HomePoliticsకమ్యూనిస్టులకు పట్టున్న స్థానంలో సిట్టింగ్ లకు ఫిట్టింగ్ తప్పదా ?

కమ్యూనిస్టులకు పట్టున్న స్థానంలో సిట్టింగ్ లకు ఫిట్టింగ్ తప్పదా ?

కమ్యూనిస్టులకు పట్టున్న స్థానంలో సిట్టింగ్ లకు ఫిట్టింగ్ తప్పదా ? అధినేత నిర్ణయం, ఆ నేతకు టెన్షన్ పెట్టిస్తుందా ? తన సీటుకు మాతృ సంస్థ ఎక్కడ ఎసరు పెడుతుందోనన్న అనుమానం నిద్రపోనివ్వడం లేదా ? ఒకవేళ పొత్తులో తన స్థానాన్నే కావాలని సీపీఐ కోరితే, ఆ నేత పరిస్థితి ఏంటి ? తప్పని పరిస్థితుల్లో త్యాగం చేయాల్సి వస్తే ఆయన సిద్ధంగా ఉన్నట్టేనా ? మరింతకీ పొత్తుల లెక్కలు కలవర పెడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు.. ?

దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర నాయక్ కీ కొత్త కష్టాలు వచ్చిపడ్డాయని టాక్ వినిపిస్తోంది. సిట్టింగ్ లకే టికెట్ ఇస్తామన్న గులాబీ బాస్ ప్రకటన సైతం ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాస్ నిర్ణయంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా సంబరాల్లో ఉంటే.. ఈయన మాత్రం తెగ టెన్షన్ లో ఉన్నారట. అసలాయన ఆవేదనకు కారణం ఏంటంటే, మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది అధికార బీఅర్ఎస్ పార్టీ.

కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న మునుగోడులో వారితో జతకట్టి సక్సెస్ అయ్యింది. ఇక ఇదే ఫ్రెండ్ షిప్ ను వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలనే భావనలో ఉన్నారు బాస్. దాంతో ఇప్పుడు కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న సెగ్మెంట్ లలో సిట్టింగ్ లకు ఫిట్టింగ్ తప్పదనే టాక్ వెల్లువెత్తుతోంది. ఆ క్రమంలోనే కమ్యూనిస్టుల ఉనికి ఉన్న దేవరకొండలో తన సీటుకు ఎసరు ఖాయమనే భయం పట్టుకుందట ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ కు. గత రెండేళ్లుగా అధికారంలో పాత టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు.

ఈ క్రమంలోనే ఏదైనా పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే అదనపు బలం చేకూరుతుందనే భావనలో ఉన్నారు బాస్.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వామపక్ష పార్టీలు తప్ప ఇతర పార్టీలు తమతో జత కట్టే ఛాన్సే లేదు. అయితే కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు ఖచ్చితంగా పార్టీకి లాభించే అంశమేనా అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో గల 12 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీలు ఈసారి అసెంబ్లీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో ముక్కోణపు పోరు తప్పదనేది రాజకీయ విశ్లేషకుల వాదన.

ఈ తరుణంలో ప్రత్యర్థి పార్టీలను వెనక్కి నెట్టి విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఎర్రజెండా మద్దతు బీఆర్ఎస్ పార్టీకి అవసరం. ఈ నేపథ్యంలో జిల్లాలోని మెజారిటీ నియోజవర్గాల్లో కమ్యూనిస్టు పార్టీలకు కనీసం మూడు వేల నుంచి ఐదు వేల ఓట్లు ఉంటాయని ఇప్పటికే అధికార పార్టీ నేతలు లెక్కలు వేశారు. దీంతో ఆ ఓట్లే బీఆర్ఎస్‌కు అమృతంలా మారే అవకాశం ఉందనే భావనలో ఉన్నారు ఆ పార్టీ అగ్రనేతలు. దీంతో బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు తమకు కలిసి వస్తుందని ఆశతో ఉంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో కొందరికి మాత్రం పొత్తు టెన్షన్ పట్టుకుందట.

పొత్తు పెట్టుకుంటే తమ సీటుకు ముప్పు వచ్చి పడుతుందోనన్న ఆందోళనతో ఉన్నారని టాక్. అలా టెన్షన్ పడుతున్న వారిలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కూడా ఉన్నారని తెలుస్తోంది. ఎందుకంటే సీపీఐ, సీపీఐఎం పార్టీలతో పొత్తు కుదిరితే జిల్లాలో కనీసం ఒక్కో స్థానాన్నైనా కేటాయించాలని ఇరు పార్టీలు కోరే అవకాశం ఉంది. సీపీఎం విషయాన్ని పక్కకు పెడితే సీపీఐ మాత్రం ఖచ్చితంగా దేవరకొండ లేకపోతే మునుగోడును కోరనున్నట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. దేవరకొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉప ఎన్నికతో కలిపి 16 సార్లు ఎన్నికలు జరిగితే ఏకంగా ఏడుసార్లు సీపీఐ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దేవరకొండలో సీపీఐ పార్టీ విజయం సాధించింది.

అసలు విషయం చెప్పాలంటే తెలంగాణలో సీపీఐ గెలిచిన ఏకైక సీటు కూడా దేవరకొండనే.

అక్కడ నుంచి సీపీఐ తరఫున గెలిచిన రవీంద్ర కుమార్, తర్వాత తన అవసరాలో లేక ఇతర కారణాలో తెలియదు కానీ చెప్పాపెట్టకుండా కండువా మార్చేశారు. దీంతో సీపీఐకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కరువైంది.

ఇక ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పొత్తు కారణంగా దేవరకొండలో మరోసారి పోటీ చేసే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు వరంలా అధికార పార్టీతో పొత్తు కుదిరే అవకాశాలే ఎక్కువగా ఉండటంతో దేవరకొండ స్థానం కోసం సీపీఐ జిల్లా నేతలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ దేవరకొండ నియోజకవర్గంలో సీపీఐ పార్టీకి కేడర్ బలంగానే ఉంది. మరోవైపు గతంలో పార్టీ నుంచి గెలిచి కండువా మార్చిన రవీంద్ర కుమార్ ను కూడా దెబ్బకు దెబ్బ తీయాలంటే, ఖచ్చితంగా దేవరకొండ స్థానంలో పోటీ చేయాలని లోకల్ కేడర్‌ కూడా నాయకత్వంపై ఒత్తిడి తెస్తోందట. ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగానే దేవరకొండ స్థానాన్ని సీపీఐకి కేటాయిస్తే తన పరిస్థితి ఏంటా అని రవీంద్ర కుమార్ తీవ్రంగా మధన పడుతున్నారని ఆయన అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. ఒకవేళ సీటును త్యాగం చేసి పోటీకి దూరంగా ఉంటే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశముందని కూడా ఆయన ఆలోచన చేస్తున్నారట. అయితే బీఆర్ఎస్ ఆలోచన మరోలా ఉందట.

ఇప్పటికే రవీంద్ర కుమార్ దేవరకొండ నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించడంతో ఎలాగూ ఓటర్ల నుంచి కొంత వ్యతిరేకత ఉందని భావిస్తోందట. ఈ నేపథ్యంలో సీపీఐకి దేవరకొండను కేటాయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నారట అధిష్టాన పెద్దలు. ఇదే జరిగితే సీపిఐ నేతలు కోరినట్లుగా, ఓ టికెట్ ఇచ్చినట్లూ ఉంటుంది.. ఆ నియోజకవర్గంలో సీపీఐ బలంగా ఉన్నందున గెలిచినట్లూ ఉటుందని పార్టీ ప్రణాళికలు రచిస్తోందని కూడా పార్టీ శ్రేణుల నుంచి టాక్ వినిపిస్తోంది. దీంతో అధినాయకత్వం ఒకవేళ అంచనాలు, ఈక్వేషన్స్ బేరీజు వేసుకుని దేవరకొండ టికెట్ ను సీపీఐకి వదిలేస్తే, రవీంద్ర నాయక్ ఏం చేయనున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరి దేవరకొండలో వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండనుందన్నదే ఆసక్తికరంగా మారిందట.

Must Read

spot_img