Homeఅంతర్జాతీయంకరోనాతో న్యూయార్క్ ప్రజలు ఖాళీ

కరోనాతో న్యూయార్క్ ప్రజలు ఖాళీ

ఎప్పుడూ సందడిగా 24 గంటలూ కదులుతూ విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ ఉండే న్యూయార్క్ నగరంలో క్రమంగా స్థబ్దత చోటు చేసుకుంటోంది. అందుకు కారణం న్యూయార్క్ మహా నగరం ‘ఖాళీ’ అయిపోతోంది. అందుకు కారణం కరోనా మహమ్మారే అంటే అతిశయోక్తి కాదు. గత రెండున్నరేళ్లుగా అమెరికాలో కరోనా బీభత్సం అంతా న్యూయార్క్ నగరంలోనే కనిపించింది. ఎక్కువగా మరణాలు కూడా అక్కడే నమోదయ్యాయి. న్యూయార్క్ నగరంలో ఎన్ని ఆస్పత్రులు ఉన్నా అంత స్థాయిలో రోగులు పోటెత్తడంతో ఏ మూలకూ సరిపోలేదు. దాంతో మరణాల సంఖ్య కూడా దారుణంగా పెరిగింది. ఆనాడు అంటే..2020లో మహమ్మారి సమయంలో వీధులన్నీ ఖాళీ అయ్యాయి.


ఒక ఇల్లు, అందులో ఆఫీస్ పెట్టుకోవటానికి వెనుక ఖాళీ జాగాతో జనం ఇళ్లలోంచే తమ కార్యకలాపాలను నిర్వహించుకున్నారు. మహమ్మారి కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆఫీస్ మీటింగ్‌లలో పాల్గొనటం, ఇంటి నుంచే పని చేయటం వీలవటంతో.. అమెరికాలో మెజారిటీ ప్రజలు బయటకు అడుగుపెట్టలేదు. అలా కనీసం రెండేళ్ల పాటు అక్కడి జనం జీవించారు. కానీ అది నేడు కూడా కొనసాగుతోంది. ఈసారి కరోనా ఉపశమనం కలిగించినా ఎక్కడ చూసినా ఖాళీ ప్రదేశాలు దర్శనమిస్తున్నాయి. అంటే జనం న్యూయార్క్ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. న్యూయార్క్ పొరుగు రాష్ట్రాలలో అవకాశం ఉంటే ఇల్లు కొనుక్కుని జీవిస్తున్నారు. గత ఏడాది కాలంగా న్యూయార్క్‌లోని మన్‌హాటన్ దీవిలో నివసించే జనంలో అత్యధికులు ఇతర నగరాలు, రాష్ట్రాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల కోసం వెతుక్కున్నారు. 2020 మార్చి నాటికి అలాంటి వారి సంఖ్య 2లక్షలుగా ఓ సర్వే చెబుతోంది. న్యూయార్క్ రాష్ట్రంలోని క్వీన్స్, బ్రూక్లిన్ కౌంటీల నుంచి కూడా చాలా మంది బయటకు వెళ్లిపోయారు. క్వీన్స్ కౌంటీ నుంచి 51,000 మంది, బ్రూక్లిన్ కౌంటీ నుంచి 88 వేల మంది వేరే చోటుకు తరలిపోయారు.

ఎన్నాళ్లుగానో నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారంతా ఇప్పుడు ఈ నగరం భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉన్నారు. అయితే ఇదిలాగ కొనసాగితే న్యూయార్క్ నగర జనాభా తగ్గిపోవటం, పన్ను ఆదాయం పడిపోవటం, వ్యాపారాలు తరలిపోవటం అనే విషవలయంలో చిక్కుకుంటుందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానిని నివారించటానికి అధికార యంత్రాంగాలు అత్యవసర చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ‘పార్టనర్‌షిప్ ఫర్ న్యూయార్క్ సిటీ’ అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. వారంలో కొన్ని రోజుల పాటైనా రిమోట్ వర్క్ విధానం – అంటే ఆఫీసుకు వెళ్లకుండా పనిచేసే విధానం ఇక ముందు కూడా కొనసాగుతుందని తేల్చారు. 2021 అక్టోబర్ నాటికి నగరంలోని ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల్లో 54 శాతం మంది ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. ఆఫీసులు, ఇతర పని ప్రదేశాల్లో పనిచేయటం కోసం ప్రతి రోజూ ప్రయాణిస్తున్న వారి సంఖ్య కేవలం 8 శాతంగానే ఉంది. అయితే 2022 ఏప్రిల్ నాటికి రిమోట్‌గా పనిచేస్తున్న వారి సంఖ్య 28 శాతానికి తగ్గింది.

కానీ హైబ్రీడ్ విధానం – అంటే రిమోట్‌గా పనిచేయటం, ఆఫీస్ నుంచి పనిచేయటం రెండూ కలిసి ఉండే కొత్త విధానం ఊపందుకుంది. దీనివల్ల ప్రతి రోజూ ఆఫీసుకు వెళుతున్న వారి సంఖ్య 8 శాతం గానే ఉండిపోయింది. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం.. 16 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తుండగా, కేవలం 9 శాతం మంది మాత్రమే ప్రతి రోజూ ఆఫీసుకు ప్రయాణిస్తున్నారు. ఫలితంగా చాలా వరకు ఆఫీసులు ఖాళీగా బోసిపోయి కనిపిస్తున్నాయి. వీధుల్లో జనం సందడే లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు, నగర నివాసుల నుంచి పన్ను ఎగవేత సమస్య మీద అధ్యయనానికి నగర పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించాయి. ఆ కమిషన్ ఆరు నెలల పాటు అధ్యయనం చేసి తాజాగా నివేదిక ఇచ్చింది.

ఎప్పుడూ రద్దీగా ఉండే న్యూయార్క్ నగరం ఎంత బోసిపోయి కనిపిస్తుందో తెలియాలంటే ఫిఫ్త్ అవెన్యూ, సిక్స్త్ అవెన్యూల మధ్య ఉన్న 57 స్ట్రీట్‌లో నడిచి చూస్తే.. ఏం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చని ఆధ్యయనకర్తలు చెబుతున్నారు. నగరంలో అత్యంత ఖరీదైన వ్యాపార సంస్థలు కొన్ని ఈ వీధిలో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ అనేక షాపులు మూతపడి ఉన్నాయి. చాలా ఆఫీసు భవనాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. వాటి దగ్గర ‘అద్దెకు ఇవ్వబడును’ అని బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ ఆఫీసులను నివాసభవనాలుగా మార్చాలని కమిషన్ తన నివేదికలో సిఫారసు చేసింది. కేవలం జోన్ల విధానం చట్టాన్ని మారిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. మొదటి అంతస్తులో షాపులను అలాగే ఉంచి, మిగతా అంతస్తుల్లో ఆఫీసులను నివాసాలుగా మార్చవచ్చు. దానివల్ల వ్యాపారానికి డిమాండ్ పుడుతుందని తమ నివేదికలో సూచించడం జరిగింది.

జనం వస్తూ వెళ్తూ ఉండటం వల్ల కెఫేల దగ్గర ఆగి ఏమైనా తినటానికి కూర్చోవటం, ఇళ్లకు వెళ్లే దారిలో షాపులో ఏదైనా కొనుక్కోవటం వంటివి జరుగుతాయి. తద్వారా చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలు మనుగడ సాగిస్తాయి. అసలు జనమే లేకుంటే వ్యాపారాలకు అవకాశమే ఉండదు. ఎవరికి వారు అత్యంత సున్నితమైన నగరంగా పేరున్న న్యూయార్క్ అందుకే బోసిపోయి కనిపిస్తోంది. మహమ్మారి వ్యాపించిన మొదట్లో ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయాల్సి వచ్చింది. అప్పటి నుంచీ ఇప్పటి దాకా మళ్లీ ఆఫీసుకు వెళ్లలేదు. చాలా మంది జనం ఇలాగే జీవిస్తున్నారు. మెట్రో రైల్ ఆదాయం పడిపోయింది. షాపులు, బార్లు, రెస్టారెంట్ల మీద కూడా ప్రభావం చూపుతోంది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితులో శాశ్వతంగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కొనసాగించటానికి అవకాశం ఉండాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇంటి నుంచి పని వల్ల ఉద్యోగులకు కొంత స్పేస్ లభిస్తోంది.

సొంత టైమ్‌ ఎక్కువగా లభించటంతో ఉదయం జాగింగ్‌కు వెళుతున్నాడు. ఆ పనులన్నీ చూసుకుని పొద్దున 8 గంటలకల్లా ఆఫీస్ పని కూడా మొదలుపెడుతున్నారు. అయితే జనం తిరిగి వచ్చేలా ఆకర్షించాలంటే ఏం చేయాలన్న విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు న్యూయార్క్ నగరం భవిష్యత్తు.. నగరం విడిచి వెళ్లిపోయిన జనాన్ని తిరిగి రప్పించటం మీద ఆధారపడి ఉంది. నగర జనాభాలో ఆదాయాలు, ఆసక్తుల్లో వైవిధ్యం ఉండేలా చూడాల్సిన అవసరం ఏర్పడింది. కేవలం ఫైనాన్స్, టెక్నాలజీ ప్రొఫెషనల్స్ మీద, న్యాయవాదుల మీద ఆధారపడి ఏ నగరమూ మనుగడ సాగించలేదు. చరిత్రాత్మక న్యూయార్క్ నగరానికి వైభవం తిరిగి రావాలంటే.. కళాకారులను, హోటల్, రెస్టారెంట్ ఉద్యోగులను, ఇక్కడి ఎంటర్టెయిన్మెంట్ రంగంలో పనిచేసే వారిని కూడా నిలుపుకోవాల్సిన అవసరముంది. కోవిడ్ మహమ్మారికి ముందు న్యూయార్క్ నగరాన్ని ప్రతి ఏటా 6 కోట్ల మంది సందర్శించేవారు. ఇందుకు కారణం నగరంలోని బ్రాడ్‌వే, సకల సౌకర్యాలు, అత్యాధునిక థియేటర్లు, రెస్టారెంట్లు లేకపోతే ఆనాడు వచ్చిన పర్యాటకులు ఎన్నటికీ రాకపోవచ్చు.

2024 నుంచి న్యూయార్క్ నగరానికి 10వేల కోట్ల డాలర్ల బడ్జెట్‌లో ప్రతి ఏటా 10 శాతం – అంటే వెయ్యి కోట్ల డాలర్ల లోటు ఉంటుంది. ఇంత పెద్ద లోటును భర్తీ చేయాలంటే ఆదాయం పెంచుకోవటం కానీ, ఖర్చులు తగ్గించుకోవటం కానీ చేయాల్సి ఉంటుంది. అంటే.. పన్నులు పెంచటం, సేవలు తగ్గించటం చేయాల్సి వస్తుంది. 1970లలో న్యూయార్క్ ఇలాంటి విషమ పరిస్థితిని ఎదుర్కొంది. ప్రస్తుతం డెట్రాయిట్ కూడా ఇదే పరిస్థితుల్లో ఉంది

Must Read

spot_img