Homeతెలంగాణబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత .. అరెస్ట్ తప్పదా..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత .. అరెస్ట్ తప్పదా..

దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి ప్లీజ్ .. ఈ కొటేషన్ కొంత ఎబ్బెట్టుగా ఉన్నా కల్వకుంట్ల వారమ్మాయి కవిత పరోక్షంగా బీజేపీకి చేస్తున్న సవాలు ఇదే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టుపై ‘మర్యాదగా ఉండదు’.. అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ దిశగానే సంకేతాలిస్తున్నాయి.. తెలంగాణ రాజకీయాల్లో కవిత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.ఆమె అరెస్టుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సిసోడియా అరెస్టు తర్వాత ఇక కవిత, కేజ్రీవాల్ తిహార్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు ప్రకటిస్తున్న తరుణంలో కేసీఆర్ కూతురి వ్యవహారం ఇప్పుడు అందరి నోళ్లలో నలుగుతోంది.

ఛార్జ్ షీటులో పలు పర్యాయాలు ఆమె పేరు చేర్చడంతో ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందులోనూ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, సన్నిహితులుగా పేరున్న బోయినిపల్లి అభిషేక్ రావు, శరత్ చంద్రారెడ్డిని ఇప్పటికే అరెస్టు చేశారు.లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ తప్పదని బీజేపీ నేతలు గత కొన్ని రోజులుగా చేస్తున్న విమర్శలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. విపక్ష నేతలనే దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయని ధ్వజమెత్తారు. ఏ ఏజెన్సీ ఎప్పుడు అరెస్ట్ చేయాలో బీజేపీ నేతలే చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు చెప్తే నన్ను అరెస్ట్
చేస్తారా అని ప్రశ్నించారు.

అరెస్టులు అనేవి ఏజెన్సీలు చేయాలని, అందుకు భిన్నంగా బీజేపీ నేతలు దిశానిర్దేశం చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మాత్రం దానికి కేంద్ర ఏజెన్సీలు ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు దిగితే బీజేపీ వారికి మర్యాద దక్కదని మీడియా ముఖంగా హెచ్చరించారు. సీబీఐ, ఈడీ దూకుడుతో తన అరెస్టు విషయంలో కవిత కూడా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టు చేస్తే సానుభూతి కోసం గేమ్ ప్లాన్ మొదలుపెట్టారు. అందులో భాగంగా ఆమె గత కొన్ని వారాలుగా జాతీయ అంశాల మీదనే ఫోకస్ చేసి కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అదానీ విషయంలో హిండెన్‌బర్గ్ రిపోర్టు, బడ్జెట్‌లో సంక్షేమానికి తగ్గిన ప్రాధాన్యం, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల వేలం, థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు విదేశీ బొగ్గు వంటి అంశాలతో పాటు ప్రత్యర్థి పార్టీలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుంది అంటూ నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపును తగ్గించి పేదల పొట్ట కొదుతున్నరని హైలైట్ చేస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో దశలో మహిళా బిల్లు పెట్టాలనే డిమాండ్ తో మార్చి 10న ఏకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదంతా తనను అరెస్ట్ చేస్తే కేంద్రాన్ని విమర్శించినందుకు, కక్ష కట్టి అరెస్ట్ చేశారనే సానుభూతి పొందాలనే వ్యూహంతోనే చేస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

సీబీఐ, ఈడీ లాంటి సంస్థల ద్వారా రాజకీయ కక్షసాధింపుకు పాల్పడి లిక్కర్ స్కామ్‌లో వేధిస్తున్నారని చెప్పేందుకు ముందుగానే గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. కవిత అరెస్టు ఖాయమని కేసీఆర్ కూడా డిసైడయ్యారట. అలా జరిగిన పక్షంలో పార్టీపై ప్రభావం పడకుండా కేంద్రంపై విరుచుకుపడేందుకు ప్లాన్ చేశారట. అందులో భాగంగానే కవిత ఇప్పుడు ఎక్కువ సమయం ఢిల్లీపై ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది.

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత అరెస్టు మీదనే చర్చ నడుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టుకి వెళ్లారు. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం దక్కలేదు. చివరకు ఆయన పదవికి రాజీనామా చేసి జైలులో కూర్చొన్నారు. కచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపు అని ఆప్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు అంటున్నాయి. మరో వైపు, తెలంగాణ లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లోనూ అలజడి మొదలైంది. ఈ స్కామ్ లో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

పక్కా ఆధారాలతోనే ముందుకు కదులుతున్నామని సీబీఐ వర్గాలు అంటున్నాయి. రాజకీయ కక్షలతోనే సీబీఐ దూకుడు పెంచిందని బీఆర్ఎస్ అంటోంది. ఈలోగా బీజేపీలో కలకలం మొదలైంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేసీ నడ్డా అయినప్పటికీ, పార్టీ ని నడిపించేది అమిత్ షా యే అనటంలో సందేహమే లేదు. అటువంటి అమిత్ షా.. అకస్మాత్తుగా తెలంగాణ వ్యవహారాల మీద ఫోకస్ చేశారు. స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి కావటంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారాలు కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అటువంటి అమిత్ షా కబురు పంపించటంతో..

తెలంగాణ లోని బీజేపీ సీనియర్లు క్యూ కట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేస్తే అనుసరించాల్సిన రాజకీయ వ్యూహం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కవితను అరెస్టు చేసినంత మాత్రాన ఈ కేసు పూర్తి అయిపోదు. ఆమె మీద నేరాల్ని రుజువు చేయటం కూడా అంత తేలిక కాదు. కానీ కేసీయార్ కూతురునే అరెస్టు చేయటం అంటే రాజకీయంగా, ఆర్థికంగా హైదరాబాద్ లో కలకలం రేగుతుంది. బీఆర్ఎస్ కు నిధులు, విరాళాలు ఇచ్చే పారిశ్రామిక వేత్తలు జంకుతారు. అలాగే రాజకీయంగా నాయకులు కూడా పార్టీని అంటిపెట్టుకొని ఉండటం కూడా కష్టమే.

బీఆర్ ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేయటమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కోణాల్లో ఆలోచించి మాత్రమే కేంద్రం దూకుడుగా సీబీఐ ని నడిపిస్తోంది అని అంటున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ఇంటర్యూలను ప్రో బీఆర్ఎస్ మీడియా హడావుడిగా ప్రసారం చేసింది. సమయం.. సందర్భం లేకుండా ఈ ఇంటర్యూలను ప్రసారం చేయడం ఆసక్తికరంగా మారింది.

మహిళా రిజర్వేషన్ల కోసం ఆమె పోరాడుతున్నట్లుగా కవర్ చేయడానికి ఈ ఇంటర్యూలను డిజైన్ చేశారు. పనిలో పనిగా ఆమెపై ఢిల్లీ లిక్కర్ కేసు గురించి కూడా మాట్లాడించారు. అందులో తన ప్రమేయం ఏమీ లేదని.. కేంద్రంపై పోరాడుతున్నందుకే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినందున తదుపరి .. కవితనే అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే కవిత కూడా ఇటీవల తరచూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.బీజేపీ నేతలు చెబితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. అయితే వారు చేయాలనుకుంటే ఇలాంటి ప్రకటనలను పట్టించుకోరు. ఇప్పటి వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ ఓ పద్దతి ప్రకారం వెళ్తున్నాయి. మొదట్లో బీజేపీ నేతలే తామే దర్యాప్తు చేస్తున్నట్లుగా కవిత పేరు సహా అందరి పేర్లు ప్రకటించారు. కానీ సీబీఐ మాత్రం మెల్లగా విచారణ జరుపుతూ ఒక్కొక్కరి వివరాలు కోర్టు ముందు పెట్టి అరెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం పరిణామాలు చూస్తే కవిత అరెస్ట్ ఖాయమని తేలడంతోనే ఢిల్లీలో ధర్నాకు ప్లాన్ చేశారని అంటున్నారు. భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాచేయనున్నారు. ఈ లోపు కవిత మీడియా ఇంటర్యూలు ఎక్కువగా ఇస్తున్నారు. ఈ హడావుడి చూస్తూంటే.. సీబీఐ నుంచి ఏమైనా సంకేతాలు అంది ఉంటాయన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది.

Must Read

spot_img