ ఊహాగానాలను మనం యూరప్ కళ్లతోనే ఎక్కువగా చూస్తున్నాం’’అని లండన్‌కు చెందిన జాజ్ మ్యుజీషియన్ సారథి కొన్వర్ వెల్లడించారు.. తన కొత్త ఆల్బమ్ ‘కలక్’ను ఇండోఫ్యూచరిస్ట్ ప్రతీకగా ఆయన తెలిపారు.. ‘ఆఫ్రోఫ్యూచరిజం తరహాలో ఇండోఫ్యూచరిజం కూడా భవిష్యత్‌పై చర్చను దక్షణార్ధ గోళానికి చేరువచేస్తోంది’’అని కొన్వర్ వివరించారు..
నాన్-వెస్టర్న్ ఫ్యూచరిజాలలో గల్ఫ్ ఫ్యూచరిజం, సైనో ఫ్యూచరిజం, ఇండైజీనియస్ ఫ్యూచరిజంతో పాటు ఆఫ్రోఫ్యూచరిజం కూడా ఉంది. వీటికి ఆఫ్రో ఫ్యూచరిజంతో తొలి అడుగులు పడ్డాయని చెప్పుకోవచ్చు. వీటిలో ఒక్కోటి ఒక్కో ఫిలాసఫీ ఆధారంగా ముందుకు వచ్చినవే. అయితే, వీటన్నింటిలో కనిపించేది ఏమిటంటే…తమ దేశీయ కళ్లద్దాలతో భవిష్యత్ ను చూడటం.
ఉదాహరణకు ఇండో ఫ్యూచరిజాన్ని తీసుకోండి. ఇక్కడ ఆల్టర్నేట్ రియాలటీలకు దేశీ సొబగులు అద్దుతారు. భారత ఆధ్యాత్మిక కాల చక్రాలకు కూడా వీటిలో చోటుంది. వీటి ఆధారంగానే కొన్వర్ స్వరాలను కూడా కూర్చారు.‘‘దక్షిణాసియాలో గతం, ప్రస్తుతం, భవిష్యత్‌లను ఒక చక్రంగా చూస్తుంటారు. ఇక్కడ సమయం అనేది ఒక గీతలా ఉండదు. ఇది ఒక చక్రం లాంటిది’’అని కొన్వర్ తెలిపారు..
కొన్వర్ తన సంగీతాన్ని కూడా ‘‘సర్క్యులర్ టెక్నిక్’’ కాంపోజిషన్‌గా చెబుతున్నారు. వీటిలో ఆరంభం, ముగింపులకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. కలక్ ఆల్బమ్‌లో ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
సాధారణంగా సంగీతంలో నోట్‌లు ఎడమ నుంచి కుడికి, పై నుంచి కిందకు ఉంటాయి. కానీ, వీటి స్థానంలో సర్క్యులర్ నొటేషన్ పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారు. నిజానికి కలక్ అనే పేరులోనే కొత్తదనం కనిపిస్తుంది. దీన్ని ఇంగ్లిష్‌లో ‘‘కేఏఎల్ఏకే’’గా రాస్తారు. దీన్ని ఎటు నుంచి చూసినా అదే అక్షరాల వరుస కనిపిస్తుంది. భారత్ లోని కొన్ని జానపదాలను కూడా గాయకులు ఇలా వలయాకారంలో కూర్చొని పాడతారు. తనపై జానపదాల ప్రభావం కూడా చాలా ఉందని కొన్వర్ చెబుతున్నారు.
- ఇండోఫ్యూచరిజం ఇలా మొదలైందని చెప్పడం చాలా కష్టం…
కొంత మంది మాత్రం రబీంద్రనాథ్ ఠాగూర్ లాంటి ఆధునిక వాదులతో 1800 చివర్లో లేదా 1900 ఆరంభంలో ఇది మొదలైందని చెబుతారు.
బెంగాల్ లో కొత్త విద్యావిధానానికి ఠాగూర్ నాంది పలికారు.. ఠాగూర్ మొదలుపెట్టిన శాంతినికేతన్.. దేశీయ పరిజ్ఞానం, ప్రకృతి, కళలు, ఆసియా విశ్వాసాలకు మేళవింపుగా చెప్పుకోవాలి. బ్రిటిష్ వలసవాద మోడల్‌కు పోటీగా ఆయన కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. భారత్ లో కొత్తతరం ఆధునిక వాదానికి ఇది బాటలు పరిచింది. ఆనాటి కాల్పనిక కథల్లోనూ ఇండోఫ్యూచరిజం కనిపిస్తుంది. ఉదాహరణకు రచయిత, రాజకీయ కార్యకర్త బేగమ్ రుకైయా కథలను చూడండి.
1905లో ఆమె రాసిన ‘‘సుల్తానా డ్రీమ్’’లో మహిళలే పాలించే సమాజం కనిపిస్తుంది… ఇక్కడ సోలార్ ఓవెన్లు, ఎగిరే కార్లు, మంచినీరు అందించే క్లౌడ్ కండెన్షర్లు కూడా కనిపిస్తాయి. భర్తల మృతదేహాలతో పాటు భార్యలను సజీవ దహనం చేసే కాలంలోనే ఆమె ఇలాంటి కథను రాశారు. దీన్ని భారత్‌తో తొలి ఫెమినిస్టు సైన్స్ ఫిక్షన్‌గా చెప్పుకోవచ్చు.
6వాయిస్: నల్లజాతీయులను బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా పుట్టిన అఫ్రోఫ్యూచరిజం తరహాలోనే ఇండోఫ్యూచరిజం కూడా నేటి సమాజంలో వేళ్లూనుకున్న ఎన్నో సామాజిక – రాజకీయ సమస్యలకు పరిష్కారాలు వెతుకుతోంది.
ఆ సమస్యలు నాటి సమాజంలో భరించలేని స్థాయికి పెరిగినట్లు అటు ఠాగూర్, ఇటు బేగం రచనల్లో మనం చూడొచ్చు. నేటి ఆధునిక కళాకారుల విషయానికి వస్తే, అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో వారు సొంత శైలులతో ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది.
గేమింగ్ లో భారత్ ప్రాతినిధ్యాన్ని పెంచడమే లక్ష్యంగా తాము 2016 నుంచి కృషి చేస్తున్నట్లు మీడియా కంపెనీ అంతరిక్ష స్టూడియో తెలిపింది.
‘‘భారత్ కు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదు. ఒక్కోసారి భారత సంస్కృతీ సంప్రదాయాలను తప్పుదోవ పట్టించేలా చూపిస్తున్నారు’’అని అంతరిక్ష స్టూడియో వ్యవస్థాపకుడు అవినాశ్ కుమార్ అన్నారు. వీడియో గేమ్స్ టాంబ్ రైడర్, అసాసిన్స్ క్రీడ్ లాంటి వాటిలో కొన్ని చాప్టర్లను భారత్ నేపథ్యంలో సిద్ధం చేశారు.
‘‘అయితే, ఇక్కడ దురదృష్టకర విషయం ఏమిటంటే.. వీటిని భారత్ నేపథ్యంలో సిద్ధం చేసినప్పటికీ, చర్చ మొత్తం మూసధోరణులపైనే జరిగింది’’అని అవినాశ్ అభిప్రాయపడ్డారు.. అన్నారు.
- భారత్ లో కనిపించే సాధారణ సైన్స్ ఫిక్షన్, ఇండో ఫ్యూచరిజం సైన్స్ ఫిక్షన్‌ల మధ్య తేడా ఉంది..
మొదటి దాంట్లో పశ్చిమ దేశాల ఫ్యూచరిజానికి భారత కథలను మాత్రమే కలుపుతారు. ఇక్కడ ఎగిరేకార్లు, ప్రజలపై భారీగా నిఘా, ఆకాశహర్మ్యాలు కనిపిస్తాయి. ఉదాహరణగా భూమి విధ్వంసం తర్వాత దేవతల చర్చల చుట్టూ తిరిగే కామిక్ బుక్ ‘‘3392 ఏడీ’’, బాలీవుడ్ ఏలియన్ సినిమాలను చెప్పుకోవచ్చు.
ఇండో ఫ్యూచరిజంలో పశ్చిమ దేశాల ఛాయలు మనకు కనిపించవు. ఉదాహరణకు ఇండస్ బ్యాటల్ రాయల్ చూడండి. దీని కోసం పనిచేసే సిబ్బందికి పశ్చిమ దేశాల ధోరణులతో భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను కలుపుతూ వెళ్తే జరిగే నష్టాలు తెలుసు.
‘‘అందుకే ప్రస్తుతమున్న మోడల్స్‌ను ఉపయోగించకుండా, ఇక్కడ మొత్తంగా ఒక నాగరికతనే సిద్ధం చేశాం’’అని రాబీ చెప్పారు. పశ్చిమ దేశాల భవిష్యత్ విజన్లతో దక్షినార్ధ గోళంలో కొన్ని వివక్షలు కూడా కలిసిపోయే ముప్పుందని నాన్-వెస్టర్న్ ఫ్యూచరిజంపై పరిశోధన చేపట్టన రాహెల్ అయిమా తెలిపారు..
ఉదాహరణకు టెక్నో-ఓరియెంటలిజాన్ని తీసుకోండి. ఇది 1980లలో హాలీవుడ్‌లో పుట్టింది. జపాన్ ఆర్థిక వ్యవస్థ నానాటికీ శక్తిమంతం అవుతున్న నేపథ్యంలో ఉత్తర ఆసియాపై అమెరికాలో గూడుకట్టుకున్న కొన్ని భయాలు దీనిలో కనిపిస్తాయి. మరోవైపు ఇండోఫ్యూచరిజంపై వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతోంది.
ఇండో ఫ్యూచరిజంలో హిందూ ఆధ్యాత్మికత ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే కల్చరల్ థీయరిస్టులు దక్షిణ ఆసియా ఫ్యూచరిజం లాంటి పదాలను వాడాలను అంటున్నారు. అప్పుడు ఇటు బంగ్లాదేశ్,పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్‌లను కూడా కలుపుకొని వెళ్లొచ్చు. ఇండోఫ్యూచరిజంలో కొన్ని విజన్‌లు చాలా నిరాశావాద భవిష్యత్‌ను చూపిస్తున్నాయి. బహుశా నేటి రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా సిద్ధం చేస్తూ ఉండొచ్చు.
దీనికి 2017లో విడుదలైన లీలా పుస్తకాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీనిలో మతపరమైన ఛాందస వాదం, వాయు కాలుష్యం ప్రధాన అంశాలుగా కనిపిస్తాయి. నిజానికి ఇవి రెండూ నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు.
వాతావరణ మార్పులు, రాజకీయ ఘర్షణా వాతావరణం నేపథ్యంలో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఇండోఫ్యూచరిజం మరింత అభివృద్ధి
చెందుతుంది. దీనిలో చాలా పాజిటివిటీ కనిపిస్తుంది. అయితే, సమస్యలను ఎత్తి చూపించేందుకు ఇది వెనకాడదు. సమాజంలో మంచి మార్పుకు నాంది పలకడంలోనూ ఇది ముందుంటుంది.
ఇండో ఫ్యూచరిజంలో హిందూ ఆధ్యాత్మికత ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే కల్చరల్ థీయరిస్టులు దక్షిణ ఆసియా ఫ్యూచరిజం లాంటి పదాలను వాడాలని అంటున్నారు. ఇండోఫ్యూచరిజంలో కొన్ని విజన్‌లు చాలా నిరాశావాద భవిష్యత్‌ను చూపిస్తున్నాయి.