మొన్నామధ్య గాంబియాలో, ఇండోనేషియాలో దగ్గు మందు సిరఫ్ కారణంగా చిన్న పిల్లల మ్రుతి ఘటన మరవకముందే మరో దేశంలో అదే ఘటన పునరావ్రుతమైంది. భారత దగ్గు మందుతో ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది పిల్లలు మృతి చెందారు. ఈ మేరకు డబ్లూహెచ్ఓ ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. గతంలో గాంబియాలో ఇలాంటి సిరప్ తాగి 70 మంది చిన్నారు చనిపోయారు.
భారత్‌లో తయారైన దగ్గు మందు తాగి తమ దేశంలో 18 మంది చిన్నారులు చనిపోయారని ఉజ్బెకిస్తాన్ ఆరోపణలు చేసింది. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్ వల్లే ఈ మరణాలు జరిగాయి. ‘డోక్-1 మ్యాక్స్’అనే దగ్గుమందు తాగి పిల్లలు చనిపోయారని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ లో తయారయ్యే డోక్-1 మ్యాక్స్ సిరప్, మాత్రలు దగ్గు-జలుబు నివారణ కోసం వాడే మందులు ఇక్కడ ఓపెన్ మార్కెట్ లో లభిస్తున్నాయి. గాంబియా దేశంలో భారత దగ్గు మందు తాగి 70 మంది పిల్లలు మృతి చెందిన విషయం మరవక ముందే.. ఉజ్బెకిస్తాన్ కూడా అలాంటి ఆరోపణలే చేయడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది.
డోక్-1 మ్యాక్స్ సిరప్‌లో ‘ఇథిలిన్ గ్లైకాల్’ అనే విషపూరిత పదార్థం ఉన్నట్లు తమ ప్రయోగశాల పరీక్షలలో తేలినట్లు ఉజ్బెకిస్తాన్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా.. ఫార్మసిస్ట్‌ల సలహా మేరకు పిల్లలకు వారి తల్లిదండ్రులు దగ్గు మందు ఇచ్చారని తెలిపింది. అంతేకాదు పిల్లలకు ప్రామాణిక మోతాదు కంటే ఎక్కువ మోతాదులతో సిరప్‌ను అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 2 నుంచి 7 రోజుల పాటు 2.5 నుంచి 5 ఎంఎల్ మోతాదులో రోజుకు 3 నుంచి 4 సార్లు పిల్లలు తీసుకున్నట్లు వెల్లడించింది. దగ్గు, జలుబు నివారణకు తల్లిదండ్రులు ఈ సిరప్ వాడారని ప్రాథమిక సమాచారంతో తెలిసింది.. ఈ ఘటన అనంతరం డోక్ 1 యొక్క అన్ని మాత్రలు మరియు దగ్గు సిరప్‌ల అమ్మకాలను నిలిపివేయాలని ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం అక్కడి అధికారులను ఆదేశించింది.
దీనికి కారణంగా భావిస్తున్న ఏడుగురు ఉద్యోగులను వేంటనే ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలిపింది. మరణాలపై మరిన్ని వివరాలను తెలపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘డబ్ల్యూహెచ్ఓ’ ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఉత్తరప్రదేశ్ డ్రగ్స్ కంట్రోలింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ బృందాలు సదరు కంపెనీపై విచారణ ప్రారంభించాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దగ్గు సిరప్‌లలో ఇథిలీన్ గ్లైకాల్ జాడలు కూడా ఉండకూడదట. యునైటెడ్ కింగ్‌డమ్, జార్జియా, నైజీరియా, కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, అజర్‌బైజాన్, కెన్యా, ఇథియోపియా, శ్రీలంక, మయన్మార్, లావోస్ వియత్నాం దేశాలకు కూడా డాక్ 1 మందులు సరఫరా అవుతున్నాయి.
మారియన్ బయోటెక్ సంస్థ తయారు చేసిన ఈ మందులను ఆయా దేశాల నుంచి ఎగుమతి చేసేందుకు లైసెన్సులు ఉన్నాయి
ఈ ఘటనతో డాక్ 1 సంస్థపై పెను ప్రభావం పడనుంది. హర్యానాకు చెందిన మరో కంపెనీ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు సిరప్ కారణంగా ఆఫ్రికా దేశం గాంబియాలో కూడా 70 మంది పిల్లలు మరణించారు. అటు ఇండోనేషియాలో సుమారు 100 మంది పిల్లలు దగ్గు మందు తాగడం వల్ల చనిపోవడంతో అన్ని రకాల టానిక్కుల అమ్మకాలపై నిషేధం విధించారు.
సిరప్‌లలో తీవ్ర కిడ్నీ గాయాలకు దారి తీసే పదార్థాలు ఉన్నాయని, వాటివల్లే 99 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశం వెల్లడించింది. సుమారు 200 ఏకేఐ కేసులను పిల్లల్లో కనుగొన్నారని, వారిలో చాలామంది అయిదేళ్ల లోపు వారేనని ఇండోనేషియా ఆరోగ్య అధికారులు తెలిపారు.
అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గాంబియాలో 70 మంది పిల్లల మరణాలకు కారణమని భావిస్తున్న నాలుగు దగ్గు మందుల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో హెచ్చరిక జారీ చేసింది. అయితే ఇన్ని సంవత్సరాలుగా ఏ భయాల్లేకుండా ఉపయోగించిన కాఫ్ సిరఫ్ ఇప్పుడింత తీవ్రంగా పరిణమించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీలు ఎక్కువ లాభం కోసం ఫార్ములాను మార్చారా లేక నాసిరకం రసాయనాలు వాడుతున్నారా అన్నది పరిశోధనల్లో తేలనుంది. ఉజ్బెకిస్తాన్ లో జరిగిన ఈ ఘటన సంగతి తెలియగానే ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. సంస్థ శాస్త్రవేత్తలు సదరు దగ్గు మందులపై విచారణ మొదలుపెట్టారు. అంతే కాదు ఇటు భారత్ లోనూ కేంద్రం అలర్టైంది. దేశం పరువు ప్రతిష్టలకు ముప్పు కలుగజేసే మందుల కంపెనీల విషయంపై రివ్యూ నిర్వహించింది.