Homeజాతీయం2023-24 కేంద్ర బడ్జెట్ ...

2023-24 కేంద్ర బడ్జెట్ …

2023-24 కేంద్ర బడ్జెట్ .. వేతన జీవులకు ఊరట కలిగించిందన్న వాదనలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆదాయపన్ను విషయంలో పరిమితిని పెంచి, వీరి ఆశలకు మద్ధతు పలికింది. దీంతో వచ్చే ఎన్నికలే టార్గెట్ గా బడ్జెట్ ఉందన్న వాదనలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ దఫా బడ్జెట్ నిర్ణయాలేమిటో ..ఉద్యోగులకు ఊరట, మహిళలకు మద్ధతు, ఏడు అంశాలతో .. సమ్మిళిత అభివృద్ధి కీలకంగా కేంద్ర బడ్జెట్ రూపొందించారు. సామాజిక భద్రత, డిజిటల్ పేమెంట్లలో భారత్ దూకుడుగా ఉందని నిర్మలా సీతారామన్ చెబుతున్నారు. కోవిడ్-19, గ్రీన్ డెవలప్మెంట్.. సామాన్యుల సాధికారితకు కట్టుబడి ఉన్నామని నిర్మల స్పష్టం చేస్తున్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి డిజిటల్‌ పద్దును పార్లమెంట్‌కు సమర్పించారు. నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం వ‌రుస‌గా ఇది ఐదోసారి. వేతనజీవులు, మధ్యతరగతివర్గాలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆశ ఫలించింది. వ్యక్తిగత ఆదాయ పన్నుమినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతూ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ.7 – రూ.9 లక్షల వరకు 5 శాతం పన్ను, ఆదాయం రూ.30 లక్షలు దాటితే 30 శాతం పన్ను విధింపునకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే ఇది నూతన పన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనేది పూర్తిగా చెల్లింపుదారుడి ఐచ్ఛికం. ఎందులో ప్రయోజనం ఉంటుందనుకుంటే దానిని ఎంపిక చేసుకోవచ్చు. కాగా పన్ను మినహాయింపులకు సంబంధించి ఆర్థిక నిపుణుల అంచనాలు దాదాపు నిజమయ్యాయి.

రెండేళ్లక్రితం ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానంలో వేతన జీవులకు ఆకర్షించడమే లక్ష్యంగా స్లాబుల్లో మార్పులు జరగొచ్చునని మొదటి నుంచి విశ్లేషకులు చెబుతూ వచ్చారు. దాదాపు ఇప్పుడు అదే జరిగింది. ఇక రూ. 9 ల‌క్ష‌ల నుంచి రూ. 12 ల‌క్ష‌ల వ‌ర‌కు 15 శాతం ప‌న్ను. రూ. 12 నుంచి రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు 20 శాతం ప‌న్ను. రూ.15 ల‌క్ష‌లు దాటితే 30 శాతం ప‌న్ను చెల్లించాలి. చిరు వ్యాపారుల‌కు కూడా పాన్ కార్డు త‌ప్ప‌నిస‌రి. ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌కు కూడా పాన్ కార్డు త‌ప్ప‌నిసరి.

కేంద్ర బడ్జెట్‌లో ఏడు ప్రాథమ్యాలు ఉన్నాయన్నారు. సమ్మిళిత అభివృద్ధి, చిట్టచివరి వ్యక్తికి కూడా సత్ఫలితాలు అందడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల వృద్ధి, ప్రజల శక్తి, సామర్థ్యాలను వినియోగించుకోవడం, హరిత వృద్ధి, యువ శక్తిని ప్రోత్సహించడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం వంటివాటిపై దృష్టి సారించినట్లు తెలిపారు. వ్యవసాయం కోసం డిజిటల్ మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెటింగ్స దుపాయం, వ్యవసాయ స్టార్టప్స్‌కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు.

పత్తిసాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు. పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం. ఆత్మ నిర్బర్ భారత్ క్లీన్ పథకం, ఉద్యానవన పంటలకు చేయూత. చిరుదాన్యాల పంటలకు సహకారం. ఇందుకోసం ‘శ్రీఅన్న’ పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటల ప్రోత్సాహం వంటివాటిని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదిస్తున్నామని, వృద్ధి రేటు 7% గా అంచనా వేస్తున్నామని, ఇంత వృద్ధిరేటు ఉన్న ఆర్థిక వ్యవస్థ మనదేనని అన్నారు.

తొమ్మిదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపైంది. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాంమన్న నిర్మల .. కోవిడ్-19 సమయంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశామని, ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. 100 కోట్ల మందికి 220 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు అందించామని, భారత ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పయనిస్తోందని వ్యాఖ్యానించారు.గ్రీన్ డెవలప్మెంట్ దిశగా అనేక విధానాలురూపొందిస్తున్నామన్న నిర్మల సామాన్యుల సాధికారితకు ఈ బడ్జెట్ తోడ్పడుతుందని అన్నారు.

సామాజిక భద్రత, డిజిటల్ పేమెంట్లలో చక్కటి వృద్ధి సాధించామని, 2047నాటికి మన దేశానికి స్వాతంత్ర్యం లభించి వందేళ్లు పూర్తవుతుంది. ఆ విజన్ లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామని నిర్మల తెలిపారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్‌ డ్యూటీ 2.5శాతం తగ్గించింది. టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు భారీగా తగ్గనున్నాయి. మొబైల్స్, టీవీలు, కెమెరాల విడి భాగాల దిగుమ‌తుల‌పై క‌స్ట‌మ్స్ డ్యూటీ త‌గ్గింపు.

జౌళి మిన‌హా క‌స్ట‌మ్స్ డ్యూటీలు 21 నుంచి 13 శాతానికి త‌గ్గింపు. కిచెన్ చిమ్నీల‌పై క‌స్ట‌మ్స్ డ్యూటీ త‌గ్గింపు చేపడుతున్నామని ప్రకటించారు. ఇక మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ బచత్ పత్ర పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఇది వన్ టైమ్ చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇది రెండేళ్ళ కాలానికి అంటే 2025 వరకు అందుబాటులో ఉంటుంది. దీనిపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అవసరమైనపుడు పాక్షికంగా సొమ్మును ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు.

మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో పెట్టుబడి గరిష్ఠ పరిమితిని రెట్టింపు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.15 లక్షల వరకు గరిష్ఠంగా పొదుపు చేసుకునే అవకాశం ఉందని, దీనిని రూ.30 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజీ పథకాన్ని ప్రకటించారు. సంప్రదాయ వృత్తులు, చేతి వృత్తులవారికి సహాయపడటానికి ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. వీరు తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచుకోవడానికి, మరింత విస్తరించడానికి, జనబాహుళ్యానికి తమ ఉత్పత్తులను మరింత చేరువ చేయడానికి ఈ పథకం దోహదపడుతుంది.

సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగానికి అనుసంధానంగా ఈ పథకాన్ని ప్రతిపాదించినట్లు నిర్మల తెలిపారు. కృత్రిమ మేధాశక్తిని దేశం కోసం ఉపయోగించుకోవడం కోసం 3 కృత్రిమ మేధాశక్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్ల మూల ధన వ్యయాన్ని ప్రకటించారు. ప్రజలకు అవకాశాలను కల్పించి, వృద్ధిని ప్రోత్సహించడంపై ఈ బడ్జెట్‌లో దృష్టిపెట్టినట్లు తెలిపారు. సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, బలోపేతం, ఉద్యోగాల సృష్టిపై దృష్టిసారించినట్లు తెలిపారు. ఫైనాన్షియల్ సెక్టర్‌ను బలోపేతం చేయడం, టెక్నాలజీ చోదక, నాలెడ్జ్ బేస్డ్ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడమే తమ విజన్ అని తెలిపారు. జీడీపీలో ద్ర‌వ్యలోటు 5.9 శాతం ఉండే అవ‌కాశం. 2025-26 నాటికి ద్ర‌వ్య‌లోటు 4.5 శాతానికి ప‌రిమితం చేయాల‌ని ల‌క్ష్యంగా పేర్కొన్నారు.

కాలం చెల్లిన వాహ‌నాల తొల‌గింపు మా త‌క్ష‌ణ ప్రాధాన్యతగా పేర్కొన్నారు. నేష‌న‌ల్ హైడ్రోజ‌న్ గ్రీన్ మిష‌న్‌కు రూ. 19,700 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి రూ. 35 వేల కోట్లు. ఏడాదికి అర్బ‌న్ ఇన్‌ఫ్రా ఫండ్ రూ. 10 వేల కోట్లు. గోబ‌ర్ద‌న్ స్కీం కింద 200 బ‌యో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు. ల‌డాఖ్‌లో 13 గిగావాట్ల గ్రీన్ ఎన‌ర్జీ ప్రాజెక్టు ఏర్పాటు. ఎన‌ర్జీ ట్రాన్సిష‌న్ కోసం రూ. 38 వేల కోట్లు. యువ‌త‌లో నైపుణ్యాభివృద్ధి కోసం ప్ర‌ధాన‌మంత్రి కౌశ‌ల్ వికాస్ యోజ‌న ప‌థ‌కం.

ఇక త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు ప్ర‌త్యేక నిధులు కేటాయించారు. క‌ర్ణాట‌క‌లోని వెనుక‌బ‌డ్డ ప్రాంతాల‌కు, సాగునీటి రంగానికి రూ. 5,300 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పీవీటీజీ గిరిజ‌నుల కోసం ప్ర‌త్యేక చ‌ర్య‌లు. మారుమూల గిరిజ‌న గ్రామాల అభివృద్ది కోసం రూ. 15,000 కోట్లు కేటాయించారు. సికెల్ సెల్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ప్ర‌త్యేక చేయూత అందిస్తామని నిర్మల తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

Must Read

spot_img