Homeజాతీయంకర్ణాటక రాష్ట్రానికి పక్క రాష్ట్రాలతో వివాదాలు ఆగేలా లేవు..

కర్ణాటక రాష్ట్రానికి పక్క రాష్ట్రాలతో వివాదాలు ఆగేలా లేవు..

కర్ణాటక రాష్ట్రానికి పక్క రాష్ట్రాలతో వివాదాలు ఆగేలా లేవు.. ఇప్పటికే భాషా గ్రామాల విషయంలో మహారాష్ట్ర్రతో తగవులు తీరనే లేదు.. తాజాగా గోవాతో .. మాండవీనదీ జలాల పంపిణీపైనా వివాదాలు తెరపైకి వచ్చాయిజ

మహాదాయి నదిపై కర్ణాటక డ్యాం నిర్మాణం .. గోవావాసుల్ని ఆగ్రహొదగ్రుల్ని చేస్తోంది. గోవా, కర్ణాటకలో ప్రవహించే మాండవీ నది జలాలపై వివాదం .. దశాబ్దాలుగా సాగుతూనే ఉంది.

ఒకవైపు కర్ణాటక –మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతుండగా, ఇప్పుడు కర్ణాటక –గోవా మధ్య డ్యామ్‌ వివాదం ముదురుతోంది. మహాదాయి నదిపై కలాసా – బండూరి డ్యామ్‌ నిర్మాణానికి కర్ణాటక రూపొందించిన డీపీఆర్‌కు కేంద్రం ఆమోదం తెలపడం పట్ల గోవాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు నిరసనగా గోవా అసెంబ్లీలోని మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గోవా ప్రజల ఐక్యతను, డ్యామ్‌ నిర్మాణం పట్ల నిరసనను చాటి చెప్పాలని గోవా విపక్ష నేత యురి అలెమావ్‌ డిమాండ్‌ చేశారు.

నది నీటిని కర్ణాటకకు మళ్లించే ప్రయత్నాలను అడ్డుకోవడంలో గోవా బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మహాదాయి నది కర్ణాటకలో పుట్టి ఆ రాష్ట్రంలో 28.8 కిలోమీటర్లు ప్రవహించి గోవాలోకి చేరుతుంది. గోవాలో 81.2 కిలోమీటర్లు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. గోవా ప్రజల దాహార్తి తీర్చే తల్లి లాంటి మహాదాయి నదిని కర్ణాటకకు మళ్లించే ప్రయత్నంలో భాగంగానే కలాసా – బందూరి డ్యామ్‌ నిర్మిస్తున్నారని గోవా ఆరోపిస్తోంది. అయితే, మహాదాయి నీరు వృథాగా సముద్రంలో కలవకుండా కర్ణాటకలోని కరువు ప్రాంతానికి నీరు అందించేందుకు ఈ డ్యామ్‌ అవసరమని కర్ణాటక వాదిస్తోంది. మాండవి లేదా మహాదాయి గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రవహించే నది. గోవా జీవ నాడిగా దీన్ని అభివర్ణిస్తారు. 77 కిలోమీటర్ల దూరం ప్రవహించే ఈ నది 29 కిలోమీటర్లు కర్ణాటకలో, 52 కిలోమీటర్లు గోవాలో ప్రవహిస్తుంది.

కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో పశ్చిమ కనుమల్లోని భీమ్ గాడ్ వద్ద 30 నీటి చెలమల సమూహం నుంచి ఏర్పడింది. కర్ణాటకలో 2,032 చదరపు కిలోమీటర్లు, గోవాలో 1,580 చదరపు కిలోమీటర్ల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది.

మాండవీ నది నీలిరంగు నీటితో దూద్ సాగర్ జలపాతం, వరపోహా జలపాతం వంటి అనేక అందమైన జలపాతాలు ఏర్పడ్డాయి.

మాండవీ నది కర్ణాటకలో బెల్గాం, ఉత్తర కన్నడ జిల్లాల్లో ప్రవహించి గోవాలోకి ఉత్తరాన సత్తారి తాలూకాలో ఉత్తర కన్నడ జిల్లా నుంచి ప్రవేశించి కంబర్జువా, దివాడి, చోడ్నే ప్రాంతాల్లో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. జౌరీలోకి మాండవీ కబో అగౌడా అన్న ప్రాంతంలో కలిసి మర్మగోవా నౌకాశ్రయంగా రూపొందుతోంది. ఇదిలా ఉంటే, ముంబయి కర్ణాటకలోని ఎక్కువ భాగం కరవుతో అల్లాడుతూ ఉంటుంది. వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులతో వరుణుడు ఏటా దోబూచులాడుతూ ఉంటాడు. మహదాయి నదీ జలాల కోసం ఈ ప్రాంతం ఎదురుచూస్తోంది. తీవ్రమైన సాగునీటి సమస్యతో పాటు తీవ్రమైన ఫ్లోరైడ్‌ నీటితో సతమతమవుతున్న గదగ్‌ లాంటి జిల్లాకు మహదాయి నదీ జలాలే పరిష్కారమని ఈ ప్రాంతం వాసులు స్పష్టంగా చెబుతున్నారు. గోవా రాష్ట్రంతో ఉన్న ఈ వివాదం పరిష్కారానికి బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ కూడా చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదనే విమర్శలున్నాయి. మహదాయి నది నీళ్ల పంపిణీ కర్ణాటక భారతీయ జనతా పార్టీకి తలనొప్పిగా మారుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, గోవా – కర్ణాటకల మధ్య ఉన్న మహదాయి నీటి వివాదాన్ని పరిష్కరిస్తామని గతంలోనే కర్ణాటక బీజేపీ ప్రకటించింది. దీనిలో భాగంగా అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో గోవా సీఎం మనోహర్ పారికర్, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పలతో న్యూఢిల్లీలో సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కర్ణాటక ప్రజల దాహార్తిని తీర్చేందుకు గోవా.. మహదాయి నుంచి 7టీఎంసీల నీటిని ఇచ్చేందుకు అంగీకరించిందని యడ్యూరప్ప తెలిపారు. అంతేగాక, గోవా నుంచి నీటిని రాబట్టేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

ఆ తర్వాతి రోజే ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి.. గోవా సీఎం ఓ లేఖను యడ్యూరప్పకు రాశారు. ముంబై-కర్ణాటక ప్రాంతానికి తాగునీరు అందిస్తామని అందులో పేర్కొన్నారు. కాగా, పారికర్-యడ్యూరప్పల భేటీ ఇటు గోవాలో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. మహదాయి నీటిపై ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంటుందని, పారికర్ కర్ణాటకతో మాట్లాడాల్సిన అవసరం ఏంటని గోవా బీజేపీ మిత్రపక్షం గోవా ఫార్వర్డ్ పార్టీ నేత విజయ్ సర్దేశాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే గోవా ప్రభుత్వం నుంచి కూడా తప్పుకునేందుకు సిద్దమని ఆయన ప్రకటించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జాగ్రత్తపడ్డ పారికర్.. మహదాయి జల పంపిణీపై ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. దీంతో యడ్యూరప్ప ఇరుకునపడినట్లయింది.

అయితే, ఎన్నికల్లో లాభం పొందేందుకే గోవా సీఎం నిబంధనలు పట్టించుకోవడం లేదని కర్ణాటక కాంగ్రెస్ ఆరోపించింది.

కాగా, కర్ణాటకకు ప్రయోజనం జరుగుతుందనే తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని, తన రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సిద్ధరామయ్య అన్నారు. అయితే, ముఖ్యమంత్రి అయిన తనకు కాకుండా గోవా సీఎం.. యడ్యూరప్పకు లేఖ రాయడమేంటని ప్రశ్నించారు. దీంతో తదనంతరం నీటి వివాదం పరిష్కారం చేయాలని కోరుతూ అక్కడి రైతులు సైతం ప్రత్యక్ష ఆందోళనలకు కూడా దిగారు. అయినప్పటికీ ఈ సమస్యకు మాత్రం పరిష్కారం నేటికీ లభించలేదు. అయితే తాజాగా కర్నాటక ప్రభుత్వం మహాదాయిపై డ్యాం నిర్మాణానికి పూనుకోవడంతో మరోసారి వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ .. గోవా ప్రజలు, నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యాం నిర్మిస్తే, గోవాకు నీటి సదుపాయం దెబ్బ తింటుందన్నది వీరి వాదన.

మన దేశంలో రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలు తక్కువేమీ కాదు. వీటి పరిష్కారం కోసం ఇప్పటి వరకూ అయిదు ట్రిబ్యునళ్లు .. కృష్ణ, వంశధార, కావేరి, రావి–బియాస్, మహాదాయి వివాదాల కోసం ఏర్పాటయ్యాయి. చిత్రమేమంటే ఈ ట్రిబ్యునళ్ల ఏర్పాటు ఫలితంగా ఒక్కటంటే ఒక్క వివాదం కూడా సమసిపోయిన దాఖలా లేదు. అవి దశాబ్దాలుగా సెగలూ, పొగలూ కక్కుతున్నాయి. హింసనూ, విధ్వం సాన్నీ సృష్టిస్తున్నాయి. ట్రిబ్యునళ్లు సకాలంలో సక్రమంగా తీర్పులిచ్చిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు. ఎప్పటికో తీర్పులిచ్చినా తదుపరి చర్యలు అంతకన్నా నత్తనడకన నడుస్తున్నాయి. ఏ వివాదంపైన అయినా ట్రిబ్యునల్‌ మూడేళ్లలో తీర్పు నివ్వాలని నిబంధన విధించినట్టు చెబుతున్నారు. కావేరీ వివాదంపై 1990లో ట్రిబ్యునల్‌ ఏర్పాటైతే అది తుది తీర్పు వెలువరించేసరికి 17 సంవత్సరాలు పట్టింది. దానిపై కేంద్రం నోటిఫికేషన్‌కు మరో ఆరేళ్లు పట్టింది.

ఈ నేపథ్యంలో మూడేళ్లలోనే తీర్పు వెలువరించడం సాధ్యమేనా? ఎక్కువ సందర్భాల్లో ఇలాంటి జాప్యానికి రాష్ట్రాల్లోని పాలకులకు ఉండే రాజకీయ ప్రయోజనాలు… కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న పాలకులకు ఆయా రాష్ట్రాల్లో ఉండే స్వప్రయోజనాలు మూల కారణమని ప్రతి ఒక్కరికీ తెలుసు. తమ తమ రాష్ట్రాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి వివాదంలో తాము వీరోచితంగా పోరాడుతున్నామన్న అభిప్రాయం కలిగించడానికి పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. అందుకోసం ఎంతవరకైనా వెళ్తున్నాయి. కనుక సమస్య మూలాలు వేరే చోట ఉన్నాయని ముందుగా గుర్తించాలి. అలాంటి రాజకీయ జోక్యాన్ని మొగ్గలోనే తుంచాలి. ఏ వివాదంపైన అయినా వెలువరించే తీర్పులకు నిపుణులిచ్చే సశాస్త్రీయమైన నివేదికలే గీటురాయి కావాలి. ఆ నిపుణుల తటస్థతపై, వారి సమర్ధతపై వివాదంలోని అన్ని పక్షాలకూ విశ్వాసం ఉండాలి.

మహాదాయి నదీ జలాల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై కేంద్రం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..

Must Read

spot_img