HomePoliticsతనయుడి రాజకీయ ఎంట్రీ కోసం ఆ నేత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారా.. ??

తనయుడి రాజకీయ ఎంట్రీ కోసం ఆ నేత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారా.. ??

వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ ప్లాట్ ఫాం ఎక్కించేందుకు నానా తంటాలు పడుతున్నారా ? అందుకే వీలున్న ప్రతిసారీ తనయుడి రాజకీయ ఆరంగేట్రంపై నలుగురిలో చర్చ జరిగేలా ప్లాన్ చేశారా? మరింతకి తనయుడి కోసం పాట్లు పడుతున్న ఆ నేత ఎవరు ?

ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో వారసత్వ రాజకీయాల దూకుడు ఆసక్తి రేపుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్‌లలో కొత్త
తరం రాజకీయ నాయకత్వం.. సీనియర్ నాయకుల వారసుల రూపంలో తెరపైకి దూసుకొస్తుంది. దీంతో రానున్న ఎన్నికల పోరులో ప్రధాన పార్టీల
నుంచి కొత్త ముఖాలు ప్రజల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.

వారసత్వ రాజకీయ పరంపరలో నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగే వారు కొందరైతే.. మరికొందరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పేరుతో నియోజకవర్గాలలో హల్‌చల్ చేస్తూ రాజకీయ రంగ ప్రవేశానికి ఉవ్విళ్లూరుతున్నారు. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ నుంచి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన రాజకీయ వారసుడిగా వచ్చే ఎన్నికల్లో తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డిని రంగంలోకి దించేందుకు సంసిద్ధమయ్యారు. నల్గొండ జిల్లాలో మోస్ట్ సీనియర్ లీడర్ల లో ఒకరు శాసన మండలి చైర్మన్ గుత్తా సఖేందర్ రెడ్డి. టీడీపి, కాంగ్రెస్ పార్టీలో ఎంపిగా పనిచేసిన గుత్తా.. ప్రస్తుతం టీఆరెఎస్ ప్రభుత్వంలో శాసనమండలి ఛైర్మెన్ గా కొనసాగుతున్నారు. వాస్తవానికి మంత్రి కావాలనేది గుత్తా సుఖేందర్ రెడ్డి చిరకాల కోరిక. టీఆరెఎస్ ప్రభుత్వంలో ఆ కల నెరవేరుతుందని ఆశించారాయన. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆరెఎస్ లో చేరినట్టు ఎన్నోసార్లు మీడియా ముందు కుండ బద్దలు కొట్టారు. కానీ ఇన్నేళ్లైనా ఆ కల మాత్రం నెరవేరడంలేదు. ఇక ఇప్పుడా కోరికను చంపుకొని కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నాలు షురూ చేశారట గుత్తా. తాను
రాజకీయాలకు గుడ్ బై చెప్పేలోపే తనయుడిని పొలిటికల్ ప్లాట్ ఫాం ఎక్కించే దిశగా పావులు కదుపుతున్నారు.

గుత్తా ఏకైక కుమారుడు అమిత్‌రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం అధినేత కు రిక్వెస్ట్ పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ విషయంలో ఈ మధ్య తెగ ఫాలో అప్చే స్తున్నారట కూడా. ఎలాగూ మంత్రి పదవి ఆశ పై నీళ్ళు చల్లారు కాబట్టి కుమారుడినైనా రాజకీయాల్లోకి తీసుకువచ్చి, ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించి చట్టసభల్లోకి పంపించాలని గుత్తా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా వీలు దొరికినప్పుడల్లా కొడుకు రాజకీయ ఆరంగేట్రం గురించి ప్రస్తావన తెస్తున్నారు.

శాసన మండలి చైర్మన్‌గా ఉండి కూడా ఆయన నిర్వహించే రాజకీయ ప్రెస్‌ మీట్లలో ఈ విషయాన్ని వ్యూహాత్మకంగా ప్రస్తావనకు తీసుకువస్తున్నారని
టాక్ వినిపిస్తోంది. దీని ద్వారా అమిత్ పేరుపై జనాల్లో చర్చ జరగాలన్నది ఆయన ప్లాన్‌గా తెలుస్తోంది. జిల్లాలో ఏదో ఒక నియోజవకర్గం నుంచి
అమిత్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చూస్తున్నారట. అయితే ఆ ప్లాన్ అంత సులువుగా వర్కవుట్ అవుతుందా అన్న ఆందోళన కూడా గుత్తా
ను వెంటాడుతోంది. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని ఏకంగా సీఎం కేసీఆరే ప్రకటించారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో
ఉన్న పన్నెండు నియోజకవర్గాల్లో మొత్తం టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో అమిత్‌కు అవకాశం ఎలా వస్తుంది ? ఎక్కడ నుంచి పోటీ చేయించాలని కూడా సందిగ్ధంలో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేగా అవకాశం రాకపోతే నల్లగొండ లోక్‌ సభ స్థానం నుంచి పోటీ చేయించాలని సుఖేందర్‌ రెడ్డి అనుకుంటున్నారట. ఎలాగూ గతంలో తాను ఎంపీగా పనిచేసిన స్థానం కాబట్టి, తనకున్న పరిచయాలు ఉపయోగపడతాయని లెక్కలు వేస్తున్నారట గుత్తా సుఖేందర్ రెడ్డి.

మరోవైపు నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకునే నేతల లిస్ట్‌ కూడా టీఆర్‌ఎస్‌లో పెద్దగానే ఉందనీ టాక్. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వేమిరెడ్డి నర్సింహ్మారెడ్డి, ఓ పారిశ్రామికవేత్త అప్పుడే నల్గొండ పార్లమెంట్ స్థానంపై కర్చీఫ్ వేసేశారట. ఇక ఎలాగూ గులాబీ బాస్ సిట్టింగ్ లకే సీటు అనే ప్రతిపాదన పెట్టారు కాబట్టి, నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ పై కన్నేసిన మాజీ ఎంపీ కుమారుడు చకిలం అనీల్ కుమార్, టీఆరెఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డిలు నల్గొండ పార్లమెంట్ టికెట్ రాకపోదా అనే ఆశతో ఉన్నారని సమాచారం.

ఆ క్రమంలోనే వారి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారట. ఇక ఈ లిస్ట్ దాటుకుని అమిత్‌కు అవకాశం వస్తుందా అనేది కూడా అనుమానమే. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో జనరల్ స్థానాల నుండి తగిన స్థానం సిద్ధం చేసేందుకు సుఖేందర్ రెడ్డి ఇప్పటినుండే తెరవెనుక ప్రయత్నాలు ఆరంభించారు. అమిత్ కోసం నల్గొండ, మునుగోడు మిర్యాలగూడ స్థానాలపై కన్నేసిన సుఖేందర్ రెడ్డి వాటిలో ఏదైనా ఒక స్థానం నుండి తనయుడు అమిత్ రెడ్డిని ఎన్నికల బరిలోకి దించాలని ఆశిస్తున్నారు.

ఇన్నాళ్లు తండ్రి చాటు తనయుడిగా పెరిగిన అమిత్‌, ప్రజల్లోకి రాకపోవడం ఆయనకు కొంత మైనస్‌ అని అంచనాలు వినిపిస్తున్నాయి…!

అందుకే ఈ మధ్య గుత్తా అమిత్ రెడ్డి ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నాలు షురూ చేయడం చర్చనీయాంశంగా మారింది. తన తాత గారైన గుత్తా వెంకట్ రెడ్డి
మెమోరియల్ ట్రస్ట్ పేరుతో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు అమిత్ రెడ్డి. స్వయంగా అమిత్ రెడ్డి కూడా రాజకీయ రంగ ప్రవేశానికి ఆసక్తి
చూపుతూ ఇప్పటికే గుత్తా ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. కరోనా కాలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి కొంత
గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ పేదలకు తోచినంత ఆర్ధిక సహాయం చేస్తూ, ప్రజల్లో నానుతున్నారు. ఇవన్నీ రాజకీయ ఆరంగేట్రానికి
ఉపయోగపడతాయని, అందుకే నిత్యం ప్రజల్లో ఉండాలని గుత్తా అమిత్ రెడ్డి ఈ మధ్య బిజీ షెడ్యూల్ లో ఉన్నారని తెలుస్తోంది. తండ్రి సలహాలు,
సూచనలతో ప్రజల్లో గుర్తింపు వచ్చేలా, అధినేత మదిలో పడేలా సరికొత్త ఎత్తులు వేస్తున్నారని సమాచారం.

మొత్తానికీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు తాను పదవిలో ఉన్నప్పుడే పుత్రుడికి రాజకీయ బాటలు ఏర్పరచాలని గుత్తా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవేళ కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడంలో గుత్తా విఫలం అయితే మాత్రం, అది అమిత్‌ రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన కూడా ఇప్పుడు ఆయనకు పెద్ద టెన్షన్ గా మారింది. ఇదేసమయంలో మరో ఆసక్తికర చర్చ స్థానికంగా వెల్లువెత్తుతోంది. రాజకీయాల్లో అవకాశాల కోసం
ముందస్తుగా సందడి చేస్తున్న సీనియర్ నాయకుల వారసులపై బీజేపీ నాయకత్వం ఫోకస్ చేయనుందన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా
మారింది. దీంతో ఈ దిశగా కేసీఆర్ గనుక దృష్టి సారిస్తే, అమిత్ కు అవకాశం లభించవచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో రానున్న
ఎన్నికలు రాజకీయాల్లో టికెట్ల రేసుతో రాజకీయ సమీకరణలను మరింత రసకందాయంగా మార్చుతాయన్న టాక్ ఇప్పుడు చర్చనీయాంశంగా
మారింది.

అదే జరిగితే, వారసులకు సొంత పార్టీల టిక్కెట్లు లభిస్తాయన్న చర్చ కేడర్ లోనూ వినిపిస్తోంది. అదే జరిగితే, అమిత్ కు కూడా ఛాన్స్
ఉండొచ్చని అంచనాల వేళ .. గుత్తా వ్యూహం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదేసమయంలో ఒకవేళ అవకాశం లభిస్తే, ఏ స్థానం
నుంచోనన్న టెన్షన్ కూడా పార్టీ వర్గాల్లో ముఖ్యంగా సిట్టింగుల్లో సాగుతోందని టాక్. దీంతో నల్గొండజిల్లా వ్యాప్తంగా గుత్తా .. వ్యూహంపైనే రాజకీయ
చర్చలు సాగుతున్నట్లు సమాచారం.

మరి కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్న సుఖేందర్ రెడ్డి కలలు నెరవేరుతాయా లేదా అన్నది వేచి చూడాలి.

Must Read

spot_img