HomePoliticsతెలంగాణ కమలంలో ఓ చర్చ..సీఎం ఎవరు అన్నదే హాట్ టాపిక్..!

తెలంగాణ కమలంలో ఓ చర్చ..సీఎం ఎవరు అన్నదే హాట్ టాపిక్..!

ఓ చర్చ .. రచ్చ చేస్తోందట.. అదేంటంటే.. వచ్చే ఎన్నికల్లో అధికారం పక్కా అని, గెలిస్తే, సీఎం ఎవరు అన్నదే .. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట.
దీంతో ఆలూ లేదు .. చూలూ లేదు .. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుందని టాక్ వినిపిస్తోందట.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జోష్ మీద ఉంది. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కేసీఆర్ చేసిన రాజకీయమో.. బీజేపీ దశ తిరిగిందో కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 100కుపైగా స్థానాల్లో డిపాజిట్ కోల్పోయి.. ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటే గెల్చుకున్న బీజేపీ ఇప్పుడు హాట్ ఫేవరేట్లలో ఒకటిగా మారింది. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆ పార్టీ ఫేట్ మారిపోయింది.

అనుకోకుండా వచ్చినవో.. కేసీఆర్ అనుకుని తెచ్చినవో కానీ వరుసగా వచ్చిన ఉపఎన్నికలు.. గ్రేటర్ ఎన్నికలు ఆ పార్టీకి ఉత్సాహం తెచ్చి పెట్టాయి. దాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. బీజేపీలో అగ్రనేతలకు కొదవలేదు. రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇక లక్ష్మణ్ జాతీయ స్థాయి నాయకుడయ్యారు. ఆయన ఏకంగా పార్లమెంటరీ బోర్డు మెంబరే అయ్యారు.

కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నారు. డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, వివేక్ , ఇంద్రసేనారెడ్డి, రామచంద్రరావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. ఇలా చాలా మంది ముఖ్య నేతలు రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. వారిలో నియోజకవర్గాల్లో పట్టు ఉన్నవాళ్లు తక్కువే.. కానీ మంచి గుర్తింపు ఉంది. వీరందరూ రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. టీఆర్ఎస్‌ను ఢీకొట్టే విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఏ రకంగా చూసినా తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం చాలా పటిష్టంగా ఉంది.

అందుకే ఆ పార్టీ అధికారం అందుకునే రేస్‌లో ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏమిటి ? నియోజవకర్గాల్లో బలమైన అభ్యర్థులు ఎంత మంది ? అన్నదే చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర నాయకులు.. ఓ పది..పదిహేను నియోజకవర్గాల్లో బలంగా ఉంటారు. మరి మిగతా నియోజకవర్గాల్లో ఎవరు పార్టీ బాధ్యత తీసుకుంటారు? ఇదే ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఇటీవలి కాలంలో బీజేపీకి చాలా చోట్ల నాయకులు కలిసి వచ్చారు.

క్యాడర్ కూడా పెరిగింది. కానీ నియోజకవర్గం మొత్తాన్ని నడిపించే నాయకుల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. తాము పోటీ చేస్తామంటే.. తాము పోటీ చేస్తామని రేసులోకి నియోజకవర్గానికి నలుగురైదుగురు పోటీ పడుతున్నారు కానీ వారెవరూ పార్టీ బలానికి తమ బలం యాడ్ చేసి సీటును గెలిపించుకువస్తామనే వాళ్లు కాదు. పూర్తిగా పార్టీ మీద ఆదారపడేవారే. అక్కడే అసలు సమస్య వస్తోంది. గెలుపు గుర్రాల కోసం ఎదురు చూపులు చూడక తప్పని పరిస్థితి నెలకొంది.

ఈటల రాజేందర్ నేతృత్వంలో చేరికల కమిటీని ఏర్పాటు చేశారు..

కానీ ఆ కమిటీ ఏం చేస్తుందో కానీ బండి సంజయ్ నేతృత్వంలో ఒకరిద్దరు ఢిల్లీ వెళ్లి కండువా కప్పుకుని వస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్ కూడా అంతే. కారణం ఏమైనా కావొచ్చు కానీ..పార్టీలో నియోజకవర్గ స్థాయి నేతలు మాత్రం చేరడం లేదు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

చర్చలు జరిపి.. సుముఖత వ్యక్తం చేసిన తర్వాత కూడా కొందరు వెనుకడుగు వేస్తున్నారు. వారికి సరైన భరోసా లభించకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇదిలాఉంటే, తెలంగాణలో ఎలాగైనా అధికారం చేపట్టాలని కలలుకంటున్న బీజేపీ అందుకోసం చేయని ప్రయత్నం లేదు. ఎమ్మెల్యేల‌ కొనుగోలుకు ప్రయత్నాలు, కాంట్రాక్టుల ఆశ చూపి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం, మసీదులను తవ్వుదాం శవమొస్తే మీకు, శివుడొస్తే మాకు’ అంటూ రెచ్చగొట్టి మత ప్రాతిపదికన ప్రజలను చీలడానికి ప్రయత్నించడం, చిన్న ఎన్నిక జరిగినా జాతీయ స్థాయి నాయకులతో సహా బీజేపీ పెద్ద, చిన్న నాయకులంతా తెలంగాణలో దిగిపోవడం .. ఇలా ఒకటేమిటి అధికారం కోసం చేయని పనంటూ లేదు.

ఇంత చేసినా నాగార్జున సాగర్, మునుగోడు ఎమ్మెల్యే ఎన్నికల్లో, తాజాగా నిన్న జరిగిన సిరిసిల్లా సెస్ ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన బీజేపీ ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు మాత్రం వదులుకోలేదు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే సీఎం ఎవరు అనే అంశంపై ఎక్కడా సందేహం లేదు. కానీ బీజేపీ, కాంగ్రెస్ లో ఏ పార్టీ గెలిచినా సీఎం ఎవరనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఆ మాటకొస్తే క్లారిటీ వస్తేనే ఆ రెండు పార్టీల్లో అత్యంత ప్రమాదం.

అందుకే అధిష్టానాలు కూడా ఊహాగానాలకే మద్దతిస్తుంటాయి. అయితే తాజాగా బీజేపీలో సీఎం కుర్చీకోసం పేచీ మొదలైందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీలో ముఖ్యమంత్రి సీటుపై కన్నేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరో ఇద్దరు నేతలు తమ ప్రయత్నాల్లో తామున్నారు. బండి సంజయ్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆయన అనుచరులు సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నారు.

ఇతర నేతల అనుచరులు కూడా ముఖ్యమంత్రి అయ్యే అర్హత తమ నాయ‌కునికి మాత్రమే ఉందని వాదిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ ఇప్పటికే మూడుగా చీలిపోయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం మరో ఇద్దరు నేతలు సైతం రంగంలోకి దిగారు.

గతంలో రాష్ట్ర మంత్రులుగా చేసిన అనుభవం ఉన్న తమ నాయకులే ముఖ్యమంత్రి పదవికి అసలైన అర్హులు అని వారి అనుచరులు ప్రచారం మొదలు పెట్టారు.

పదేళ్ళపాటు మంత్రిగా పని చేసిన తనకే ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించడం, ప్రజలు కోరుకుంటే తప్పకుండా సీఎం అవుతానని ఈటల రాజేందర్ కామెంట్ చేయడం బీజేపీ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. పైగా ఈ మధ్య జరిగిన ఓ సర్వే లో ఈటల నే సీఎం కావాలని ప్రజలు స్పష్టం చేశారంటూ ఆయన అనుచరులు ప్రచారం మొదలు పెట్టారు.

ఇప్పటికే ముగ్గురు నాయకులు సీఎం పదవి కోసం పోటీ పడుతుండగా మరో ఇద్దరు వచ్చి పోటీలో చేరడమే కాకుండా ఆ విషయంపై బహిరంగంగానే మాట్లాడటంపై బీజేపీలో ఆసక్తికర చర్చనడుస్తోంది. అయితే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 90 స్థానాల్లో బీజేపీకి సరైన అభ్యర్థులే లేరు. గ్రామస్థాయిలో కార్యకర్తలు లేరు. ఇతర పార్టీల్లో ఉన్న నాయకులను చేర్చుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి ఆ పార్టీది.

ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకే పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని పాత కాపులు వాపోతున్నారు. అసలు ఎన్ని సీట్లు గెలుస్తారనే అంశంపై స్పష్టత లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే నాయకులను బట్టి గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆ పార్టీ జాతీయ నాయకత్వమే నిర్ణయిస్తుందని అగ్రనేతలు బాహాటంగా చెబుతున్నప్పటికీ.. సీఎం కుర్చీ రేసులో ముందుకెళ్లేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎంగా బండి సంజయ్ వైపే ఆ పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతుందని కొందరంటుంటే.. జితేందర్ రెడ్డి బండి సంజయ్ వర్గంలో ఉన్నానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు కానీ.. ఆ పార్టీలో మాత్రం సీఎం కుర్చీ కోసం ఇద్దరు కీలక నేతల మధ్య పోటీ తీవ్రంగా నెలకొన్నట్టు కనిపిస్తోంది.

ఎలక్లన్లకు ముందే బీజేపీ .. సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుంది. ఇప్పటిదాకా అన్ని రాష్ట్రాల్లో ఇదే చేసింది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప అన్ని రాష్ట్రాల్లో ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించారు. తెలంగాణలో ఇలాగే ముందే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందా? ప్రకటిస్తే ఎవరి పేరు ఎంచుకుంటుంది? అని పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది. అయితే మూడు ఎమ్మెల్యే స్థానాలున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఏకంగా అధికార పార్టీగా మారుతుందనుకోవడం అత్యాశేనని, ఇప్పుడీ స్వయం ప్రకటిత సీఎం అభ్యర్థుల లొల్లితో ఎన్నికల ముందు అంతర్గత కుమ్ములాటలు ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరి సీఎం లొల్లి కమలంలో కుమ్ములాటలకు దారి తీస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Must Read

spot_img