మోదీ ప్రజాస్వామ్యవాది కాదన్న గొప్ప సత్యాన్ని అమెరికాలో మూలన కుర్చున్న ఓ ముసలి బిలియనీర్ జార్జ్ సొరోస్ ఇప్పుడు ప్రచారంలోకి వచ్చారు. ఇంతా చేసి ఆయనకు మన దేశం గురించి ఆవగింజంత కూడా తెలియదు. మరి ఎవరి ప్రోద్బలంతో ఆయన ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మోదీ గెలవకుండా చూస్తానని చెప్పేంత దైర్యం ఆయనకు ఎలా వచ్చిందోనన్న విషయంపై అంతర్జాతీయంగా మీడియా చర్చలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఇంతకీ సోరోస్ ఎవరు… ఆయన కామెంట్స్‌పై రియాక్షన్ ఏంటి? అన్న విషయాలను ఇవాల్టి ఇండెప్త్ లో చూద్దాం..జర్మనీలోని మ్యూనిచ్ డిఫెన్స్ కాన్ఫరెన్స్‌లో జార్జ్ సోరోస్ మాట్లాడుతూ భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వాది కాదని తన ప్రసంగంలో చెప్పడంతో వివాదం రాజుకుంది. అక్కడితో ఆగని ఈ పెద్దాయన మరో అబద్దపు అనవసరమైన ఆరోపణ కూడా చేసారు.
మోదీ వేగంగా నాయకుడిగా మారడానికి భారతీయ ముస్లింలపై హింసే ప్రధాన కారణమని ఆరోపించారు. రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తుందంటూ ఉక్రోషాన్ని వెలిబుచ్చారు. ఇక్కడే అమెరికా ఈయన మాటల వెనుక ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ”గౌతమ్ అదానీ కేసులో మోదీ ప్రస్తుతం మౌనంగా ఉన్నారు, అయితే విదేశీ పెట్టుబడిదారుల ప్రశ్నలకు, పార్లమెంటులో సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. దీంతో ప్రభుత్వంపై వారికి ఉన్న పట్టు సన్నగిల్లుతుంది” అని ఆరోపించారు.
ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుజ్జీవనానికి దారితీస్తుందని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. అంతేకాదు, 2020 జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి భారతదేశాన్ని హిందూ జాతీయవాద దేశంగా మారుస్తున్నారని సోరోస్ విమర్శలు చేశారు. అసలు ఈ పేరుతో ఓ బిలియనియర్ భారతదేశంపై తనకున్న అక్కసులు ఇలా వెలిబుచ్చడంపై ప్రధాని మోదీపై అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందన్న వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.
ఎందుకంటే గత కొన్ని వారాలుగా ఆయనపై రకరకాలుగా క్యారక్టర్ అసాసినేషన్ దాడులు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పెరుగుతున్న పేరు ప్రతిష్టలను చాలా అగ్రదేశాలు ఓర్చుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా మన మిత్రదేశం అని పదే పదే చెప్పుకుంటోన్న అమెరికా దీనంతటికీ కారణం అని సమాచారం. ఎలాగూ చైనా కూడా భారత్ అంటే మొదటి నుంచీ శత్రుత్వాన్న మెయింటెయిన్ చేస్తోంది. దేశంలోని అంతర్గత కల్లోలం స్రుష్టించడానికి ప్రతిపక్షాలను ఉపయోగించుకోవడం లాంటి పనులు చేస్తోంది. అయితే అమెరికన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్‌పై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జార్జ్ సోరోస్ ప్రకటన భారత ప్రజాస్వామ్య ప్రక్రియను నాశనం చేసేలా ఉందని ఆరోపించారు. విదేశాల నుంచి భారత ప్రజాస్వామ్య నిర్మాణాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాదించారు. ఇది భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నమని, దీనికి భారతీయులందరూ తగిన సమాధానం చెప్పాలని స్మృతి విజ్ఞప్తి చేశారు. అయితే జార్జ్ సోరోస్ ప్రకటనపై కాంగ్రెస్ కూడా స్పందించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ మీడియా విభాగం చీఫ్ జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ..
”అదానీ కుంభకోణం భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి నాంది పలుకుతుందా లేదా అనేది పూర్తిగా కాంగ్రెస్, ప్రతిపక్షాలు, మా ఎన్నికల ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. దీనికి జార్జ్ సోరోస్‌తో సంబంధం లేదు. ఆయనలాంటి వ్యక్తులు మా ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేరని మా నెహ్రూ వారసత్వం స్పష్టంచేస్తోంది” అని తెలిపారు. ఇది చాలా నర్మగర్భంగా ఎటూ తేల్చలేని కామెంట్ అని బీజేపీ నేతలు విమర్షించారు. ఇదే సమయంలో శివసేనకు చెందిన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది బీజేపీని టార్గెట్ చేశారు.”జార్జ్ సోరోస్ ఎవరు? ఆయనపై బీజేపీ ట్రోల్ మినిస్ట్రీ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తోందని ఆమె ట్వీట్ చేశారు. “మంత్రిగారూ… మీరు భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఇజ్రాయెల్ ఏజెన్సీ జోక్యంపై ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అది భారత ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు” అని కూడా ఆమె ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు.
మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా కూడా మంత్రి స్మృతి ఇరానీపై విరుచుకుపడ్డారు. ఆమె ట్విట్టర్‌లో “గౌరవనీయులైన కేబినెట్ మంత్రి జార్జ్ సోరోస్‌కు తగిన సమాధానం ఇవ్వాలని ప్రతి భారతీయుడికి పిలుపునిచ్చారు. దయచేసి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పళ్ళేల చప్పుడు చేయండి” అని ఎద్దేవాచేశారు. ప్రస్తుతానికి వస్తే.. జార్జ్ సోరోస్ ఒక అమెరికన్ బిలియనీర్. పారిశ్రామికవేత్త. బ్రిటన్‌లో ఆయనను 1992లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను నాశనం చేసిన వ్యక్తిగా విమర్శిస్తుంటారు.
ఆయన హంగేరిలోని ఒక యూదు కుటుంబంలో జన్మించారు.
హిట్లర్ పాలనలో జర్మనీలో యూదులను చంపుతున్న సమయంలో వారి కుటుంబం ఏదో విధంగా బయటపడింది. అనంతరం ఆ కమ్యూనిస్టు దేశాన్ని వదిలి పశ్చిమ దేశానికి తరలివచ్చారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన సోరోస్ దాదాపు రూ. 3.6 లక్షల కోట్లు సంపాదించారు. ఈ డబ్బుతో ఆయన వేలాది పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పోరాడుతున్న పలు సంస్థలకు సహాయం చేశారు.
1979లో ఆయన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఆ సంస్థ ఇప్పుడు దాదాపు 120 దేశాల్లో తన సేవలు అందిస్తోంది. అయితే ఆయన చర్యల కారణంగా సోరోస్ ఎప్పుడూ రైట్ వింగ్ నాయకులకు టార్గెట్‌గా మారుతారు. సోరోస్ 2003 ఇరాక్ యుద్ధాన్ని విమర్శించారు. ఆయన డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ అమెరికాకు మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. దీని తరువాత సోరోస్‌పై అమెరికన్ రైట్ వింగ్స్ విమర్శలు తీవ్రమయ్యాయి.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత సోరోస్‌పై దాడులు కొత్తపుంతలు తొక్కాయి. అంతేకాదు ట్రంప్ కూడా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సోరోస్‌పై పలుమార్లు విమర్శలు గుప్పించారు. అమెరికాలో మాత్రమే కాదు, జార్జ్ సోరోస్‌కు వ్యతిరేకంగా ఆర్మేనియా, ఆస్ట్రేలియా, రష్యా, ఫిలిప్పీన్స్‌లో కూడా ప్రచారాలు నిర్వహించారు. మరోవైపు తుర్కియేని విభజించి నాశనం చేయాలనుకునే యూదుల కుట్రలో సోరోస్ కేంద్రంగా ఉన్నారని తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ అర్డోగన్ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు.
శరణార్థులు ఐరోపా అంతటా వ్యాపించేలా సోరోస్ ప్రోత్సహిస్తున్నారని బ్రిటన్ బ్రెగ్జిట్ పార్టీకి చెందిన నిగెల్ ఫరేజ ఆరోపించారు. సోరోస్ మొత్తం పాశ్చాత్య ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా నిగెల్ పరిగణించారు. సోరోస్ జన్మస్థలమైన హంగేరీ ప్రభుత్వం కూడా ఆయనను తన శత్రువుగా భావిస్తోంది. 2018 ఎన్నికల ప్రచారంలో హంగేరియన్ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ సోరోస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇదీ ఆయన చరిత్ర.. మనదేశం సంపన్నుడైన ముఖేష్ అంబానీ సంపదలో కనీసం పదో వంతైనా లేని సొరోస్ మాటలకు మన సొంత ప్రజలలో కొందరు స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో జార్జ్ సోరస్‌పై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఫైర్ అయ్యారు.
ప్రధాని మోదీపై 92 ఏళ్ల సోరస్ చేసిన విమర్శలను ధీటుగా తిప్పికొట్టారు. సోరస్‌కు వయసైపోయింది. ఆయనవి మూర్ఖమైన అభిప్రాయాలు అన్నారు జైశంకర్. న్యూయార్క్‌లో కూర్చుని ప్రపంచం మొత్తం ఎలా పని చేయాలో తానే నిర్ణయించాలని సోరస్ అనుకుంటున్నారు. ఆయన వయసైపోయిన వ్యక్తి. ధనికుడు. నచ్చిన అంశాలపై తన అభిప్రాయాలను చెప్తుంటాడు.
అంతకు మించి ఆయనొక ప్రమాదకరమైన వ్యక్తి అని జైశంకర్ అభివర్ణించారు. తనకు నచ్చిన వ్యక్తి ఎన్నికల్లో గెలిస్తే అది మంచిదని సోరస్ భావిస్తాడు. అదే ఫలితం మరోలా వస్తే గనుక.. ప్రజాస్వామ్యంలో తప్పులు వెతుకుతాడు అంటూ జైశంకర్, సోరస్ గురించి వ్యాఖ్యానించారు. వలసవాదం నుంచి వెలుగులోకి వచ్చిన భారత్‌కు.. బయటి నుంచి జోక్యాలతో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో బాగా తెలుసని జైశంకర్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా మంత్రి క్రిస్ బ్రౌన్‌తో చర్చ సందర్భంగా.. జైశంకర్ పై వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ ప్రజాస్వామ్యవాది కాదని, ముస్లింలపై హింసను ప్రేరేపించడం వల్లే ఆయన స్థాయి పెరిగిందంటూ సోరస్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారమే రేపాయి.