మైనస్ 8 నుంచి మైనస్ 48 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య ఇళ్లను పాతరేసే హిమపాతం. ఏకధాటిగా వీచే ఈదురుగాలుల కారణంగా ఇంట్లోంచి బయటకు కాలు బయట పెట్టేందుకు వీలు కాని పరిస్తితి. పైగా ఇంట్లోనే ఉంటూ వెచ్చగా ఉండాలనుకుంటే కనీసం కరెంటు లేదు..క్రిస్మస్ , కొత్త సంవత్సర వేడుకల కోసం తెచ్చకున్న సరుకులు అంతకు ముందే వినియోగంచుకోక తప్పని పరిస్థితి. ఈ నరకానికి దూరంగా ఎక్కడికైనా విహార యాత్రలకు వెళదామంటే మంచుతో హైవేలు ఎప్పుడో మూతపడ్డాయి. రైళ్లు, వేలాదిగా విమానాలు రద్దయ్యాయి. రవాణాకు సంబంధించి ఏ రకమైన కదలికలు లేకుండా నిలిచిపోయాయి. తీవ్రమైన మంచు తుఫానుతో ఒక రకమైన బాంబు సైక్లోన్ దెబ్బతో అమెరికాలోని అనేక రాష్ట్రాలు, కెనడాల్లో పరిస్థితి దారుణంగా మారిపోయింది. సర్వసాధారణంగా సమశీతోష్ణంగా ఉండే అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలలోనూ కనీవినీ ఎరుగని విధంగా మారిపోయింది.
ఇప్పటికి మరణాల సంఖ్య 80 దాటిపోయింది. మోకాల్లోతు మంచులో కూరుకుపోయిన ఇళ్లూ వాకిళ్లను శుభ్రం చేసి విద్యుత్ సరఫరాలను పునరుద్దరించి అందరికీ అందుబాటులోకి తెచ్చేలోగా ఇంటా బయటా ఇరుక్కుపోయిన మరెందరికి ప్రాణం మీదికు వస్తుందో చెప్పలేమంటనున్నారు విశ్లేషకులు. అత్యవసర వాహనాలు సైతం కదలడానికి కష్టమవుతున్న ప్రాణాంతక రోడ్లలో మరో వారం రోజుల వరకు పరిస్థితులు ఇలాగే ఉండబోతున్నాయన్న వార్తలు జనం గుండెల్ని గుభేలుమనిపిస్తున్నాయి. కెనడా సరిహద్దు నుంచి మెక్సికో సరిహద్దు వరకు 3 వేల కి.మీలకు పైగా ఇదే దుర్భర వాతావరణం కొనసాగుతోంది. అమెరికా జనాభాలో 60 శాతం మందికి ఏదో రకమైన ఇబ్బంది తప్పడం లేదు. న్యూయార్క్ రాష్ట్రం బఫేలో నగరంలో మంచు తుఫాను గాలులు, హిమపాతం కారణంగా స్తంభించిపోయింది.
నయగరా జలపాతం గడ్డకట్టుకుపోయి వింత సోయగాలు పోతోంది. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద 43 అంగుళాల మేరకు మంచు పేరుకుపోయింది. మరిగే నీటిని గాలిలోకి విసిరితే తక్షణమే మంచు గడ్డగా మారిపోతోంది. ఈ బీభత్సాన్ని చూస్తే ఇది తరానికి ఒకసారి వచ్చే మంచు తుఫాన్ అని ఎందుకంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
అట్లాంటిక్ మహసముద్రం నుంచి వచ్చే తుఫానులు, హరికేన్లు అమెరికాకు కొత్త కాదు. ఉష్ణమండల ప్రాంతాల్లో వేడెక్కిన సముద్రజలాల వల్ల వేసవిలో చక్రవాకాలు ఏర్పడుతుంటాయి. ఆ తుఫానులు తెచ్చే వరదల జలవిలయం మామూలుగా ఉండదు. అదంతా ఒక ఎత్తైతే, తాజాగా విరుచుకుపడ్డ శీతాకాలపు మంచు తుఫాను మరో ఎత్తు. 24 గంటల్లో 24 మిల్లీ బార్స్ అంతకన్నా ఎక్కువగా వాతావరణ పీడనం ఒక్కసారిగా చకచకా పడిపోయి బలమైన తుఫానుగా మారితే దానినే ‘బాంబ్ సైక్లోన్’ అంటారు. ఒక్కసారిగా బాంబు పేలినట్టు పీడనం హఠాత్తుగా పడిపోతుంది. అందుకే దానిని అలా పిలుస్తారు.
ఈదురుగాలులు కన్ను పొడుచుకున్నా కానరానంత తీవ్రంగా హిమపాతం ఉంటుంది. ఈ తుఫానుతో అనూహ్య పరిణామాలు సంభవించాయి. ముఖ్యంగా ఒంటిపై సరైన బట్టల్లేకుండా 5 నిముషాలుంటే చాలు మనిషి మొద్దుబారిపోతాడు. ఇది అంత ప్రమాదకరమైనది కాబట్టే 1980 నుంచి ఈ వాతావరణ పరిస్థితిని శాస్త్రవేత్తలు బాంబ్ సైక్లోన్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు సంభవించిన తుఫానుకు అమెరికా ఇలియట్ అని పేరుతో వ్యవహరిస్తోంది. ఈ తుఫాన్ దెబ్బకు ఒక దశలో 17లక్షల మందికి విద్యుత్ సరఫరా లేక జనం ఇబ్బందులు ఎదుర్కున్నారు. మోన్నటి సోమవారానికి ఆ సంఖ్య 2లక్షలకు చేరడం కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.2021 సంవత్సరంలో లెక్సాస్ ప్రాంతంలో సంభవించిన భీకర హిమపాతం కారణంగా పవర్ గ్రిడ్ విఫలమై, కరెంటు లేక ఇళ్లలోనే 200 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఈసారి వచ్చిన ఇలియట్ బాంబ్ సైక్లోన్ వల్ల అంతటి స్థాయిలో ప్రాణనష్టం జరగలేదు.
కానీ ఆస్థినష్టం బాగా జరిగిందని అంటున్నారు. అమెరికాలో 13.5 కోట్ల మందిని ఇబ్బందుల పాలు చేసిన మంచు తుఫానుతో పంటలు పశువులు చివరకు రైల్వే లైన్లు కూడా దెబ్బతిన్నాయి. పశువులకు దాణా నీరు అందించలేకపోయారు. తుఫాన్ ప్రభావం కారణంగా పెరగనున్న ఆహార ధరలు చాలా కాలం పాటు ఉండిపోనున్నాయి. మరోపక్క వారం రోజులుగా జపాన్ లోనూ శీతాకాలపు సగటుకు దాదాపు మూడు రెట్లు ఎక్కువగా మంచు కరిసి ప్రాణహాని కూడా జరిగిందని వార్తలు వస్తున్నాయి. అమెరికా లాగానే జపాన్ లోనూ రైళ్లు విమానసేవలు రద్దయ్యాయి. కరెంటు కష్టాలు తప్పలేదు. ప్రక్రుతిపై మనం సాగించిన తీవ్ర విద్వంసానికి ఫలితంగా అనుభవిస్తున్న కష్టాలుగా భావించాలి. పర్యావరణ మార్పులు మనపై చూపిస్తున్న ఆగ్రహానికి ప్రతీకలుగా చూడాలి. అరుదుగా వస్తాయనే బాంబ్ సైక్లోన్లు ఆ మధ్య 2019లో రాగా మూడేళ్లకే మరోసారి ఇప్పుడు రావడం చూస్తే వాతావరణం ప్రతీకూలమైపోతోందన్న సూచనలుగా ఉంటున్నాయి.
పర్యావరణ మార్పుల కారణంగా రాబోయే రోజులలో మరిన్ని బాంబు సైక్లోన్లు వస్తాయని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. ఒక్క బఫేలో నగరంలోనే 1976 నాటి రికార్డుకు రెట్టింపు హిమపాతం జరిగింది. ఇవన్నీ పదే పదే మనకు చెబుతున్నది ఒకే ఒక్క హెచ్చరిక..పర్యావరణం కాపాడుకోమనే అంటున్నారు నిపుణులు. ఇంకా ఆలస్యం చేస్తే ప్రపంచానికే ముప్పు తప్పదు అన్న వార్నింగ్ గా భావించాలి. ఇప్పటికే రుతువులు గతులు తప్పాయి. ఈ ఏడాది బ్రిటన్ యూరప్ లలో కనీవినీ ఎరుగని వడగాల్పులు, నిండుగా ప్రవహించే నదులు ఎండిపోవడం దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎండ వాన చలి ప్రతీది గరిష్టానికి చేరుతున్న కాలంలో ప్రపంచం ప్రయాణం చేస్తోంది. మనం చేస్తున్న ప్రక్రుతి విద్వంసం, విడుదల చేస్తున్న గ్రీన్ హౌజ్ వాయువులే మనకు శాపాలుగా మారబోతున్నాయి.
నామమాత్రంగా కాప్ సదస్సులు, ఉత్తుత్తి అమలు కాని తీర్మాణాలు గంభీరమైన ఉపన్యాసాలతో ఉపయోగం లేదు.
అగ్రరాజ్యాల అలక్ష్యం సహా అనేక కారణాలతో పర్యావరణ పరిరక్షణకు పెట్టుకున్న లక్ష్యాలకు ప్రపంచం చేరుకునే దాఖలాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. పర్యావరణ పరిరక్షన బాధ్యత వర్దమాన దేశాలదేనని తప్పించుకోజూస్తే కష్టమే.. ప్రక్రుతి హెచ్చరికల్ని విస్మరిస్తే మూల్యం భారగా ఉండటం అనవార్యంగా జరిగిపోతుంది. అగ్రరాజ్యంలో తాజా మంచు తుఫాను బీభత్సం అచ్చంగా జగత్రపళయంగానే కనిపించింది. ఇది అచ్చం భూమికి అంతం లాంటి హాలివుడ్ సినిమాను తలపించిందంటే అతిశయోక్తి కాదు. ఇకనైనా కళ్లు తెరవకుంటే భూతాపం మనకు మరిన్ని సినిమాలను చూపిస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా ప్రపంచదేశాలు యుధ్దప్రాతిపదిక మీద పారిస్ ఒప్పందాన్ని, కాప్ 27 తీర్మాణాల్ని అనుసరించి భూతాపాన్ని తగ్గిస్తే బెటర్ అంటున్నారు విశ్లేషకులు.