HomeFoodఇడ్లీ తిందాం రండి !!!

ఇడ్లీ తిందాం రండి !!!

దక్షిణ భారతదేశంలో ఉదయం లేవగానే దీని ప్రస్తావన లేందే బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం పూర్తి కాదు. ఇడ్లీ అన్న పేరు తెలియని వారు ఉండరంటే అతిశయెక్తి కాదు. అంతలా ఈ ప్రాంతంతో పెనవేసుకుపోయింది ఇడ్లీ. కొన్ని చోట్ల ఇడ్లీ సాంబారు, మరికొన్ని చోట్ల చట్నీతో ఇడ్లీ చాలా పాపులర్ వంటకంగా రూపు దిద్దుకుంది. ఇంతకీ ఇడ్లీ జన్మస్థలం ఎక్కడ జరిగింది. అసలు ఇడ్లీ మన దేశంలో పుట్టలేదా అంటే తాజా పరిశోధనల మేరకు ఇడ్లీ మన దేశంలో పుట్టనే లేదు. ఇది భారతీయ వంటకం కాదు అని చెబుతున్నారు పరిశోధకులు. మనదేశానికి తీసుకురాబడింది. బాగా స్థిరపడిపోయింది. ఇప్పుడు మన దేశంలోని టిఫిన్లలో మకుటం లేని మహారాజుగా వెలిగిపోతోంది ఇడ్లీ. అట్లు, పెసరట్లు, పూరీ, ఉప్మా ఇలా ఎన్ని అల్పాహారాలు ఉన్నా తెల్లగా, మృదువుగా ఉండే ఇడ్లీకి అవేవీ సాటి రావు.

వేడి వేడిగా పొగలు కక్కే ఇడ్లీలను కొబ్బరి చట్నీ, సాంబార్ లేదా ఇడ్లీ పొడితో నంజుకు తింటే రోజు హాయిగా ప్రారంభమయినట్టు ఉంటుంది. నూనె బాధ లేదు. పని కూడా తక్కువ, ఇంటిల్లిపాదికీ ఒకేసారి ఇడ్లీలు పెట్టేయొచ్చు. తింటే తేలికగా జీర్ణమవుతుంది. దక్షిణ భారతదేశంలో ఇడ్లీ దొరకని ప్రదేశం ఉండదు. తెలుగు రాష్ట్రాలలో మినప్పప్పు, బియ్యం రవ్వతో ఇడ్లీలు పెట్టుకుంటే, తమిళనాడు, కర్ణాటక, కేరళలలో మినప్పప్పు, బియ్యంతో ఇడ్లీలు వండుతారు. ఇడ్లీ బియ్యం అని ప్రత్యేకంగా దొడ్డు బియ్యం కూడా ఇక్కడ దొరుకుతాయి. అలాంటి ఇడ్లీ భారతదేశంలో పుట్టలేదనీ, బయటి నుంచి వచ్చిందని తెలిస్తే ఆశ్చర్యం వేయకుండా ఉండదు. దోశ, ఆపం, వడ, బజ్జీ లాంటి టిఫిన్ల గురించి తమిళ సంగం సాహిత్యంలో ఉంది. అంటే ఇవన్నీ మనకు క్రీ.పూ 300 నుంచి తెలుసు. మరి ఇడ్లీ సంగతేంటి? కాదేది కవితకనర్హం అన్నట్టు రీసెర్చీకి ఏ విషయమైనా అవసరమే. భారతదేశంలో తొలిసారిగా కర్ణాటక ప్రాంతంలో రాసిన కావ్యాలలో ఇడ్లీల ప్రస్తావన వచ్చింది. వాటిని అక్కడి వారు ‘ఇడ్డలిగే’ అనేవారని, సంస్కృతంలో ‘ఇడ్డరికా’ అని పిలిచేవారని ఫుడ్ హిస్టారియన్ కేటీ అచ్చయ్య ఓ సందర్భంలొ వివరించారు.

దేని నుంచి ఇడ్లీ అనే పేరు వచ్చింది ?

కన్నడలో అలిగే అంటే ఆవిరి పాత్ర అని అర్థం. దాని నుంచే ఇడ్డలిగే వచ్చి ఉండవచ్చని అచ్చయ్య అంచనా వేశారు. క్రీ.శ. 920లో కన్నడ కవి శివకోటి ఆచార్య రాసిన ‘వద్దరదానే’ అనే కావ్యంలో మొదటిసారి ఇడ్లీ ప్రస్తావన వచ్చిందని ‘ఇండియన్ ఫుడ్: ఏ హిస్టారికల్ కంపానియన్’ అనే పుస్తకంలో అచ్చయ్య రాశారు. ఇంటికి వచ్చిన బ్రహ్మచారికి ఆతిధ్యం ఇచ్చే 18 పదార్థాలలో ఇడ్లీ ఒకటని వద్దరదానే కావ్యంలో రాశారు. ఆ తరువాత పలు రచనలలో ఇడ్లీ ప్రస్తావన వచ్చింది. క్రీ.శ. 1025లో చవుందరాయ అనే కవి ఇడ్లీ తయారీ ప్రక్రియను వివరించారు. మినప్పప్పును మజ్జిగలో నానబెట్టి, మెత్తగా రుబ్బి, దాన్లో మజ్జిగ, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఇంగువ వేసి ముద్దగా చేసేవారని రాశారు. ఆ తరువాత, క్రీ.శ 1130లో ‘మానసోల్లాస’ అనే సంస్కృత గ్రంథంలో ఇడ్లీ ప్రస్తావన ఉందని అచ్చయ్య తన పుస్తకంలో వివరించారు. మానసోల్లాస గ్రంథాన్ని ‘అభిలాషితార్థ చింతామణి’ అని కూడా అంటారు.

దీన్ని చాళుక్య రాజైన మూడవ సోమేశ్వరుడు (క్రీ.శ 1127-1138) రచించాడు. మినప్పప్పును పిండి చేసి, గుండ్రని ఉండలుగా చేసి నేతిలో వేయిస్తారని మానసికోల్లాసలో రాసి ఉంది. ఈ ఉండలపై మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఇంగువ జల్లేవారు. ‘సుశీతా ధవళా శ్లక్ష్ణా ఏతా ఇడరికా వరాః| తస్యైవ మాషపిష్టస్య గోళకాన్ విస్తృతాన్ ఘనాన్|’ అని మానసికోల్లాసలో రాసి ఉందని, ఆ పుస్తకం చదివిన తెలుగు బ్లాగర్ రవి ఈఎన్వీ చెప్పారు. దాని అర్థం “చల్లనివి, తెల్లనివి, మృదువైనవి అయిన ఇడ్లీలు గొప్పవి. వాటిని ఉద్దిపిండితో.. అంటే.. మినప్పిండితో గుండ్రంగా, పెద్దగా, ఘనంగా చేస్తారు” అని. కర్ణాటకలో క్రీ.శ 1235 నాటి ఒక ప్రస్తావనలో ఇడ్లీలను “తేలికైన, విలువైన నాణేల వంటి” పదార్థంగా సూచించారు. తమిళనాడులో 17వ శతాబ్దంలో రచించిన మచ్చపురాణంలో ‘ఇట్టలి’ పేరుతో ఇడ్లీ ప్రస్తావన ఉందని అచ్చయ్య రాశారు. అయితే, పైన చెప్పిన మూడు సందర్భాల్లోనూ ఇడ్లీని తయారుచేయడానికి బియ్యం వాడారన్న ప్రస్తావన లేదు.

తొలినాళ్లలో ఇడ్లీని కేవలం మినప్పప్పుతోనే వండి ఉండవచ్చని అచ్చయ్య భావిస్తున్నారు. అదే కాకుండా, పై మూడు సందర్భాల్లోనూ.. ఆధునిక కాలంలో ఇడ్లీ తయారీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ప్రస్తావించలేదు. ఒకటి.. బియ్యం, మినప్పప్పు పాళ్లుగా తీసుకోవడం, రెండు.. దాన్ని రుబ్బడం, మూడు.. రుబ్బిన పిండిని పులవబెట్టడం. చివరిగా, పులిసిన పిండిని ఆవిరి మీద ఉడకబెట్టడం. ఇడ్లీ తయరీలో ఈ ప్రక్రియలన్నీ ఎప్పుడు వచ్చి చేరాయో చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు పుస్తకాలలో, గ్రంథాలలో దొరకలేదని అచ్చయ్య తన పుస్తకంలో రాశారు.

ఇడ్లీ ని చందమామ తో పోల్చే వారు !!!!

క్రీ.శ 1485, క్రీ.శ 1600 మధ్య ఇడ్లీని చందమామతో పోల్చి చెప్పేవారు. అంటే అప్పటికి ఇడ్లీ తయారీలో బియ్యం వాడడం మొదలుపెట్టి ఉండవచ్చని ఆయన భావించారు. ఇంతకీ ఇడ్లీ ఎక్కడి నుంచి వచ్చింది? అన్న టాఫిక్ కు వద్దాం..నిజానికి భారతదేశానికి ఇడ్లీ ఇండోనేషియా నుంచి వచ్చి ఉండవచ్చని కేటీ అచ్చయ్య తన పుస్తకంలో వివరించారు. ఆయన పరిశోధన ప్రకారం, ఇండోనేషియాలో పదార్థాలను ఆవిరి మీద ఉడకబెట్టడం పురాతన కాలం నుంచి ఉండేది. సోయాబీన్స్, వేరుసెనగపలుకులు, చేపలు మొదలైనవాటిని ఆవిరి మీద ఉడకబెట్టి తినేవారు. ఇండోనేషియాలో పిండిని పులియబెట్టి, ఆవిరి మీద ఉడకబెట్టి వండే పదార్థాన్ని ‘కెడ్లీ’ అనేవారని అచ్చయ్య రాశారు. అటు చైనాలో కూడా ఆవిరి మీద ఉడకబెట్టే పద్ధతి పురాతన కాలం నుంచి ఉంది. 7వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన చైనా బౌద్ధ భిక్షువు హుయెన్ త్సాంగ్ భారతదేశంలో ఆవిరి పాత్రలు లేవు అని తెలిపారు. క్రీ.శ. 8వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్యలో ఇండోనేషియాను పాలించిన హిందూ రాజుల దగ్గర పనిచేసిన భారతీయ వంటగాళ్లు, పెళ్లి కోసం స్వదేశానికి వచ్చినప్పుడు, అక్కడి పులియబెట్టే ప్రక్రియను భారతదేశానికి పరిచయం చేసి ఉండవచ్చని కేటీ అచ్చయ్య వివరించారు.


మినప్పప్పుతో పాటు బియ్యం కలిపితే పిండి బాగా పులుస్తుందని తరువాత కాలంలో భావించి ఉండవచ్చు. అలా, ఇడ్లీ తయారీలో బియ్యం వచ్చి చేరి ఉండవచ్చని ఆయన రాశారు. చెకోస్లోవేకియాలో కూడా ఇడ్లీకి సమానమైన పదార్థాన్ని వండేవారు. దాన్ని ‘నీడ్లీక్’ అని పిలిచేవారు. ఇడ్లీ కాకుండా, కడుబు అనే పదార్థాన్ని కూడా ఆవిరి మీద ఉడికించేవారని, కన్నడ కావ్యాల్లో కడుబు ప్రస్తావన క్రీ.శ. 1430లలో కనిపించిందని అచ్చయ్య వివరించారు. కడుబును ఆకుల్లో చుట్టి ఉడికించేవారు. దాన్నే మనం ఆవిరి కుడుము అంటాం. పులియబెట్టడం, ఇడ్లీ చేసుకోవడం తెలియపోవచ్చుగానీ, ఆవిరి మీద వండడం భారతీయులు ముందే తెలుసునని అచ్చయ్య చెబుతున్నారు. “చైనా యాత్రికుడు హుయెన్ త్సాంగ్ భారతదేశంలో ఆవిరి పాత్రలు లేవు అన్నాడు.

కానీ, దానర్థం మనకు ఆవిరితో వండడం తెలీదని కాదు. భారతదేశంలో సులువైన రీతిలో ఆవిరి పట్టడం తెలుసు. పొయ్యి మీద పాత్రలో నీరు పోసి సలసలా కాగిన తరువాత, సన్నని గుడ్డలో లేదా వెదురు బుట్టల్లో పదార్థాన్ని చుట్టి, పై నుంచి వేలాడ దీసేవారు. లేదా ఆకులు, చిల్లుల పళ్లాల వంటి వాటిని వాడేవారు. కేరళలో పుట్టు వండడానికి, వెదురు బొంగులో పదార్థాన్ని కుక్కి సలసలా కాగురున్న నీటిలో స్థిరంగా నిల్చోబెట్టేబారు. అలాగే, ఇండస్ వ్యాలీ సైట్లలో పొడువుగా, చిల్లులతో ఉండే మట్టి పాత్ర లభ్యమైంది. దీన్నిబట్టి మనం ఆవిరి మీద ఉడికించే వంటలు చేసుకునేవాళ్లమని స్పష్టమవుతోంది.


ఇండోనేషియా నుంచి మన దేశానికి వచ్చి స్థిరపడిందని భావిస్తున్న ఇడ్లీ ఆధునిక కాలంలో ఎన్నో రూపాంతరాలు చెందింది. ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఎంటీఆర్ ఇడ్లీ, కాంచీపురం ఇడ్లీ లాంటివి చాలా ఫేమస్ అయ్యాయి. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యం పొందిన ఆహార పదార్ధం ఇడ్లీ. రవ్వ ఇడ్లీ, రాగి ఇడ్లీ, పొడి ఇడ్లీ, తట్టె ఇడ్లీ, బటన్ ఇడ్లీ, స్టఫ్ఫుడు ఇడ్లీ, ఆఖరుకి షేజువాన్ ఇడ్లీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అంతే కాదు…ఈమధ్యే మరో కొత్త రకం ఇడ్లీ వెలుగులోకి వచ్చింది. చార్‌కోల్ ఇడ్లీ అని పిలిచే నల్లటి ఇడ్లీలు అంటున్నారు

Must Read

spot_img