Homeసినిమాటీడీపీ ఎంపీ కేశినేని నాని .. వ్యాఖ్యలు ఏపీలో కాక రేపుతున్నాయా..?

టీడీపీ ఎంపీ కేశినేని నాని .. వ్యాఖ్యలు ఏపీలో కాక రేపుతున్నాయా..?

తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత కేశినేని నాని .. ప్రస్తుతం విజయవాడ ఎంపీ గా కొనసాగుతున్నారు.. అయితే సొంత పార్టీపైనే నిప్పులు చెరుగుతారు.. కొందరి నేతలపై బహిరంగంగా విమర్శలు చేస్తారు.. సొంత సోదరుడితో మొదలైన విబేధాలు ఇప్పుడు పార్టీ పెద్దలతో గ్యాప్ ఏర్పడేలా చేస్తోంది. అయినా ఆయన వెనక్కు తగ్గడం లేదు. సొంత పార్టీ అధిష్టానంపై బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా అని ఆయన పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఇతర పార్టీలవైపు చూడడం లేదు.. కానీ సొంత పార్టీ నేతలపై మాత్రం నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు.


ఇతర పార్టీల నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తూనే.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.. వారంతా ఎంపీ కేశినేని నాని సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.. నీతి, నిజాయితీ, క్యారెక్టర్‌ ఉన్న వాళ్లకి విజయవాడ వెస్ట్ టికెట్‌ ఇస్తే గెలవడం ఖాయంగా చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో విడయవాడ వెస్ట్ సెగ్మెంట్‌లో టీడీపీ 25 వేల మెజార్టీతో గెలవనుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. కానీ నీతి నిజయితీ ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని మెలిక పెట్టారు. ఈ వ్యాఖ్యలకు ముందు కూడా ఇలాంటి కామెంట్లే చేసి అధిష్టానానికి షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీలతో తనకు పని లేదన్నారు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు కోరుకుంటే తనను ఇండిపెండెంటుగా కూడా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఒకవేళ చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకుంటే ఏమవుతుంది..? అంటూ హాట్‌ కామెంట్లు చేశారు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తానెక్కడా చెప్పలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని నిండు సభలో వ్యతిరేకించా.. అయినా బెజవాడలో పనులు ఆగాయా..? దటీజ్ కేశినేని నాని అంటూ వ్యాఖ్యలు చేశారు.. తన పర్సనాల్టీని డీగ్రేడ్ చేయాలని చూడొద్దు.. నన్ను డీ-గ్రేడ్ చేయాలని చూస్తే.. అంతగా నా పర్సనాల్టీ పెరుగుతుందన్నారు. 2013కు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువ ఉండేవని.. కానీ తాను టీడీపీలోకి వచ్చిన తరువాత.. వైసీపీలోకి వెళ్లే వలసలకు బ్రేక్ పడ్డాయని గుర్తు చేశారు. కేశినేని తాజా వ్యాఖ్యలు మళ్లీ ఏపీలో రాజకీయ రచ్చకు కారణమవుతున్నాయి.

ఏపీ రాజకీయాల్లో విజయవాడ పాలిటిక్స్ కు ఉన్న ప్రత్యేకత వేరు. ఇక్కడ వరుసగా రెండుసార్లు టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని ఈ మధ్య కాలంలో సొంత పార్టీలోనే తీవ్ర ఉక్కపోత ఎదుర్కొంటున్నారు. దీంతో ఓవైపు టీడీపీతోనూ, మరోవైపు బీజేపీతో సంబంధాల్ని కొనసాగిస్తున్నారు. తన సోదరుడు కేశినేని చిన్ని రాక తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఆయన తన పోటీతో పాటు పలు విషయాలపై క్లారిటీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

కేశినేని వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో నాని పోటీపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. అలాగే టీడీపీలో ఆయన పరిస్ధితి ఏంటన్న దానిపైనా స్పష్టత వచ్చింది. సోదరుడు చిన్నితో వైరం కారణంగా నాని భవిష్యత్ వ్యూహాలు ఎలా మారుతున్నాయన్న దానిపైనా ఆయన తాజా వ్యాఖ్యలు క్లారిటీ ఇస్తున్నాయి. ఢిల్లీ స్థాయి నాయకుడిని అయిన తనను మీడియా గల్లీ స్థాయిలో చూపించాలని చూస్తోందన్నారు. విజయవాడలో ఎంపీగా మరోసారి పోటీకి సంబంధించి తాజాగా కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పోటీ చేయనని ఎప్పుడూ చెప్పలేదని, పోటీ చేయననే వీడియో ఉంటే చూపించండి అని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. తాను పోటీ చేయాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ప్రజలు కోరుకుంటే నన్ను ఇండిపెండెంట్ గా గెలిపిస్తారన్నారు.

చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే ఏమవుతుందని ప్రశ్నించారు. తద్వారా టీడీపీ ఎంపీగా తనకు టికెట్ రావడం లేదనే విషయాన్ని కేశినేని స్పష్టం చేసినట్లయింది.బెజవాడ టీడీపీలో ఎంపీ కేశినేని నాని చేస్తున్న వరుస కామెంట్స్ తో ఆ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అసలే ఒక వైపున అధికార పక్షంపై పైచేయి సాధించేందుకు ప్రతిపక్ష పార్టీగా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ టీడీపీ, వరుస వివాదాలు, గొడవలతో బిజీగా ఉండగా, ఇటు ఇంటి పోరు అన్నట్లుగా కేశినేని నాని వైఖరి తయారయ్యింది. పార్టీలో ప్రక్షాళన జరగాలని వ్యాఖ్యానించిన కేశినేని నాని, కొందరికి టికెట్ ఇస్తే పార్టీకి పని చేయనని వ్యాఖ్యలు చేశారు. ఎంపీ నాని సొంత పార్టీ నేతల పైనే తీవ్ర స్దాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతల పేర్లు పిలవకుండానే, వారిని ల్యాండ్ గ్రాబర్లు, రియల్ మాఫియా, కాల్ మని, సెక్స్ రాకెట్ నిర్వహించే వారంటూ అంటూ పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయం పై పార్టీ నేతలు ప్రశ్నించినా తాను ఎవరి పేరు పెట్టి విమర్శించలేదు కాదా అంటూ కేశినేని నవ్వుతూనే మాట్లాడుతున్నారని అంటున్నారు.

బెజవాడ కేంద్రంగా పార్టీకి పెద్ద దిక్కువగా ఉంటారనుకుంటే ఎంపీ కేశినేని నాని చేస్తున్న కామెంట్స్ పై పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. నాని ఎందుకు ఇంతగా ఫ్రషన్ కు గురవుతున్నారు, కారణాలు ఏంటనే దాని పై టీడీపీ నేతలు ఆరా తీస్తుండగా, అదే సమయంలో కేశినేని నాని రిపీటెడ్గా చేస్తున్న స్టేట్ మెంట్ లు పార్టీ నేతలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను చేసిన కామెంట్స్ కు బదులుగా అనని విషయాలను ప్రచారం చేస్తున్నారని, కానీ తాను చేసిన మంచి పనులను ఎందుకు చూపించరని కేశినేని మీడియా పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు పాదయాత్రలో కూడా కీలకంగా వ్యవహరించానని, 265గ్రామాల్లో టాటా ట్రస్ట్ తీసుకువచ్చానని ఈ విషయాన్ని మీడియా ఏరోజు ప్రధాన వార్తగా రాయలేదన్నారు. రాజకీయాల్లోకి రావటం వలన ఎంత నష్టపోయానో తనకు తెలుసన్నారు. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి త‌మ్ముడి పోరు త‌ప్పేలా లేదు. కేశినేని నాని త‌మ్ముడు చిన్ని పొలిటిక‌ల్ గా యాక్టివ్ అయ్యారు. నాని వ్య‌తిరేక వ‌ర్గంతో చేతులు క‌లిపి టీడీపీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇన్నాళ్లు అండ‌గా ఉన్న తమ్ముడు ప‌క్క‌లో బ‌ల్లెంలా మార‌డంతో కేశినేని నాని జీర్ణించుకోలేక పోతున్నారు. త‌న‌కు ఇష్టం లేని వ్య‌క్తుల‌కు టికెట్లు ఇస్తే స‌హ‌క‌రించే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. కేశినేని నాని త‌మ్ముడు కేశినేని చిన్న ఫౌండేష‌న్ పేరుతో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. బుద్దా వెంక‌న్న‌, నాగుల్ మీరా, బోండా ఉమ‌, దేవినేని ఉమా లాంటి కేశినేని నాని వ్య‌తిరేక వ‌ర్గంతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీని పై కేశినేని నాని గుర్రుగా ఉన్నారు. త‌మ్ముడు ప్ర‌త్య‌ర్థుల‌తో తిర‌గ‌డం త‌ట్టుకోలేక‌పోతున్నారు.

కేశినేని శివ‌నాథ్ ను చంద్ర‌బాబు ప్రోత్స‌హిస్తున్నార‌ని గ‌తంలో చంద్ర‌బాబుతో అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హరించారు. ఆ తర్వాత పార్టీ కోసం ఎవ‌రైనా ప‌నిచేయవచ్చంటూ స‌ర్దిచెప్పుకున్నారు. కానీ కేశినేని చిన్న కార్య‌క్ర‌మాలు విజ‌య‌వాడ లోక్ స‌భ ప‌రిధిలో యాక్టివ్ గా జ‌రుగుతున్నాయి. నిత్యం న‌గ‌రంలోఅన్న‌దానం నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకునే ప‌నిలో పడ్డారు. దీంతో త‌న సీటుకు ఎక్క‌డ దెబ్బ ప‌డుతుందోన‌న్న బాధ కేశినేని నానిలో పెరుగుతోంది. త‌మ్ముడి ఎంట్రీతో నానికి చెక్ పెడ‌తార‌నే బాధ ఎక్కువ‌గా ఆయ‌న‌లో కనిపిస్తోంద‌ని విజ‌య‌వాడ‌లో గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో కేశినేని దారెటు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Must Read

spot_img