Homeఅంతర్జాతీయంకాలిఫోర్నియాలోని జైలులో ఓ జైలర్ 23 మంది మహిళలపై అత్యాచారానికి తెగబడ్డాడు

కాలిఫోర్నియాలోని జైలులో ఓ జైలర్ 23 మంది మహిళలపై అత్యాచారానికి తెగబడ్డాడు

జైలు అధికారుల ఈ మాదిరి ప్రవర్తన వల్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీస్తుందని జైళ్ల విభాగం కార్యదర్శి ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే అంతర్గత విచారణ తరువాత సదరు జైలర్ పై చర్యలు మొదలుపెట్టామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

జైలు అంటే దుష్ప్రవర్తనకు ఓ దిద్దుబాటు కేంద్రం.. కానీ అక్కడ ఉన్న ఓ అధికారి ఖైదీలను సరిదిద్దాల్సింది పోయి తానే తప్పుడు పనులకు పాల్పడ్డాడు. కాలిఫోర్నియాలోని అతిపెద్ద మహిళా జైలులో మాజీ కరెక్షనల్ ఆఫీసర్ కనీసం 22 మంది ఖైదీలపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయని రాష్ట్ర జైలు విభాగం అధికారులు తెలిపారు. సెంట్రల్ కాలిఫోర్నియా ఉమెన్స్ ఫెసిలిటీలో మాజీ అధికారి గ్రెగొరీ రోడ్రిగ్జ్‌పై అంతర్గత విచారణ ఫలితాలను మడేరా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయానికి అందజేసినట్టు కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్స్ అండ్ రిహాబిలిటేషన్ తెలిపింది. రోడ్రిగ్జ్‌పై ఇంకా అభియోగాలు నమోదు కాలేదని కరెక్షనల్ విభాగం ప్రతినిధి డానా సిమాస్ తెలిపారు.

జైలు అధికారుల ఇలాంటి ప్రవర్తన ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని జైళ్ల విభాగం కార్యదర్శి జెఫ్ మాకొంబర్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ‘చట్టాన్ని పాటించని ఏ ఉద్యోగిని అయినా విడిచిపెట్టబోమని, ఇంకా బాధితులను అన్వేషించడానికి మేం ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నాం..’ అని మాకోంబర్ చెప్పారు. సెంట్రల్ కాలిఫోర్నియా ఉమెన్స్ ఫెసిలిటీలో ఖైదీలపై రోడ్రిగ్జ్ లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు అధికారులు తెలుసుకున్న తర్వాత జూలైలో దర్యాప్తు ప్రారంభించినట్లు డిపార్ట్‌మెంట్ తెలిపింది. శాన్ ఫ్రాన్సిస్కోకు ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌచిల్లా అనే చిన్న నగరంలో ఈ జైలు ఉంది. విచారణ గురించి అతడిని సంప్రదించిన తర్వాత రోడ్రిగ్జ్ ఆగస్టులో పదవీ విరమణ చేసినట్లు జైళ్ల విభాగం తెలిపింది.

కాలిఫోర్నియాలోని జైళ్లలో జైలు అధికారుల దుర్వినియోగానికి సంబంధించిన తాజా ఆరోపణ ఇది. ప్రిజన్ రేప్ ఎలిమినేషన్ యాక్ట్ అనే 2003 నాటి ఫెడరల్ చట్టం ఖైదీలపై లైంగిక వేధింపులను ఉపేక్షించలేని విధంగా ‘జీరో-టాలరెన్స్’ విధానాన్ని రూపొందించింది. కానీ 2018లో సెంట్రల్ కాలిఫోర్నియా ఉమెన్స్ ఫెసిలిటీలో దశాబ్దానికి పైగా పనిచేసిన కరెక్షనల్ అధికారి లైంగిక దుష్ప్రవర్తన కారణంగా వేటుకు గురయ్యారు. కాగా గతంలో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని మహిళా జైలులో పనిచేసిన ఉన్నత స్థాయి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ అధికారి.. ఖైదీలపై దాడి చేశారనే ఆరోపణల తర్వాత కూడా పదే పదే పదోన్నతి పొందినట్లు అసోసియేటెడ్ ప్రెస్ పరిశోధనలో తేలింది. మహిళల జైలులో జైలు అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు మరో పరిశోధనలో తేలింది.

రోడ్రిగ్జ్ ఖైదీలపై ఎలాంటి లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డారో రాష్ట్ర జైళ్ల విభాగం సంబంధిత ప్రకటనలో ప్రస్తావించలేదు.

కాగా న్యాయవాది రాబర్ట్ చాల్ఫాంట్ సంబంధిత లైంగిక దాడులపై రెండు పౌర హక్కుల వ్యాజ్యాలు దాఖలు చేశారు. మే నెలలో రోడ్రిగ్జ్ ఓరల్ సెక్స్ చేయమని ఒకరిని బలవంతం చేసి, అత్యాచారం చేశాడని ఈ వ్యాజ్యాలలో ఒకటి ఆరోపించింది. ఇక మరొకరిపై లైంగికంగా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం, తాకడం చేశాడని, చివరికి జూన్‌లో ఆమెపై అత్యాచారం చేశాడని మరొకటి ఆరోపించింది. ఈ రెండు వ్యాజ్యాలు జైళ్ల శాఖ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయి. ఖైదీలపై లైంగిక దాడులను నిరోధించలేకపోయిందని ఆరోపించాయి. రెండు వ్యాజ్యాల్లో ఒకటి జైళ్ల శాఖను ప్రతివాదిగా చేర్చింది.

అయితే దీనిపై జిల్లా అటార్నీ కార్యాలయం తమ మెయిల్‌కు ఇంకా స్పందించలేదని అసోసియేట్ ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది. కాగా మడేరా కౌంటీ జిల్లా అటార్నీ సాలీ మొరెనొ మాత్రం అంతర్గత విచారణ నివేదిక గత వారం తమకు చేరిందని ధ్రువీకరించారు. దీనిని ఇంకా సమీక్షిస్తున్నట్టు చెప్పారు. అయితే కాలిఫోర్నియ రోడ్రిగ్స్ కేసు జైళ్లు వాటిలో ఉండే ఖైదీలు ఎదుర్కుంటున్న అనేక సమస్యల్ని ఎత్తి చూపింది. లోలోపలే జరిగిపోయే ఈ ఘోరాలు నేరాలను కట్టడి చేసే వ్యవస్థలను మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరోసారి జైళ్ల సంస్కరణల్లో మార్పులు చేర్పులు జరపాల్సిన అవసరం ఏర్పడిందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ అధికారుల దాష్టీకాన్ని ఎదిరించలేని ఖైదీలు ఇప్పుడు వారిపై ఆరోపణలు చేస్తున్నారు.

Must Read

spot_img