తండ్రికి కొడుకు పుట్టినప్పుడు కంటే.. ఆ కొడుకు ప్రయోజకుడు అయినప్పుడే మిక్కిలి సంతోషం. కరెక్ట్ గా ఈ మాదిరిగానే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. అమెరికన్ పాపులర్ టీవీ షోలో రామ్ చరణ్ పాల్గొనడంతో ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు.
గుడ్ మార్నింగ్ అమెరికా అనే యూఎస్ టెలివిజన్ షోలో చరణ్ పాల్గొనడంతో మెగాస్టార్ తన ట్విటర్ వేదికగా పోస్టును షేర్ చేశారు. తన సంతోషాన్ని మాటల్లో చెప్పులేకపోతున్నట్లు పోస్ట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు భారతీయ చలన చిత్రసీమకు ఇది గర్వపడే క్షణమంటూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మేనియా అంతా ఇంతా కాదు. మూవీ భారీ కలెక్షన్స్ తో పాటు, ప్రశంసలు, ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు రేసులో నిలిచింది.
ఈ చిత్రంలోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయింది. ఈ నేపథ్యంలో త్రిపుల్ ఆర్ హీరో రామ్ చరణ్ తేజ్ అమెరికా వెళ్లారు. జీఎంఏ (గుడ్ మార్నింగ్ అమెరికా) టెలివిజన్ షోలో పాల్గొన్నారు. రామ్ చరణ్ కు ఇంతటి క్రేజ్ రావడంతో చిరు ఆనందానికి అవదులు లేకుండా పోయింది.
డైరెక్టర్ రాజమౌళి, రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. చిరు ట్విట్టర్ లో ఈ విధంగా పోస్ట్ చేశారు. ‘రామ్ చరణ్ ప్రఖ్యాత గుడ్ మార్నింగ్ అమెరికాలో పాల్గొన్నాడు. ఇది తెలుగు, భారతీయ సినిమాకి గర్వకారణం. దార్శనికుడైన రాజమౌళి మెదడులో పుట్టిన ఒక ఉద్వేగ భరితమైన ఆలోచనా శక్తి ప్రపంచాన్ని ఎలా ఆవరించిందో చూస్తే ఆశ్చర్యంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింటా హల్ చల్ చేస్తుంది. మెగా ఫ్యామిలీ అభిమానులు చిరు ట్విట్ కు రీ ట్విట్ చేస్తూ అభినంధనలు తెలుపుతున్నారు.